విశాల వినీలాకాశం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే! ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగలిగిన గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) గురించి మనకు తెలిసింది తక్కువే. డైనోసార్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి ఉల్కాపాతమే కారణం. 1908 జూన్ 30న రష్యాలోని సైబీరియాలో అతిపెద్ద ఉల్కాపాతం సంభవించింది. జనసంచారం లేని ప్రాంతం కావడంతో అప్పట్లో పెనువిధ్వంసం తప్పింది. భూమికి చేరువగా ఉండి, వినాశనం సృష్టించగలిగే 16 వేల గ్రహశకలాలను ఇప్పటివరకు గుర్తించారు. రోజుకు సగటున మూడు చొప్పున ఇటువంటి వాటిని కనుగొంటున్నారు. అంతరిక్షంలో పొంచి ఉన్న అపాయాల గురించి అధ్యయనం చేయడంతో పాటు అందరిలో అవగాహన కల్పించడానికి జూన్ 30ని గ్రహశకల దినోత్సవం(ఆస్టరాయిడ్ డే)గా 2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గ్రహశకలాల బారి నుంచి భూమిని కాపాడటం, అందుకు తగ్గ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, భావితరాలకు వీటి గురించిన సమాచారం అందించడం దీని ముఖ్యోద్దేశం.
ఇదీ చదవండి: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ల కోసం పోటీ!
కొన్నే ప్రమాదకరం
సౌర కుటుంబం ఏర్పడిన తరవాత మిగిలిపోయిన వ్యర్థాలే గ్రహశకలాలు. వాస్తవానికి ఇవన్నీ ప్రమాదకరమైనవి కావు. సూర్యుడి నుంచి వీటి దూరం తదితర అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీటిని అయిదు విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో కూపర్ బెల్ట్, ఊట్ క్లవ్డ్ అనే శకల సముదాయాలు నెఫ్యూన్ గ్రహానికి ఆవల కక్ష్యలో తిరుగుతాయి. గురుగ్రహానికి, అంగారకుడికి మధ్య సుమారు 60 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని లక్షల గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. సౌరకుటుంబంలో అతి పెద్ద గ్రహశకలం 'సెరిస్' ఈ బెల్ట్‌లోనే ఉంది. అయితే, సమస్యంతా భూ కక్ష్యకు 20 కోట్ల కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో పరిభ్రమించే గ్రహశకలాల(నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్స్)తోనే! వీటిలో కొన్ని 70 లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో పరిభ్రమిస్తూ భూమికి అత్యంత ప్రమాదకరమైనవిగా మారాయి. భూమి వైపు దూసుకొస్తూ భయాందోళనలు కలిగిస్తున్నాయి.
అపోలో సముదాయానికి చెందిన ఒక గ్రహశకలం సెకనుకు 19 కి.మీ. వేగంతో 2013 ఫిబ్రవరిలో రష్యా భూభాగంలో పడింది. దీని వల్ల వంద కిలోమీటర్ల పరిధిలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. వేల భవనాలు దెబ్బతిన్నాయి. 1,491 మంది గాయపడ్డారు. జపాన్‌పై వేసిన అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తి ఈ ఉల్కాపాతం సందర్భంగా విడుదలైంది. నిరుడు సెప్టెంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో రెండు గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చినట్లు నాసా పేర్కొంది. అందులో సుమారు 22 నుంచి 49 మీటర్ల వ్యాసార్ధంతో కూడిన 2011ఈఎస్4 అనే గ్రహశకలం భూమికి లక్షా 21 వేల కి.మీ. దూరంలో ప్రయాణించింది. తద్వారా అది చంద్రుడి కంటే మూడు రెట్లు ఎక్కువగా భూమికి సమీపంగా వచ్చినట్లయ్యింది. అలాగే, ఈ నెల మొదట్లోనూ కొన్ని గ్రహశకలాలు భూమికి చేరువగా వచ్చాయి. సాధారణంగా 15 మీటర్ల కంటే ఎక్కువ వ్యాసార్ధం కలిగిన ఉల్కలే భూమిని తాకుతాయి. మిగిలినవి గాలిలోనే మండిపోతాయి. ఒక కిలోమీటరు నుంచి ఏడు కి.మీ. పరిమాణంలో ఉండే 22 గ్రహశకలాలు ప్రస్తుతం భూకక్ష్యకు సమీపంలో తిరుగుతున్నాయి. ఒక కి.మీ. కంటే ఎక్కువ వ్యాసార్ధం ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొంటే యాభై వేల మెగా టన్నుల శక్తి వెలువడి ఊహకందని నష్టం వాటిల్లుతుంది. వాతావరణంలో పెనుమార్పులు సంభవించి జీవజాలం మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి: అంతరిక్ష వీధిలో వేసవి సెలవులు గడపొచ్చు!
కొనసాగుతున్న అధ్యయనాలు
విశ్వంలోని 60 శాతానికిపైగా భారీ గ్రహశకలాల గురించి మన దగ్గర ఎలాంటి సమాచారమూ లేదు. చాలా సందర్భాల్లో గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే వరకు శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు. 2008 అక్టోబర్‌లో అయిదు మీటర్ల గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకొచ్చింది. అది సూడాన్ సమీపంలో గాలిలోనే మండిపోయింది. ఇలాంటి ఘటనలే 2014, 2018ల్లోనూ జరిగాయి. ఆయా ఉల్కలను భూ వాతావరణంలోకి అవి ప్రవేశించడానికి 20 గంటల ముందు మాత్రమే కనుగొన్నారు. గడచిన రెండు దశాబ్దాల్లో 47 గ్రహశకలాలు భూమివైపు దూసుకురాగా- వాటిలో ఒక్కదాన్నే శాస్త్రవేత్తలు వారం ముందుగా గుర్తించగలిగారు. కనీసం ఆరు నెలల ముందుగా గుర్తించగలిగితేనే వీటిని ఎదుర్కోగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి ప్రమాదకరమైన గ్రహశకలాలను అంతరిక్షంలోనే విచ్ఛిన్నం చేయడం లేదా వాటి గతి మార్చి దూరంగా పంపడం వంటి వాటిపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తదితర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. 900 మీటర్ల వ్యాసార్ధం కలిగిన 2001డబ్ల్యూఎన్5 అనే గ్రహశకలం 2028 జూన్‌లో భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే, 370 మీటర్ల వ్యాసార్ధం కలిగిన 99942 అపోఫిస్ అనే శకలం 2029 ఏప్రిల్‌లో భూమికి అతి చేరువగా వచ్చే అవకాశముందని అంటున్నారు. గ్రహశకలాల ముప్పును ముందుగానే పసిగట్టి, ఆ మేరకు వాటిని దారితప్పించే పరిజ్ఞానాన్ని సత్వరం అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది!
- అమ్ముల మోహిత్ నాగప్రసాద్
ఇవీ చదవండి: