'యతో ధర్మ స్తతో జయః' అన్నది మహాభారత సూక్తి. దాన్నే భారత న్యాయపాలిక స్వీయ మకుటంగా ధరించింది. తద్వారా- రుజువర్తన, ధర్మనిరతి, దీక్షాదక్షతలతో న్యాయమూర్తులు విధ్యుక్త ధర్మ నిర్వహణలో నెగ్గుకొస్తారన్న అంతర్లీన అభిలాషనూ ప్రకటించింది. ఆ స్ఫూర్తికి నిబద్ధుడై కర్తవ్య నిష్ఠాగరిష్ఠుడిగా పేరున్న ఒక న్యాయమూర్తిని కబళించిన 'రోడ్డు ప్రమాద' వీడియో దేశవ్యాప్తంగా ఎందరెందరినో తీవ్రంగా కలచివేసింది. ఝార్ఖండ్‌లో ధన్‌బాద్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ మొన్న బుధవారం ఉదయపు నడకకు వెళ్ళి తిరిగి ఇంటికి చేరనేలేదు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనను ఆ దారంట పోతున్న వ్యక్తి ఆస్పత్రికి తరలించేసరికే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు తొలుత సాధారణ ప్రమాదంగా భావించినా, ఆపై బయటపడ్డ వీడియో దృశ్యాలు- ఉద్దేశపూర్వకంగానే ఆటోను ఆయనపైకి నడిపినట్లు స్పష్టీకరిస్తున్నాయి.
ఇటీవల పలు మాఫియా హత్యకేసుల్ని విచారించిన న్యాయమూర్తి ఇద్దరు నిందితుల బెయిల్ దరఖాస్తుల్ని తిరస్కరించిన నేపథ్యంలో, ఇదంతా పథకం ప్రకారమే జరిగిందన్న విశ్లేషణను తేలిగ్గా తోసిపుచ్చే వీల్లేదు. అరెస్టయిన ఆటోడ్రైవర్, అతడి సహాయకుడు ఈ ఘాతుకంలో పాత్రధారులుగా దొరికినా- న్యాయమూర్తిని భౌతికంగా అంతమొందించాలన్న పథకరచన చేసిన సూత్రధారుల్ని వెలికి లాగడమే పోలీస్ యంత్రాంగానికి గడ్డు పరీక్ష. జడ్జి హత్యను న్యాయపాలికపైనే దాడిగా అభివర్ణించిన ఝార్ఖండ్ హైకోర్టు, కేసు మూలాలను శోధించే నిమిత్తం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నెలకొల్పింది. దేశమంతటా న్యాయాధికారులు ఎదుర్కొంటున్న బెదిరింపులపై రాష్ట్రాల నుంచి నివేదికలు రాబట్టి, సుప్రీంకోర్టు అవసరానుగుణంగా స్పందిస్తామంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల చిట్టచివరి ఆశాకిరణమైన న్యాయపాలిక పట్ల ఘోరాపచారానికి ఒడిగట్టింది ఎవరైనప్పటికీ, వాళ్లను కఠినాతి కఠినంగా శిక్షించి తీరాలి!
ఆగని మానసిక, భౌతిక దాడులు..
న్యాయవ్యవస్థ సాఫల్య వైఫల్యాలన్నవి న్యాయాధీశుల విశుద్ధ వ్యవహారశైలి, రుజువర్తనలపైనే ఆధారపడి ఉంటాయి. అటువంటి దక్షత, సచ్ఛీలతలకు ఏ కోశానా ఢోకా లేదని నిరూపించుకోవడంలో భాగంగా 'మనకు మనమే ఉదాహరణగా వెలుగొందా'లని లోగడ జస్టిస్ కపాడియా వంటివారు లక్ష్మణరేఖ గీశారు. ఒకపక్క, కోట్లు వెదజల్లి కొందరు న్యాయమూర్తుల్ని మచ్చిక చేసుకునే 'గాలి' సంస్కృతి నిశ్చేష్టపరుస్తున్నా- మరోవైపు, ఎటువంటి ప్రలోభాలకు బెదిరింపులకు లొంగని ధీమంతుల ఉదంతాలకూ దేశంలో కొదవ లేదు. తాము కోరిన విధంగా మసలనివారిని ఎలాగైనా దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా మానసిక, భౌతిక దాడులకు తెగబడే కుయుక్తులది అంతులేని కథ! కీలక కేసు విషయంలో తోటి జడ్జితో ఏకీభవించాల్సిందిగా ఒత్తిళ్లు వస్తున్నాయని ఒకప్పుడు జస్టిస్ కానియా బొంబాయి కోర్టులోనే వాపోయారు.
ఆరేళ్ల క్రితం తమిళనాడులో ఓ మహిళా మేజిస్ట్రేట్ వాహనంపై మూక దాడి ఘటన గగ్గోలు పుట్టించింది. ఏడేళ్ల క్రితం యూపీలో ఒక మహిళా న్యాయమూర్తిపై కొందరు దుండగులు ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారానికి పాల్పడటం జాతిని దిగ్భ్రాంతపరచింది. జడ్జీలపై ఇలా భౌతిక దాడులు పాశవికమని అయిదు నెలల క్రితం కేరళ హైకోర్టు తూష్ణీకరించింది. హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే భర్త కావడం వల్ల మధ్యప్రదేశ్ విచారణాధికారికి బెదిరింపులు ముమ్మరించడం ఇటీవలి బాగోతమే. ఫిలిప్పీన్స్‌లో న్యాయవాదులు, జడ్జీల హత్యోదంతాలు న్యాయపాలిక ఎంతటి పెను ముప్పును ఎదుర్కొంటున్నదో చాటుతున్నాయన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యలు- అంతర్జాతీయంగానూ కర్కశదాడుల ఉద్ధృతికి దర్పణాలు. గతంలో అలహాబాద్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌పై దాడిని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చెప్పినట్లు, ప్రజాస్వామ్య సౌధాన్ని నిలిపే ముఖ్య స్తంభాల్లో న్యాయపాలిక ఒకటి. అదెన్నడూ దృఢత్వం కోల్పోరాదంటే- న్యాయమూర్తులు నిర్భీతిగా నిష్పాక్షికంగా విధులు నిర్వహించగల వాతావరణం దేశంలో సువ్యవస్థితం కావాలి!
ఇదీ చదవండి : 'మీ ఆలోచనలు.. ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి'