అభివృద్ధి కొత్త పుంతలు తొక్కినా అసమానతలు పదిలంగా కొనసాగుతున్న దేశం మనది. అనాదిగా దేశాన్ని వెనక్కిలాగుతున్న స్త్రీ, పురుష అంతరాలను స్వాతంత్య్రానంతరం ఎంతమేరకు తగ్గించుకోగలిగామని ప్రశ్నించుకుంటే మాత్రం సంతృప్తి కలిగించే సమాధానం లభించదు. దేశంలో 2008నుంచి ఏటా జనవరి 24న బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని- రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిలో ఉండగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోక్సో చట్టం..
ఆడపిల్లలకు ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, రక్షణ, భద్రత కల్పించి- వారికి విద్య, ఉపాధి రంగాలతో సహా అన్నింటా సమాన అవకాశాలు కల్పించి; దుర్విచక్షణను అంతం చేయడమే బాలికా దినోత్సవ ఉద్దేశం. బాల్యంనుంచే బాలికలది భారతావనిలో ఆంక్షల మధ్య జీవనం! చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి పదిహేను నిమిషాలకూ ఓ చిన్నారి అత్యాచారానికి గురవుతున్నట్లు 'చైల్డ్ రైట్స్ అండ్ యు' అనే సంస్థ తెలిపింది. అనేక పరిశీలనల ప్రకారం, ఎక్కువగా తెలిసినవారు, పరిచయస్తులే పిల్లలపై ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా వెల్లడవుతోంది. వీటిని అరికట్టడానికి 2012లో 'పోక్సో' చట్టం పట్టాలకెక్కింది. 'లైంగిక నేరాలనుంచి పిల్లలకు రక్షణ' కల్పించేందుకు చేసిన చట్టబద్ధ ఏర్పాటు ఇది.
అవి సర్వసాధారణం
భారతావనిలో ఏటా 27 లక్షలమంది పిల్లలు మరణిస్తుండగా- వారిలో అత్యధికులు ఆడపిల్లలే! అయిదు సంవత్సరాలనుంచి తొమ్మిదేళ్లలోపు వయసున్న బాలికలలో 53శాతం నిరక్షరాస్యులుగా ఉన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం- పద్దెనిమిదేళ్లు నిండని బాలికకు పెళ్ళి చేయడం నేరం. ఇరువైపులా పెద్దమనుషులు, వివాహం చేసుకున్నవారు, చేయించినవారితోసహా శిక్షార్హులవుతారని ఈ చట్టం నిర్దేశిస్తోంది. కానీ, ఆచరణలో ఈ చట్టం ఘోరంగా విఫలమైంది. బాల్య వివాహాలు దేశంలో సర్వసాధారణంగా మారాయి. మరోవంక దేశంలో ప్రతి ఇరువురు బాలికల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. లింగ నిష్పత్తిలో అసమానతలవల్ల దేశంలో క్రమేణా బాలికల సంఖ్య క్షీణముఖం పడుతోంది. దీనివల్ల సామాజిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
బాలికల విద్యపై దృష్టి
ఉపాధి రంగంలో స్త్రీలకు సమాన అవకాశాలు లేక, మానవ వనరులలో సగంగా ఉన్న స్త్రీ శక్తిని ఉపయోగించుకోకపోవడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి నష్టం జరుగుతోంది. ఈ దుర్విచక్షణకు అంతం పలకాలంటే- ఉత్పత్తి, సేవారంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగాల్సి ఉంది. అందుకు వారిని సమాయత్తం చేయాలంటే బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ బాలికలకు మరుగుదొడ్లు, నీటి సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన తక్షణం ఏర్పాటు చేయాలి. తద్వారా బడి మానివేసే బాలికల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇప్పుడున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకం, సర్వశిక్ష అభియాన్ తదితర కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి.
బాల్యం సక్రమంగా గడవాలంటే బాలికలకు సరైన భద్రత, ఆహారం, విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలి. దేశంలో క్రమంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయం ఎప్పుడెలా ఉంటుందో తెలియని జూదంలా మారింది. చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. వీటన్నింటి ఫలితంగా విస్తరిస్తున్న గ్రామీణ పేదరికం బాలికల స్థితిగతులు దిగనాసిగా మారడానికి కారణమవుతోంది. ఏదైనా సంచలనం కలిగించే దారుణమో, హింసాత్మక ఘటనో జరిగినప్పుడు ప్రభుత్వాలు ఓ కొత్త చట్టం తీసుకువచ్చి ఏదో సాధించినట్లు రొమ్మువిరుచుకుంటుంటాయి. కానీ, ఆ చట్టాల అమలులో నిబద్ధత కాసింత కూడా కనిపించడం లేదు. చట్టాల్లో ఏముందన్న దానిపై వాటిని అమలు చేసే యంత్రాంగానికే స్పష్టత ఉండటం లేదు. ఇక సాధారణ ప్రజానీకానికి వాటి గురించి తెలిసే అవకాశాలు చాలా తక్కువ. బాలికలపై హింసకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలు ఆంగ్లంలో ఉండటం అతిపెద్ద లోపం. కాబట్టి వాటిని కనీసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనైనా సరళమైన తెలుగు భాషలోకి మార్చి ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. దేశం సామాజిక ఆర్థిక రంగాల్లో పురోగతి సాధించాలంటే జనాభాలో సగభాగమైన, రేపటి మహిళలుగా ఎదిగే బాలికలపట్ల మానవీయంగా వ్యవహరించడం కీలకం. చట్టాలపై ప్రజానీకంలో అవగాహన కల్పించడంతోపాటు; వాటి అమలుకు క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాల్సిన యంత్రాంగానికి శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ బాలికా దినోత్సవాన్ని ఎప్పటిలా మొక్కుబడిగా కాకుండా- నిరంతర కార్యాచరణకు ప్రేరణగా నిలిచే పథకాల రూపకల్పనకు ఉపయోగించుకోవాలి. చిన్నారుల కళ్ళలో వెలుగు నింపేందుకు ప్రభుత్వాలు సంకల్పం తీసుకోవాలి.
- అనిసెట్టి శాయికుమార్
ఇదీ చదవండి : కూటి కోసం 62ఏళ్ల బామ్మ 'సైకిల్' పాట్లు