ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే జులై 1న కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 109 జతల మార్గాల్లో 151 ప్యాసెంజర్ రైళ్లు నడిపేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఫలితంగా రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు రైల్వేలోకి రానున్నాయి.
"ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా సమయాన్ని తగ్గించడం, ఉద్యోగ కల్పనను పెంచడం, మెరుగైన భద్రత, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించడం, రవాణా రంగంలో డిమాండ్ సరఫరా లోటును తగ్గించడం సహా నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడమే దీని(ప్రైవేటీకరణ) ప్రధాన లక్ష్యం."
-రైల్వే శాఖ
సవాళ్లతో ముడిపడి..
కానీ రైల్వే ప్రైవేటీకరణ సంక్లిష్టమైన ప్రక్రియ అని బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని అన్ని రైల్వేలను తన అధీనంలో ఉంచుకున్న బ్రిటీష్ రైల్వే.. 1993లో పూర్తిగా ప్రైవేటీకరణ బాటపట్టింది. రైల్వే లైన్లలో సర్వీసులను నడిపేందుకు ప్రైవేటు కంపెనీలకు అనుమతిచ్చింది. కానీ రైల్వే మౌలిక సదుపాయాలు, కార్యకలాపాల విభజన విషయంలో దారుణంగా విఫలమైంది. అనంతరం మౌలిక సదుపాయాలు కల్పించే రైల్‌ట్రాక్ సంస్థను జాతీయం చేసింది. అయితే ఇప్పటికీ చాలావరకు లైన్లలో ప్రైవేటు సంస్థలు తమ రైలు సర్వీసులను నడుపుతున్నాయి.
పోలికలు వేరైనా
బ్రిటన్‌తో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నమనే వాదన ఉంది. బ్రిటన్ తరహాలో పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. 'ప్యాసెంజర్ రైళ్లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం... మొత్తం రైల్వే కార్యకలాపాల్లో కేవలం 5 శాతమే' అని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
అయినా సమస్యలే..!
అయినప్పటీకీ అంతర్లీనంగా కొన్ని ఆందోళనలు మెదులుతూనే ఉన్నాయి. ప్రైవేటు రైళ్లు అనుమతిస్తే.. ఈ సంస్థలు భారతీయ రైల్వేతో పాటు ఒకే మౌలిక సదుపాయాల(ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థల)ను ఉపయోగించుకుంటాయి.
తీవ్రమైన పని భారంతో ప్రస్తుతమున్న రైల్వే నెట్వర్క్ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు 12 క్లస్టర్లలో 2023 నుంచి ప్రైవేటు రైళ్లు ప్రారంభమవుతాయి. బెంగళూరు, ఛండీగఢ్, జైపుర్, దిల్లీ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, సికింద్రాబాద్, హావ్‌డా, చెన్నై నగరాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.
స్వతంత్ర సంస్థ కావాలి
ఒకవేళ ఏదైనా సంస్థకు సమయపాలన విషయంలో ప్రాధాన్యాలు ఇచ్చినట్లైతే పక్షపాత ధోరణికి బీజం పడుతుంది. దీంతోపాటు ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రైవేటు రైళ్ల కోసం స్వతంత్ర నియంత్రణ సంస్థను స్థాపించాలనే డిమాండ్ పెరిగిపోతోంది.
ఎందుకంటే ప్రైవేటు రైళ్లు ప్రారంభమైతే వారికి పోటీగా ఉండేది భారతీయ రైల్వే మాత్రమే. ఒకవేళ ప్రైవేటు సంస్థలను భారతీయ రైల్వేనే నియంత్రిస్తే వివాదాల పరిష్కారంలో న్యాయం జరగకపోవచ్చు. విరుద్ధ ప్రయోజనాల సంఘర్షణ తలెత్తే అవకాశం ఉంటుంది.
స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ప్రైవేటు రైళ్లు కార్యకలాపాలు సాగించడంలో సహాయం చేస్తుంది. ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భద్రతా విషయాలను పర్యవేక్షిస్తుంది.
ఛార్జీల సంగతేంటి?
ప్రైవేటు రైళ్లలో ప్రయాణికుల ఛార్జీలను నిర్ణయించే విధానంపై భారతీయ రైల్వే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇది మరో ఆశ్చర్యకరమైన విషయం. ఛార్జీల విషయంలో ప్రైవేటు సంస్థలకే పూర్తి స్వేచ్ఛనిస్తారా? లేదా ప్రభుత్వం ఈ విషయంలో కలగజేసుకుంటుందా?
ప్రైవేటు రైళ్ల ఛార్జీలు పోటీతత్వంతో ఉంటాయని, ఛార్జీలు నిర్ణయించే సమయంలో ఇతర రవాణా సాధనాలైన ఎయిర్లైన్లు, బస్సుల రేట్లను దృష్టిలో ఉంచుకోవాలని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ చెప్పారు. దీంతో ధరలు విషయంలో ఆసక్తి నెలకొంది.
ఆంక్షలు విధిస్తే ముప్పే..!
ఒకవేళ ప్రైవేటు సంస్థలు స్థిరమైన రవాణా ఛార్జీలు, వినియోగానికి అనుగుణంగా ఇంధన ఛార్జీలు భారతీయ రైల్వేకు చెల్లించి... స్థూల ఆదాయంలో వాటాను చెల్లిస్తుందని అని అనుకుందాం. అలాంటప్పుడు రవాణా ఛార్జీల విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించినా ప్రైవేటు సంస్థలకు ఇబ్బందికరంగా మారుతుంది. వారి వ్యాపార మనుగడపై ప్రశ్నలు తలెత్తుతాయి.
మరోవైపు అనుకున్నదానికంటే అధికంగా ఛార్జీలు విధిస్తే ఎయిర్లైన్లు, రోడ్డు రవాణాతో భారతీయ రైల్వే ప్రత్యక్షంగా పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి- సరిహద్దులో బలగాల ఉపసంహరణ తర్వాతే చర్చలు!