ETV Bharat / opinion

ఈ తప్పిదాలతో నేపాల్​ స్నేహాన్ని భారత్ కోల్పోతోందా? - modi

భారత్​- నేపాల్​ మధ్య దూరం పెరిగిపోతోందా? చైనాకు వంతపాడుతూ దశాబ్దాలుగా పెనవేసుకొని ఉన్న బంధాన్ని నేపాల్​ బేఖాతరు చేస్తోందా? అంటే విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. భారత్​ చేసిన దౌత్యపరమైన తప్పులే ఈ పరిస్థితులకు కారణమంటున్నారు. ఈ పరిస్థితులను చైనా పూర్తిగా సద్వినియోగం చేసుకొని నేపాల్​తో బంధం బలపర్చుకుంటోందని స్పష్టం చేశారు.

IS INDIA LOSING OUT ON NEPAL?
దౌత్యపరమైన తప్పిదాలతో నేపాల్​ను భారత్ కోల్పోతోందా?
author img

By

Published : Jul 4, 2020, 4:53 PM IST

భారత్​తో సంబంధాలు బలహీనం చేసుకొని నేపాల్ క్రమంగా దూరమవుతోంది. ఉత్తరాఖండ్​ పితోరాగఢ్​లోని భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేసి నేపాల్​ మ్యాప్​లో కలుపుకున్న తర్వాత తనను పదవి నుంచి తప్పించడానికి భారత్​ ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని కేపీ ఓలి పరోక్ష విమర్శలు చేశారు.

అయితే ఓలి ఆరోపణలను సీనియర్ సహచరులే తప్పుబట్టారు. భారత్​పై చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలని, లేదంటే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం నేపాల్ కమ్యునిస్టు పార్టీలో అంతర్గత పోరాటాలు జరుగుతున్నాయని ఈ విషయం స్పష్టం చేస్తుంది. అంతేగాక భారత్​ సహా ఇతర దేశాలతో ఈ పార్టీకి ఉన్న సన్నిహిత సంబంధాలను వ్యక్తపరుస్తోంది.

సీనియర్ సహచరులను పక్కనబెట్టి పూర్తిగా తానే అధికారం చెలాయించడం వల్ల నేపాల్ ప్రధాని ఓలికి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదని పార్టీ కో-ఛైర్మన్ ప్రచండ... ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ఎన్​సీపీ విదేశీ వ్యవహారాలకు బాధ్యుడైన మాధవ్​ నేపాల్​ను సంప్రదించకుండానే కమ్యునిస్టు పార్టీ ఆఫ్ చైనాతో గతనెలలో పార్టీ స్థాయి చర్చలు నిర్వహించారు ఓలి. మరోవైపు పార్టీలో రెండు కీలక స్థానాలను తన చేతుల్లో పెట్టుకున్నారు. పాలనాపరమైన విషయాలతో పాటు ఆర్థిక వ్యవహారాలను ప్రత్యక్షంగా లేదా తన అనుచరుల ద్వారా నడిపిస్తున్నారు. ఇది పార్టీ నియమాలకు విరుద్ధం.

భారత్​ వ్యతిరేక వ్యూహం

ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ఓలి విఫలమయ్యారు. కరోనాను నియంత్రించలేకపోయారు. అవినీతిని కట్టడి చేయలేదు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఎంసీసీ పథకం కింద అమెరికా ప్రకటించిన 500 మిలియన్ డాలర్ల సహాయాన్ని ఓలి వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం, పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది.

పార్టీలో ఒంటరిగా మారడం వల్ల ప్రతిపక్షనాయకులను సంప్రదిస్తున్నారు ఓలి. ఓలికి ప్రతిపక్ష 'నేపాలీ కాంగ్రెస్' అధ్యక్షుడు షేర్ బహదూర్ దియోబ నిశబ్దంగా మద్దతు ఇస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రజల దృష్టిని ఇతర సమస్యలవైపు మళ్లిస్తున్నారు. చైనా మద్దతుతో భారత వ్యతిరేక జాతీయవాద భావనను ప్రోత్సహిస్తున్నారు. 2015లో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు, 2017 పార్లమెంట్ సమయంలోనూ ఓలి ఇదే మార్గాన్ని అనుసరించారు. తాజాగా మ్యాప్​ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు.

భారత భూభాగంపై హక్కులు వంటి విషయాలను ప్రస్తావించి నేపాల్​లో జాతీయవాదాన్ని పెంచి, జాతీయవాద నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలోని వ్యతిరేకులతో పాటు తన విమర్శకులను అణచివేసేందుకు ఈ ప్రయత్నాలన్నీ చేశారు.

తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని ప్రోత్సహించడానికి మూడు అంశాలు ఓలికి సహకరించాయి. మొదటిది నేపాల్​లోని యువత. దేశ జనాభాలో 65 శాతం యువతే ఉంది. భారత దేశంతో రోటీ- బేటీ సంబంధాలు వారిని ఆకట్టుకోలేదు. అభివృద్ధి, సౌకర్యవంతమైన జీవితాలు అందించేందుకు భారత్​ తగిన సాయం చేయడంలేదని వారు ఊహించుకున్నారు.

రెండోది

గతకొన్నేళ్లుగా నేపాల్ యువతను ఆకట్టుకునే విధంగా ఆ దేశంలో భారత్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఉదాసీనత, అహంకారం, బలవంతపు దౌత్య విధానాల ద్వారా నేపాల్​ అంతర్గత వ్యవహారాలను నిర్వహించే దేశంగా భారత్​ను పరిగణిస్తోంది అక్కడి యువత.​ 2015 సెప్టెంబర్​లో నేపాల్ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం, అదే ఏడాది ఐదు నెలల పాటు నేపాల్​పై ఆర్థిక నిర్బంధం విధించడం వంటివి భారత వైఖరికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు.

మూడు

దౌత్యపరంగా భారత్​ చేసిన తప్పులు.. నేపాల్​లోని సాధారణ ప్రజలను దూరం చేశాయి. ప్రజలకే కాకుండా నేపాల్​ నాయకత్వానికీ భారత్ ఏవిధంగానూ సహాయం చేయలేదు. 2015 నుంచి కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్​కు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

తదనంతర పరిస్థితుల్లో నేపాల్​ నుంచి గట్టి వ్యతిరేకత రావడం వల్ల భారత్​ తన వైఖరిని మార్చుకుంది. నేపాల్ పట్ల మృదు స్వభావాన్ని అవలంబించింది. ఆ దేశంలో చేపట్టిన రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఆయిల్ పైప్​లైన్ కనెక్షన్ల పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించింది. కానీ ఇవేవీ ప్రస్తుతం నేపాల్​ నాయకత్వంపై కానీ, అక్కడి ప్రజలపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. భారత్​కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన జాతీయవాదాన్ని అదుపుచేయలేకపోయాయి.

మధ్యలో చైనా

నేపాల్​లో భారత్​ పట్ల పెరిగిపోతున్న వ్యతిరేకతను చైనా రెండు చేతులా అందిపుచ్చుకుంది. వాణిజ్య రవాణాకు చైనా ఓడరేవుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించింది. నేపాల్​లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను నిర్మించింది.

పనిలోపనిగా తన కుటిల నీతిని ప్రదర్శించింది. నేపాల్ రాజకీయాల్లో అవినీతిని ప్రోత్సహించింది. అధికార కమ్యునిస్టు పార్టీపై దృష్టిసారిస్తూనే రాజకీయ ఉన్నత వర్గాలను ఆకర్షించుకుంది. చైనా రాయబారి.. కమ్యునిస్టు పార్టీ ఉన్నత స్థాయి నేతలను గత కొద్ది నెలలుగా తరచుగా కలుసుకోవడం అక్కడి మీడియా కంటపడింది. ఇటీవల ప్రభుత్వం, పార్టీలో మొదలైన అభిప్రాయభేదాలను తొలగించడానికే నేతలతో చైనా రాయబారి సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.

చైనాకు అనుకూలంగా నేపాల్ వాదన

కాలాపానీ విషయంలో చైనా బహిరంగంగా నేపాల్​కు మద్దతు ఇవ్వలేదు. ఎందుకంటే లిపులేఖ్​ పాస్​ను భారత్​ చైనాలకు సంప్రదింపుల కేంద్రంగా ఇదివరకే గుర్తించింది. వాణిజ్య, సాంస్కృతిక విషయాల్లో 1954, 2015లో చేసుకున్న ఒప్పందాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే నేపాల్ చేస్తున్న వాదన చైనా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంది. భారత్​-నేపాల్ మధ్య ఇటీవల పెరుగుతున్న వ్యత్యాసాలు చైనా-నేపాల్ ఆర్థిక, వ్యూహాత్మక ఏకీకరణకు దోహదం చేస్తాయి.

బంధం సమీక్షించుకోవాలి

నేపాల్​తో దశాబ్దాలుగా దృఢమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ.. ఆ దేశంలో చైనా జోక్యాన్ని తగ్గించడం భారత్​కు చాలా కష్టం. నేపాల్​ పట్ల భారత్​ అనుసరిస్తున్న వైఖరిని పూర్తిగా సమీక్షించుకోవడం ఇప్పుడు అవసరం. దౌత్యపరంగా హిమాలయ దేశంతో సున్నితమైన విధానాలు అవలంబించాలి. భారత్​- నేపాల్ సంబంధాల విషయంలో చైనా ఎప్పుడూ ప్రతికూలంగా ఉందన్న చరిత్ర సాక్ష్యాలను గుర్తుంచుకోవాలి.

(రచయిత- ఎస్​డీ ముని, జేఎన్​యూ గౌరవ ప్రొఫెసర్, భారత ప్రభుత్వ ప్రత్యేక రాయబారి)

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.