భూతాపం అంతకంతకూ పెరుగుతోంది. ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. భారత్‌లో ఈ శతాబ్ది చివరి నాటికల్లా సరాసరి ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందంటూ కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర అధ్యయన శాఖ ఇటీవలి నివేదిక హెచ్చరించింది. అనూహ్య వాతావరణ మార్పుల వల్ల భారీ ఎత్తున ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లే అవకాశాలు అధికమవుతాయి. 1901-2018 మధ్యకాలంలో భారత్‌లో సరాసరి ఉష్ణోగ్రతలు 0.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని తాజా అధ్యయనం పేర్కొంది. భూతాపాన్ని కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందం అమలు కార్యాచరణలో నీరుగారడంతో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 15 నగరాల్లో పది భారత్‌లోనే ఉండటం గమనార్హం. శిలాజ ఇంధనాల వినియోగం మూలంగా వెలువడే కర్బన ఉద్గారాలు సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు (యూవీ) నేరుగా భూమిని తాకడం, గాలిలో తేమశాతం తగ్గిపోతుండటం వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయి. భూ ఉపరితలంపై రేడియేషన్ ప్రభావాన్ని సూచించే యూవీ సూచీలో హైదరాబాద్ తీవ్ర రేడియేషన్ జాబితాలోకి ఎక్కడం నగరాలు వేడెక్కుతున్న పరిస్థితులకు నిదర్శనంగా చెప్పవచ్ఛు
పట్టణాలు, నగరాలపై ఒత్తిడి
నగరాలు పట్టణాల్లో వేడి ఎక్కువవుతుండటానికి మానవ కారక చర్యలే ప్రధాన కారణమన్నది కఠోర వాస్తవం. పట్టణాలకు చేరువలోనే ఉన్న గ్రామీణ, సబర్బన్ ప్రాంతాలతో పోల్చి చూస్తే పట్టణ ప్రాంతాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్య సమస్యకు మండేఎండలు, వడగాలులు కూడా తోడవడంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 2001 నుంచి 2017 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 44 ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో, వాటిని ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని కాలాల్లో నమోదైన భూమి ఉపరితల ఉష్ణోగ్రతలను ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తల బృందం ఈ మధ్యే పరిశీలించింది. ఈ బృందం విడుదల చేసిన అధ్యయన పత్రం వేడెక్కుతున్న నగరాలకు సంబంధించిన పరిస్థితులను కళ్ళకు కట్టింది. అత్యధిక శాతం నగరాల్లో రుతుపవన, రుతు పవనాంతర కాలంలోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీలు అధికంగా పెరిగాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోనూ ఇదే తరహాలో పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైనట్లు మరో అధ్యయనంలోనూ వెల్లడైంది. జనంతో కిటకిటలాడే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో- పొరుగున ఉండే పట్టణ ప్రాంతాల్లో కంటే రెండు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు ఉంటే ఆయా నగరాలు, పట్టణ ప్రాంతాలను పట్టణ ఉష్ణదీవులు (అర్బన్ హీట్ ఐలాండ్స్-యూహెచ్‌ఐ)గా భావిస్తున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం, సూక్ష్మ ధూళి కణాలు వాతావరణంలో కలిసి వాయు నాణ్యతను క్షీణింపజేస్తున్నాయి. ఫలితంగా నగరాలు, పట్టణ ప్రాంతాలు అతిగా వేడెక్కుతున్నాయి. దీంతో వేడి వాతావరణాన్ని ఇష్టపడే జాతులైన బల్లులు, తొండలు, ఊసరవెల్లులకు పట్టణ ప్రాంతాలు, నగరాలు ఆలవాలంగా మారే ప్రమాదముంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ; బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, ఎలెక్ట్రానిక్ సిటీ, వంటి ప్రాంతాలు పట్టణ ఉష్ణదీవులుగా రూపొందుతున్నాయి.
భూతాపాన్ని తగ్గించాలి
పట్టణ ప్రాంతాలు వేడెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేడు మన ముందుంది. ఇళ్ల పైకప్పులను హరితమయంగా మార్చేందుకు మిద్దెతోటల్ని విరివిగా పెంచాలి. నల్లని తారుకు బదులుగా లేతవర్ణం కాంక్రీటు మిశ్రమాలను రహదారుల నిర్మాణంలో వినియోగించాలి. సున్నపురాయి మిశ్రమాలను వాడి బూడిద రంగు దారులను నిర్మించడం ద్వారా వేడెక్కడాన్ని నియంత్రించవచ్ఛు మొక్కలు నాటే కార్యక్రమాలను ఊరూవాడా ఉద్యమ స్థాయిలో చేపట్టి, వాటిని నిరంతరం సంరక్షించుకునే కార్యాచరణను అనుసరించాలి. పచ్చని చెట్లు వాతావరణ ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. కాలుష్య కారక వాయువులను గ్రహించి స్వచ్ఛమైన ప్రాణ వాయువును ఇస్తాయి. పరిసరాల్లోని గాలిని శుభ్రపరచి పట్టణాలు, వీధులను చల్లబరుస్తాయి. విద్యుత్తు వినియోగాన్ని తగ్గిస్తాయి. నేలల క్రమక్షయాన్ని నియంత్రిస్తాయి. ప్రజలను అతినీల లోహిత కిరణాల బారిన పడకుండా కాపాడతాయి. వృక్షాలు భూమండలానికి హరిత రక్షణ కవచాలుగా పని చేస్తాయి. భూతాపాన్ని తగ్గిస్తూ మన నగరాలు, పట్టణాలు, సుస్థిరాభివృద్ధి దిశగా సాగేలా దోహద పడతాయి.