ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్య దేశమైన సైప్రస్‌తో సంబంధాలు భౌగోళికంగా, రాజకీయపరంగా న్యూదిల్లీకి చాలా కీలకం. భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న తుర్కియేను కట్టడి చేసేందుకు ఇవి దోహదపడతాయి. 1960లో సైప్రస్‌కు బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం లభించింది. 1974లో తుర్కియే సైప్రస్‌లో ముస్లిములు నివసించే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొంది. దీంతో సైప్రస్‌లో దాదాపు మూడోవంతు భూభాగం అంకారా నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఉత్తర సైప్రస్ పేరిట ఆక్రమిత ప్రాంతంతో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసినా, పాలన మాత్రం అంకారా కనుసన్నల్లోనే జరుగుతోంది. రాజధాని నికోసియాను సైతం తుర్కియే రెండుగా విభజించింది. ఐరాస, అంతర్జాతీయ సమాజం, గ్రీక్ క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే సైప్రస్ దక్షిణ భాగంలోని ప్రజలు ఈ విభజనను ఏమాత్రం అంగీకరించలేదు. ఉద్రిక్తతలను నిరోధించేందుకు రెండు భాగాల మధ్య శాంతి పరిరక్షక దళంతో ఐరాస బఫర్‌జోన్ ఏర్పాటు చేసింది. 2004లో సైప్రస్ (దక్షిణ ప్రాంతం) ఈయూ సభ్యత్వం తీసుకుంది. రెండు భాగాల విలీనానికి 2015లో చర్చలు మొదలైనా ఎంతోకాలం సాగలేదు. తుర్కియే మాత్రం సైప్రస్ జలాల్లోకి చొరబడటం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.
భారత్‌తో దౌత్య సంబంధాలు...
భారత్, సైప్రస్ మధ్య 1962లోనే దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఐరాస భద్రతా మండలిలో మనదేశ శాశ్వత సభ్యత్వ డిమాండుకు సైప్రస్ మద్దతు పలికింది. కశ్మీర్ విషయంలోనూ అంతర్జాతీయ వేదికలపై న్యూదిల్లీకి ఆ దేశ మద్దతు లభిస్తోంది. తుర్కియేతో జరుగుతున్న వివాదంలో అంతర్జాతీయ వేదికలపై తమకు భారత్ మద్దతివ్వాలని సైప్రస్ బలంగా కోరుకొంటోంది. ఆ దేశంలో ఐరాస చేపట్టిన శాంతి పరిరక్షక ఆపరేషన్లలో మన సైన్యం పాల్గొంది. ఉత్తర సైప్రస్‌కు ఇండియా గుర్తింపు ఇవ్వలేదు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ నిరుడు ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని న్యూదిల్లీ తీవ్రంగా పరిగణించింది. అనంతరం కొన్ని గంటల్లోనే మన విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తుర్కియే విదేశాంగ మంత్రి మెవ్లెట్ కవుసోగ్లూ వద్ద సైప్రస్ అంశాన్ని లేవనెత్తారు. తాజాగా సైప్రస్ పర్యటనలో ఇండియా వైఖరిని జైశంకర్ మరోసారి పునరుద్ఘాటించారు. అంకారా మద్దతు ఉన్న ఉత్తర సైప్రస్‌ను బలపరచబోమనే సంకేతాలు పంపారు.
ఇండియా నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో సైప్రస్ 92వ సభ్యదేశంగా చేరింది. ఇరుదేశాల మధ్య విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారులు సులభంగా ప్రయాణించేందుకు అవసరమైన అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. ఉభయ దేశాల మధ్య సైనిక సహకారానికి ఒప్పందం కుదిరింది. దీంతో ‘భారత్‌లో తయారీ’ కింద ఆయుధాల ఎగుమతికి మార్గం సుగమమైంది. అంతేకాదు- భవిష్యత్తులో తుర్కియేకు అత్యంత సమీపంలోని సైప్రస్ రేవులకు మన నౌకాదళం వెళ్ళడంతోపాటు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేపట్టే అవకాశాలున్నాయి.
ఆస్ట్రియాతో కొత్త అడుగులు
కొత్త సంవత్సరం తొలిరోజు జైశంకర్ ఆస్ట్రియాను సందర్శించారు. 27 ఏళ్ల తరవాత మన విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఆ దేశాన్ని సందర్శించడం దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకొంది. వియన్నా కేంద్రంగా పనిచేసే ‘వాసెనార్ అరేంజ్‌మెంట్’ ప్లీనరీ ఛైర్మన్‌గా భారత్ అదే రోజు బాధ్యతలు చేపట్టింది. ఈ సంస్థ సంప్రదాయ ఆయుధాలు, ద్వంద్వ వినియోగ (పౌర-సైనిక) సాంకేతికతల ఎగుమతులను నియత్రించడంపై పనిచేస్తుంది. తుర్కియేకు ఇందులో సభ్యత్వం ఉన్నందువల్ల, అంకారా నుంచి ఇస్లామాబాద్‌కు ప్రమాదకర సాంకేతికతల బదలాయింపును అడ్డుకొనేలా న్యూదిల్లీకి అవకాశం లభించింది. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా జైశంకర్ తొలిసారి ఆస్ట్రియా, స్లొవేకియా, చెక్‌రిపబ్లిక్ విదేశాంగ మంత్రులతో సమావేశమై, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ సంక్షోభం విషయమై ఇండియాపై గుర్రుగా ఉన్న ఈయూ వైఖరిలో మార్పు తెచ్చేందుకు ఈ చర్చలు కొంత ఉపయోగపడనున్నాయి. జైశంకర్ పర్యటనతో భారతీయుల వలసలపై ఆస్ట్రియాతో తలెత్తిన అభిప్రాయ భేదాలను పరిష్కరించుకొనే దిశగా అడుగులు పడ్డాయి. వలసలకు సంబంధించి ఇరు దేశాలు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఫలితంగా వర్క్ పర్మిట్ లేకుండానే మన విద్యార్థులు, సందర్శకులు ఆరు నెలలపాటు ఆస్ట్రియాలో పనులు చేసుకొనే వెసులుబాటు కలిగింది. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడంపైనా ఈ పర్యటనలో భారత్ ఎక్కువగా దృష్టి పెట్టింది.
-పెద్దింటి ఫణికిరణ్