ఈ దశాబ్దం చివరికల్లా మలేరియాను దేశంనుంచి తరిమికొట్టాలనే లక్ష్యంతో (Malaria Vaccine India) భారత్ ముందడుగు వేస్తోంది. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన మలేరియా టీకా (ఆర్‌టీఎస్, ఎస్) వినియోగంపై భారత్ సహా, ఇతర మలేరియా ప్రభావిత దేశాలు ఎంతో ఆసక్తిని, ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తున్నాయి. మలేరియా పరాన్నజీవులను నియంత్రించేందుకు రూపొందిన తొలి టీకా ఇది. మూడు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనల తరవాత ఆవిష్కృతమైన ఈ టీకాను (Malaria Vaccine India) నాలుగు డోసుల్లో తీసుకోవలసి ఉంటుంది. మొదటి మూడు డోసులను అయిదు నుంచి పదిహేడు నెలల వయసులో, నాలుగో డోసును పద్దెనిమిది నెలల తరవాత అందిస్తారు. మలేరియా పరాన్నజీవిపై ఈ టీకా ముప్ఫై శాతమే ప్రభావం చూపుతుందని, అయినప్పటికీ మలేరియా మరణాలను డెబ్భై శాతం మేర తగ్గిస్తుందని వివిధ దశల్లో జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కొరకరాని కొయ్యగా..
ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు ద్వారా సంక్రమించే ప్లాస్మోడియం జాతి పరాన్నజీవుల వల్ల మలేరియా సోకుతుంది. ఇది కాలేయంతో పాటు ఇతర శరీర అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2019లో దాదాపు ఇరవైమూడు కోట్ల మంది మలేరియా బారినపడ్డారు. నాలుగు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2.75 లక్షల మంది అయిదేళ్లలోపు చిన్నారులే. 130 ఏళ్ల క్రితం మన దేశంలోనే సర్ రొనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవిని కనుగొన్నారు. అప్పటి నుంచి దాని కట్టడికి టీకాను (Malaria Vaccine India) తయారు చేసేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తూ విఫలమవుతూ వచ్చాయి. రెండు రకాల అతిథేయుల్లో (దోమ, మానవులు) మనుగడ సాగించగలగడం, వివిధ జీవ దశలుండటం, తరచుగా ప్రతిజనకాల స్వరూపాన్ని మార్చుకొనే వీలుండటం వల్ల మలేరియా ప్రభావిత దేశాలకు ఈ పరాన్నజీవులు కొరకరాని కొయ్యలా మారాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మలేరియా శాపంగా పరిణమిస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్‌లో (Malaria Vaccine India) ఏటా 7.5 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యేవి. ప్రపంచ మలేరియా నివేదిక-2020 ప్రకారం ఇండియాలో మలేరియా కేసుల్లో 71శాతం క్షీణత కనిపించింది. మరణాలూ దాదాపు 74శాతం తగ్గాయి. టీకా లేకపోయినా వ్యాధి కట్టడిలో భారత్ దశాబ్దాల కృషి వల్ల ఇది సాధ్యమయింది. జాతీయ మలేరియా నియంత్రణ, నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా పరిసరాల్లో డీడీటీ వంటి క్రిమిసంహారక రసాయనాలు, కీటకనాశనులు చల్లారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆరంభంలో ఇవి సత్ఫలితాలనిచ్చాయి.
1960వ దశకం చివర్లో, 1970వ దశకంలో మలేరియా కేసులు (Malaria Vaccine News) ఒక్కసారిగా పెరిగాయి. పట్టణీకరణ వల్ల ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసవెళ్ళినవారు మలేరియా పరాన్నజీవులను వ్యాపింపజేయడమే దీనికి ప్రధాన కారణం. దోమల నియంత్రణలో వాడే క్రిమిసంహారాలు తగినంతగా లభ్యం కాకపోవడం, పర్యవేక్షణ లోపాలూ తోడయ్యాయి. ఫలితంగా 1970వ దశకంలో మలేరియా నివారణపై (Malaria Vaccine News) మన విధానాలను పునస్సమీక్షించుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా దోమల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, దోమ తెరలు, దోమలను పారదోలే రసాయనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, మలేరియా వ్యాధిని సులువుగా, సత్వరమే గుర్తించేందుకు వీలయ్యే పరీక్షలను అభివృద్ధి చేయడం, వ్యాధి నిర్ధారణకు తగినన్ని సూక్ష్మదర్శినులు కొనుగోలుచేయడం, వ్యాధిని కలిగించిన పరాన్నజీవి రకం ఆధారంగా మందులు ఇవ్వడం తదితర చర్యలు చేపట్టారు. ఆ తరవాత జాతీయ మలేరియా నిర్మూలన ఫ్రేంవర్క్ 2016-2030 అనే బృహత్ కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టింది. 2030 నాటికి దేశం నుంచి మలేరియాను సంపూర్ణంగా పారదోలాలని లక్ష్యంగా పెట్టుకుంది.
'స్మార్ట్' సమరం
ప్రస్తుత టీకా ప్లాస్మోడియం 'ఫాల్సిపారం' పరాన్నజీవిపైనే ప్రభావం చూపుతుంది. 'వైవాక్స్' లాంటి ఇతర ప్లాస్మోడియం జాతి పరాన్నజీవుల ద్వారానూ వ్యాధి సంక్రమించగల భారత్ వంటి దేశాల్లో పూర్తి స్థాయిలో మలేరియా నిర్మూలన అంత తేలిక కాదు. దీనికోసం సంప్రదాయ నియంత్రణ చర్యలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టం' విధానానికి రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా దోమలు వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సెన్సర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ దోమల సాంద్రత, వాటి జాతులతో పాటు లింగ నిర్ధారణ వివరాలూ సెన్సర్లకు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరతాయి. తద్వారా ఆయా ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. డెంగీ, చికున్‌గన్యా, జికా వంటి వాటికి వాహకాలుగా పనిచేసే ఇతర దోమ జాతులనూ గుర్తించి నివారించవచ్చు. ఈ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పినట్టుగా టీకా వినియోగంతో పాటు దోమలు, వ్యాధి నియంత్రణకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకొంటేనే మలేరియా నిర్మూలనలో భారత్ లక్ష్యం నెరవేరుతుంది.
- డాక్టర్ మహిష్మ.కె
ఇదీ చూడండి : భారత్‌పైకి భూటాన్ అస్త్రం.. మరో కుట్రకు తెరలేపిన చైనా