ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ అతలాకుతలం చేసింది. ఆ మహమ్మారి నియంత్రణకు చేపట్టిన దీర్ఘకాలిక 'లాక్‌డౌన్' ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఆదాయాలు పడిపోయాయి. ఫలితంగా 2020-21లో ప్రతికూల వృద్ధిరేటు నమోదైంది. ఇది దాదాపు (-) 7.5 శాతం ఉండవచ్చని రిజర్వ్ బ్యాంకు తాజా అంచనా. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టి వృద్ధివైపు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కింద ఆర్థిక ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం ఉద్దీపన విలువ రూ.29,87,647 కోట్లు. ఇది జీడీపీలో 15శాతం. ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగం తొమ్మిది శాతం; మిగిలినది ఆర్బీఐ వివిధ రూపాల్లో ప్రకటించింది. మొదటి ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థలోని బలహీన వర్గాలపై గురిపెట్టింది. వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు 'క్రెడిట్ గ్యారెంటీ' పథకం రూపంలో ప్రోత్సాహకాలిచ్చింది. రెండో ప్యాకేజీ ద్వారా ప్రైవేటు వినియోగాన్ని పెంచే ప్రయత్నం చేసింది. ఆర్థిక వ్యవస్థలో సరఫరా కారకాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే దేశ ఆర్థిక వృద్ధిలో కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్నది వినియోగ డిమాండు. ఇది కొంతకాలంగా కుదించుకు పోయింది. ప్రైవేటు తుది వినియోగ వ్యయ వృద్ధి రేటు 3.1 శాతాని(18 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి)కి పడిపోయింది. అంతేకాక జీడీపీలో ఇది ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి (57.7 శాతం) చేరింది. ఈ సంకట స్థితిలో ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపి ఆర్థిక వృద్ధిని ఉరకలెత్తించడానికి సరఫరా కారకాల కంటే గిరాకీని ప్రేరేపించే కారకాలే శరణ్యం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం మూడో ఉద్దీపన చర్యల్లో ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే విధానాలకు ప్రాధాన్యమిచ్చింది. కార్మిక విపణి, ఒత్తిడికి గురైన రంగాలు, సాంఘిక సంక్షేమం, తయారీ, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు, వ్యవసాయం వంటి బహుళ రంగాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవస్థలో డిమాండును ప్రేరేపించాలన్నది ప్రధాన ఉద్దేశం.
డిమాండులో స్తబ్ధత
సామాజిక, ఆర్థిక నిర్మాణంలో (పిరమిడ్) అగ్రభాగంలో ఉండే కేవలం 10కోట్ల మంది ప్రజలు వివిధ వస్తుసేవల వినియోగానికి చేసే డిమాండు ఇప్పటివరకు దేశాభివృద్ధిని ప్రధానంగా ప్రభావితం చేస్తోంది. తమ అవసరాలు తీరడంతో వీరి వినియోగ డిమాండులో స్తబ్ధత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో వాహనాలు, గృహాలు మొదలుకొని చాలా వస్తువుల వినియోగ డిమాండు సాపేక్షంగా బలహీనంగా ఉండటానికి కారణమిదే. సరిగ్గా ఇదే సమయంలో కొవిడ్ రూపంలో ఉపద్రవం దేశ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్టింది. అంతులేని నష్టానికి కారణమైంది. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన యంత్రంగా గృహనిర్మాణ రంగాన్ని కేంద్రం ఎంచుకుంది.
ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి వివిధ దశల నిర్మాణంలో దాదాపు 4,50,000 యూనిట్లకుపైగా గృహాలు అమ్ముడుపోని జాబితాలో ఉన్నాయి. వీటిలో దాదాపు రూ.3.7 లక్షల కోట్ల దాకా స్థిరాస్తి వ్యాపారుల మూలధనం నిలిచిపోయింది. ఈ ప్రోత్సాహకాల వల్ల స్థిరాస్తి వ్యాపారులకు అదనపు పన్ను బాధ్యత లేకుండా ఇళ్ల కొనుగోలుదారులకు తక్కువ మార్కెట్ ధరలకే గృహాలు అందించే అవకాశం కలిగింది. తద్వారా గిరాకీ లేక పెద్దమొత్తంలో పేరుకుపోయిన తమ గృహాలు అమ్ముకునే వెసులుబాటు లభించింది. సగంలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి బిల్డర్లకు మద్దతు అందితే- కరోనా నేపథ్యంలో నగరాలను వీడిన కార్మికులు తిరిగి పట్టణ గృహనిర్మాణ పనులకు ఆకర్షించడంలో అది ప్రధాన పాత్ర వహిస్తుంది. దానివల్ల స్థిరాస్తి నిర్మాణరంగానికి మేలు జరుగుతుంది. తద్వారా అనేక రంగాలపై సానుకూల ప్రభావం పడి ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవం నింపుతుంది.
ద్రవ్యలోటు ఆందోళన అనవసరం
ఐఎంఎఫ్ చెప్పినట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) 10.3 శాతానికి కుంగే అవకాశం ఉంది. ఇండియా డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడిపించగల వీలుంది. ఆర్థిక ఉద్దీపన లక్ష్యం వినియోగ గిరాకీని పెంచడమే. ఆర్థిక ఉద్దీపన 1.0, 2.0లలో ప్రధానంగా కనిపించనిది- పెద్ద మోతాదులో ఉండాల్సిన ప్రభుత్వ వ్యయం. ఆ లోటు ఉద్దీపన 3.0లో కొంత మేర తీరినా దాని ప్రభావం ఎంత ఉండవచ్చన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వ ఆదాయంలో వచ్చిన కుదింపు, దాని ద్వారా పెరిగిన ద్రవ్యలోటు కూడా భారీ వ్యయం పట్ల ప్రభుత్వ విముఖతకు కారణమై ఉండవచ్చు. కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక లోటు జీడీపీలో నిరుడు ఉన్న 8.2శాతం నుంచి 13.1 శాతానికి పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ద్రవ్య లోటు పెరుగుతుందన్న అందోళనతో ప్రభుత్వం తన వ్యయంలో కోతపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. పేద ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయడం ద్వారా డిమాండును వేగంగా పెంచవచ్చు. పెద్దయెత్తున కార్మికులకు ఉపాధి కలిగించే రంగాలపైన, భారీగా ఉత్పాదక సాధనాలు ఉపయోగించే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం పెరగాలి. పది రంగాలకు ఉత్పత్తి- అనుసంధాన ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) ప్రకటించారు. ఉద్యోగ రాయితీ పథకం నెలకు రూ.15వేల కన్నా తక్కువ సంపాదించే సంఘటిత రంగ ఉద్యోగులపై మాత్రమే దృష్టి పెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.10,000 కోట్ల కేటాయింపువల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను సజీవంగా ఉంచవచ్చు. రోజువారీ పనిలో కాలపరిమితితో పాటు కేవలం ఉత్పాదక పనులకు, ఆస్తుల సృష్టికి మాత్రమే దీన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల వ్యవసాయ రంగంలోని వేతనాలపై ఉపాధి హామీ పథకం ఒత్తిడి తగ్గించవచ్చు. అది గ్రామాల్లో సమతుల్యమైన వినియోగ గిరాకీ సృష్టికి దోహదపడుతుంది. దీనికి తోడు పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌గారీ యోజన, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వేగంగా అమలు చేయగలిగితే- 'ఆదాయ పిరమిడ్'లో దిగువన నివసిస్తున్న ప్రజల వినియోగ గిరాకీని త్వరితగతిన పెంచవచ్చు.
గృహ నిర్మాణ రంగానికి ఊతం
దేశంలో వ్యవసాయ రంగం తరవాత అంత పెద్దమొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది స్థిరాస్తి రంగమే. 2022నాటికి ఆరు కోట్ల 70లక్షల మందికి ఉపాధి కల్పించి, 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో 13శాతం వాటాకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. అందువల్లే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గృహ కొనుగోలుదారులు, అమ్మకందారులకు రూ.18,000 కోట్ల మేర బడ్జెట్ సాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఇది 2020 బడ్జెట్లో ప్రకటించిన రూ.8,000 కోట్లకు అదనం. పనితీరు భద్రతా డిపాజిట్ మొత్తాన్ని అయిదునుంచి మూడు శాతానికి తగ్గించింది. గృహ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనల్లో సడలింపులూ ఇచ్చింది. పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించింది.
- డాక్టర్ కల్లూరు శివారెడ్డి
(పుణెలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్‌లో ఆచార్యులు)