ETV Bharat / opinion

కొవిడ్‌ వేళ .. కలవరపెడుతున్న 'రక్తహీనత'

ప్రపంచ వ్యాప్తంగా మూడోవంతు ప్రజల్లో సంక్రమించే వ్యాధులకు, సంభవించే మరణాలకు రక్తహీనతే కారణమవుతోంది. కరోనా విజృంభిస్తున్న వేళ రక్తహీనత సమస్య మరింత కలవరానికి గురిచేస్తోంది. పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం, పారిశుద్ధ్యం, అక్షరాస్యత, ఆర్థిక స్థితిగతులు, జీవన విధానం వంటి సామాజిక అంశాలపై నిత్యం ప్రజలను చైతన్యపరుస్తూ రక్తహీనతపై పోరుబాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Increased anxiety over the issue of anemia during the corona
కొవిడ్‌ వేళ 'రక్తహీనత'పై మరింత కలవరం
author img

By

Published : Sep 12, 2020, 12:32 PM IST

రక్తహీనత దశాబ్దాలుగా ప్రజలను వేధిస్తున్న ముఖ్యమైన ఆరోగ్య సమస్య. ప్రపంచ జనాభాలో మూడో వంతు ప్రజల్లో సంక్రమించే వ్యాధులకు, సంభవించే మరణాలకు రక్తహీనతే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లలు 42శాతం, స్త్రీలు 29శాతం, గర్భిణులు 40శాతం రక్తహీనతతో సతమతమవుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా. పేద ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజల్లో ఈ రుగ్మత తీవ్రస్థాయిలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏటా పది లక్షల మంది అయిదేళ్లలోపు చిన్నారులు రక్తహీనత, పోషకాహార లోపంవల్ల ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రసవ కాలంలో సంభవించే మరణాలు- రక్తహీనత కలిగిన గర్భిణుల్లో రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కాన్పుల వైద్య నిపుణులు అంటున్నారు. రక్తహీనత బారిన పడిన సగం మందిలో ఇనుములోపం ప్రధాన కారణంగా ఉంది. పోషకాహారలేమి, జీర్ణ వ్యవస్థలోని పరాన్న జీవులు మలేరియా, హిమోగ్లోబిన్‌ వ్యాధులు రక్తహీనతకు దారితీస్తున్నాయి. ఆహారంలో ఎ, బి12, బి2, బి6, సి, డి, ఇ, ఫోలేట్‌ వంటి విటమిన్ల లోపంతోపాటు- రాగి, జింక్‌ వంటి లోహాల కొరత కూడా రక్తహీనతకు కారణాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిత్యం తాజా ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే రక్తహీనత తీవ్రత తగ్గుతున్నట్లు ‘జాతీయ ఆరోగ్య కుటుంబ సేవల సంస్థ’ వెల్లడిస్తోంది.

భారత్​లో తీవ్రంగానే సమస్య..

దాదాపు 50 ఏళ్లుగా మన ప్రభుత్వాలు రక్తహీనత నిర్మూలనపై కృషి చేస్తున్నా, మనదేశంలోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. జాతీయ ఆరోగ్య కుటుంబ సేవల సంస్థ 2016లో జరిపిన అధ్యయనంలో 58.6శాతం చిన్న పిల్లలు, 53.2శాతం స్త్రీలు, 50.4శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేల్చిచెప్పింది. అవగాహన లేమి వల్ల మందులను వాడకుండా వీరు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపింది. క్షేత్ర స్థాయిలో వీరిపై పర్యవేక్షణ కొరవడటమే దీనికి ముఖ్య కారణం. మనదేశంలో 31.6శాతం మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటంతో ఈ సమస్య మరింత జటిలంగా ఉంది. మహిళలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం అవసరం. ఉత్తమ పారిశుద్ధ్య ప్రామాణికాలూ ఈ సమస్యను పరిష్కరించడంలో కీలకమే. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, బాల్యం ఆరోగ్యంగా సాగుతుంది. పిల్లల వయసు పెరిగేకొద్దీ సమతుల ఆహారంతో పాటు ఇనుము - ఫోలేట్‌, ఎ విటమిన్లను అనుబంధంగా అందిస్తూ, నులి పురుగుల మందులను తరచుగా వాడాల్సి ఉందని చిన్న పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు, ఐసీడీఎస్‌ వంటి పథకాలను క్షేత్ర స్థాయిలో పటిష్ఠంగా అమలు పరచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటువంటి పథకాల ద్వారా బాల్యానికి రక్షణ కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి. పురుషుల్లోనూ 23శాతం రక్తహీనత కలిగినవారేనని తాజా అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నీరసం, అలసటవంటి లక్షణాలను కలిగించి వారి వృత్తి సామర్థ్యం, పని దినాలపై రక్తహీనత ప్రభావం చూపుతోంది.

అనీమియా ముక్త్​ భారత్​పై చిత్తశుద్ధి కరవు..

సమగ్ర పోషకాహార విలువలపై చైతన్యం కలిగించి ఏడాదికి కనీసం మూడు శాతం రక్తహీనత రోగులను తగ్గించేందుకు ఉద్దేశించిన 'అనీమియా ముక్త్‌ భారత్‌' పథకాన్ని చిత్తశుద్ధితో అమలు పరచాలి. రక్త పరీక్ష, వైద్యం, చర్చ అనే ఈ మూడు అంశాలను క్రోడీకరించుకుంటూ సమగ్రంగా ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నామమాత్రంగా సాగుతున్న ‘నేషనల్‌ ఐరన్‌ ప్లస్‌ ఇనీషియేటివ్‌ (నిపి), వీక్లీ ఐ.ఎఫ్‌. సప్లిమెంటేషన్‌ (వైఫ్స్‌) వంటి పథకాల పనితీరుపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. నత్తనడకన సాగుతున్న రక్తహీనత నివారణ చర్యల వల్ల డబ్ల్యూహెచ్‌ఓ ప్రతిపాదించిన ‘2025 నాటికి 50శాతం రక్తహీనత తగ్గుదల సాధన’ లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్నామని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలను చైతన్యపరుస్తూ పోరాడాలి..

కొవిడ్‌ వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు గుండె, కిడ్నీ, శ్వాసకోశాలు, లివర్‌ వంటి అవయవాల పనితీరు గతి తప్పడానికి శరీరంలోని ఇనుము జీవక్రియ, రక్తహీనతలు కారణమనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఇదే కనుక రుజువైతే ప్రపంచవ్యాప్తంగా రక్తహీనతతో ఉన్న 162 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం ప్రమాదపుటంచున ఉన్నట్లే. వైద్యం కన్నా నివారణ ఉత్తమమనే నానుడిని నిజం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం, పారిశుద్ధ్యం, అక్షరాస్యత, ఆర్థిక స్థితిగతులు, జీవన విధానం వంటి సామాజిక అంశాలపై నిత్యం ప్రజలను చైతన్యపరుస్తూ రక్తహీనతపై పోరుబాట పట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్యం, సాంకేతిక పరిజ్ఞానంతో మిళితమై కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలోనూ ప్రజలను వేధిస్తున్న ఈ రుగ్మతను నిర్మూలించి భావితరాలకు విముక్తి కలిగించాలి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌ (వైద్యరంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.