ఏ సంస్థకైనా మానవ వనరులే అసలైన మూల ధనం. సిబ్బంది ఎటువంటి నైపుణ్యాలు కలిగి ఉన్నారు. వాటిలో ఏ మేరకు అభివృద్ధి సాధించారనే అంశాలు ఆయా సంస్థల వ్యాపార ప్రగతికి పునాదిగా నిలుస్తాయి. ఇవాళ కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన అనిశ్చిత, అస్థిమిత, అస్పష్ట, జటిల పరిస్థితుల్లో జీవనం సాగించాలంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. పనికిరాని పాత విషయాలను వదిలివేయాలి. నేర్చిన అంశాల్లో విలువైనవాటిని మళ్లీ కొత్తగా అభ్యసించాలి. ఈ కొవిడ్ రోజుల్లో ప్రతి దినం ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటూ ఉంటేనే ముందుకు సాగగలుగుతాం. కొవిడ్ ముందునాళ్లలో విరివిగా కనిపించిన హోటళ్లు, టాక్సీలు నేడు కష్టకాలం ఎదుర్కొంటున్నాయి. వాటికి సంబంధించిన ఆన్‌లైన్ వ్యాపారాలూ సజావుగా లేవు. అయితే, ఇతర రకాల వ్యాపారాలు ఆన్‌లైన్‌కు మళ్లుతున్నాయి. కొత్త తరహా అంకురాలు రంగప్రవేశం చేస్తున్నాయి. కృత్రిమ మేధ, బ్లాక్ చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త సాంకేతికతలు వ్యాపార నిర్వహణ రీతులను మార్చేస్తున్నాయి. నూతన సైబర్ వ్యాపార లోకంలో కొత్త అంశాలను నేర్చుకునేవారు, ఉన్న నైపుణ్యాలకు మెరుగు పెట్టుకునేవారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అందుకు వెబినార్‌లు (అంతర్జాల గోష్ఠులు) తోడ్పడుతున్నాయి. వెబినార్ల చలవతో అగ్రశ్రేణి మేధావులు, నైపుణ్య శిక్షకుల నుంచి కొత్త సంగతులు నేర్చుకోవడానికి ఇక దూరప్రాంతాలకు పయనించనక్కర్లేదు, భారీ ఫీజులు చెల్లించనక్కర్లేదు. ఆ ఉద్దండులు తమ అమూల్య సమయాన్ని ఇంతకుముందు కొద్దిమందికి మాత్రమే కేటాయించగలిగేవారు. వెబినార్ల సాయంతో నేడు వందలు, వేలమంది నేర్చుకునే అవకాశం ఏర్పడింది. వివిధ రంగాల్లోని వ్యక్తులు అంతర్జాలం సాయంతో వర్చువల్ భేటీలు నిర్వహించగలుగుతున్నారు. మౌలిక వసతులు, పెట్టుబడి విపణులు, ఆర్థిక వ్యవహారాలపై నేడు విరివిగా వెబినార్లు జరుగుతున్నాయి.
అనేక ముఖ్యమైన సమకాలీన వ్యవహారాలపై హార్వర్డ్, వార్టన్ వంటి జగద్విఖ్యాత విశ్వవిద్యాలయాలు వారం వారం ఉచిత వెబినార్లు నిర్వహిస్తున్నాయి. నగరాల్లో ఉండే విద్యావేత్తలు, వృత్తి నిపుణులు వెబినార్లలో బోధించే సంగతులను చిన్న పట్టణాల్లోని యువతీయువకులు, ఉద్యోగులు కూడా ఆలకించగలుగుతున్నారు. ప్రసిద్ధ బిజినెస్ స్కూల్స్, మియామీ, వార్టన్ విశ్వవిద్యాలయాలు లైవ్‌లో ఉచితంగా నిర్వహిస్తున్న పరిశోధనాపరమైన వెబినార్లు ప్రపంచమంతటా వేలమందికి అందుబాటులో ఉంటున్నాయి. విదేశాల్లో జరిగే ఇటువంటి గోష్ఠులకు సామాన్యులు మామూలు రోజుల్లోనే హాజరు కాలేరు. వీసా సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు దీనికి కారణం. ఇక ఈ కొవిడ్ కాలంలో ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా విదేశాలకు వెళ్లడానికి జంకుతున్నారు. అన్ని వర్గాలవారు ఇంటి నుంచి, ఆఫీసు నుంచి కాలు కదపకుండానే విశ్వవిఖ్యాత సంస్థల వెబినార్లలో పాల్గొనగలుగుతున్నారు. అశోకా విశ్వవిద్యాలయం జూన్‌లో నాలుగురోజుల పాటు నిర్వహించిన వర్చువల్ సమావేశానికి హార్వర్డ్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాల నుంచి, బెంగళూరు, కోల్‌కతా ఐఐఎంల నుంచి ప్రముఖ విద్యావేత్తలు వచ్చారు. ఆన్‌లైన్ విద్య, కొత్త సాంకేతికతల ఆలంబన, నాయకత్వ సవాళ్లు, మానవ మూలధనాన్ని సమర్థంగా వినియోగించడం వంటి కీలకాంశాలపై వారు చెప్పిన విలువైన సంగతులను ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో ఉచితంగా అంతర్జాలంలో విన్నారు. 'ది ఇండ్ యుఎస్ ఎంట్రప్రెనార్స్ (టీఐఈ)' హైదరాబాద్, దిల్లీ, ముంబయిలలో నిర్వహిస్తున్న వెబినార్లు వ్యాపార వ్యవస్థాపకులకు, మేనేజర్లు, ఎంఎస్‌ఎంఈలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) కన్సల్టెంట్లతో కలిసి అంకుర సంస్థల వ్యవస్థాపకుల కోసం టీఐఈ వెబినార్లు నిర్వహిస్తోంది.
అంకురాలు, ఎంఎస్‌ఎంఈలు, ఆర్థిక విపణులు, వినోద రంగాలపై కొవిడ్ ప్రభావం గురించి టెడెక్స్ వెబినార్లు విలువైన అంశాలను వెల్లడిస్తున్నాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన అశ్వత్థ దామోదరన్ భారతీయ పెట్టుబడి మార్కెట్లపై ఇటీవల నిర్వహించిన వెబినార్ ఎన్నో అమూల్యమైన విషయాలను అందించింది. మేధావులు, ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్వహిస్తున్న వెబినార్లను వీక్షించడానికి, వాటిలో మాట్లాడటానికీ రుసుము ఏమీ చెల్లించనక్కర్లేదు. వీటిని చాలా తరచుగా లైవ్ కార్యక్రమాలుగానూ నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఉన్నత విద్యాసంస్థలు తమ అధ్యాపక సిబ్బంది కోసం పరిశోధన సంవిధానాలు, పరిశోధన పత్రాల లేఖనం, ప్రచురణ, వక్తృత్వం వంటి అంశాల్లో చాలా తక్కువ ఫీజుకు వెబినార్లు నిర్వహిస్తున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులకు ఇవి అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఇథియోపియా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లకు చెందినవారూ ఈ వెబినార్లలో పాల్గొన్నారు. ఇటీవల చెన్నైకి చెందిన ఇస్కాన్ సొసైటీ లాక్‌డౌన్ కాలంలో భగవద్గీతపై చేపట్టిన ఆన్‌లైన్ తరగతులకు ఎంతో గిరాకీ ఏర్పడింది. విజ్ఞానానికి ఎల్లలు లేవని వెబినార్లు నిరూపిస్తున్నాయి. మానవ మూల ధన సృష్టికి విలువైన సేవలు అందిస్తున్నాయి.
- ఎం.చంద్రశేఖర్
(రచయిత- హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో సహాయ ఆచార్యులు)