ETV Bharat / opinion

జాతి ఆరోగ్యానికి క్రీడా 'యోగం'

'మనిషికి ప్రకృతికి మధ్య చక్కని సామరస్యాన్ని సాధించే యోగా- స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాలకు మేలు బాటలు పరుస్తుంది.' అన్న ప్రధాని మోదీ విశ్లేషణ అమూల్యమైనది. అసాంక్రామిక వ్యాధులపై అదుపు సాధించలేని పక్షంలో మరో పదేళ్లలో ఇండియా 4.58 లక్షల కోట్ల డాలర్ల నష్టాల్ని మూటగట్టుకొనే ప్రమాదం ఉంది. ఈ సమయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంది. యోగాకు క్రీడా స్థాయినిచ్చింది. కాగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్‌ క్రీడల్లో యోగాసనాలకు స్థానం కల్పించడమే అంతిమ లక్ష్యంగా జాతీయ యోగాసన క్రీడా సమాఖ్యనూ (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ) మొన్న ఆగస్టులో ప్రారంభించింది.

author img

By

Published : Dec 19, 2020, 10:17 AM IST

in-a-right-situation-yoga-become-a-sport
జాతి ఆరోగ్యానికి క్రీడా 'యోగం'

ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో శారీరక దారుఢ్యం మానసిక స్థైర్యం కలబోతగా మనిషి ఎదుగుదలకు 'రాజయోగ' సారాన్ని నూట పాతికేళ్ల క్రితమే అమెరికా ఐరోపాలకు అందించిన దార్శనికుడు వివేకానందుడు. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ శ్లాఘించినట్లు- ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన మేలిమి బహుమతుల్లో యోగా ఒకటి. 2014లో యోగా వైశిష్ట్యాన్ని ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రధాని మోదీ ప్రస్తావించన రెండున్నర నెలల్లోనే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రకటనకు దేశదేశాలనుంచి మద్దతు పోటెత్తింది.

2015 నుంచి ఏటా జూన్‌ 21న యావత్‌ ప్రపంచమే యోగాసనాలు వేస్తున్న వేళ- దాన్ని ఒక క్రీడగా మలచి జనసామాన్యంలోకి మరింతగా తీసుకెళ్ళే కార్యాచరణపై మూడేళ్లుగా సాగిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. యోగాసన ప్రక్రియను క్రీడగా కేంద్రం అధికారికంగా గుర్తించడంతో, విశ్వవిద్యాలయాలనుంచి జాతీయ స్థాయిదాకా ఆటల పోటీల్లో దానికి స్థానం దక్కనుంది.

ఒలింపిక్సే లక్ష్యం

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్‌ క్రీడల్లో యోగాసనాలకు స్థానం కల్పించడమే అంతిమ లక్ష్యంగా జాతీయ యోగాసన క్రీడా సమాఖ్యనూ (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ) మొన్న ఆగస్టులో కేంద్రం ప్రారంభించింది. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ నుంచి అందే ఆర్థిక తోడ్పాటుతో యోగాసన పోటీల నియమ నిబంధనలు, శిక్షకులు, రిఫరీలు, న్యాయ నిర్ణేతలతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన స్వయంచాలిత స్కోరింగ్‌ వ్యవస్థనూ సత్వరం కొలువు తీర్చి, వచ్చే ఏడాది ఫిబ్రవరినాటికి తొలి జాతీయ పోటీలకు రంగం సిద్ధం చేయాలని కేంద్రం భావిస్తోంది. మనిషి అంతర్నిహిత శక్తులకు పదును పెట్టే శక్తి యోగాసనాలకు ఉందని శాస్త్రీయంగా రుజువైన నేపథ్యంలో- తరాల అంతరాలు లేకుండా అందరికీ శారీరక మానసిక దృఢత్వ యోగం, జాతి కలిమికి బలిమికి మేలిమి సాధనంగా అక్కరకు రానుంది.

సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా

'శరీరం ఆత్మల సంయోగాన్ని, ఆలోచన ఆచరణల సమన్వయాన్ని, సంయమనం సంతృప్తి నడుమ సయోధ్యను యోగా సుసాధ్యం చేస్తుంది. మనిషికి ప్రకృతికి మధ్య చక్కని సామరస్యాన్ని సాధించే యోగా- స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాలకు మేలు బాటలు పరుస్తుంది'- అన్న ప్రధాని మోదీ విశ్లేషణ అమూల్యమైనది. 'శారీరకంగా ఆధ్యాత్మికంగా మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే సులభమార్గం యోగా' అని సమితి ప్రధాన కార్యదర్శిగా వినుతించిన బాన్‌ కీ మూన్‌- భారతీయ సనాతన సంవిధాన ప్రయోజనాల్ని ఐరాస గుర్తించిందని ప్రకటించారు.

స్వామి వివేకానంద నుంచి రామ్​దేవ్​బాబా వరకు

స్వామి వివేకానంద, స్వామి కువలయానంద, తిరుమలై కృష్ణమాచార్య ప్రభృతులనుంచి నేటి శ్రీశ్రీ రవిశంకర్‌, రామ్‌దేవ్‌ బాబా వంటి యోగదూతల అవిరళ కృషి అయిదువేల సంవత్సరాల అమృత విద్యానిధిని ప్రపంచవ్యాప్తం చేసింది. క్రమం తప్పక యోగాసనాలు వేసేవారిలో ప్రతికూల యోచనలు నశించి జ్ఞాపక గ్రహణ శక్తులు ఇనుమడిస్తున్నట్లు పరిశోధనలు ఎలుగెత్తుతున్నాయి.

పరిమిత స్థాయిలోనే కోర్సులు

దేశీయంగా యోగాపై కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టినా అవి పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. కనీస వ్యాయామం కొరవడి పాఠశాల విద్యార్థుల్లోనూ స్థూలకాయ సమస్యలతోపాటు, జీవనశైలి రోగాలు ఇనుమడిస్తున్న దశలో- ఒక క్రీడగా యోగా సరైన విరుగుడు కాగలుగుతుంది. అసాంక్రామిక వ్యాధులపై అదుపు సాధించలేని పక్షంలో మరో పదేళ్లలో ఇండియా 4.58 లక్షల కోట్ల డాలర్ల నష్టాల్ని మూటగట్టుకొనే ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో- యోగాసన క్రీడ సరైన సమయంలో పడిన ముందడుగు. ప్రపంచవ్యాప్తంగా యోగా పరిశ్రమ పరిమాణం 2018నాటికే 8000 కోట్ల డాలర్లు. అయిదు లక్షలమంది శిక్షకులు అవసరమైనా అందులో దాదాపు సగమే అందుబాటులో ఉన్నారంటున్న దృష్ట్యా- సర్కారీ కార్యాచరణ మరింత విస్తృతం కావాలి. వ్యక్తి చేతనకు సమష్టి జాగృతికి దోహదపడేలా యోగాకు ప్రాచుర్యం కల్పించడంలో కేంద్రం రాష్ట్రాలు కలిసికట్టుగా ముందడుగేయాలి.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో 'యోగా సబ్జెక్ట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.