సమస్యల పరంపరతో నిరంతరం కిందుమీదులవుతూ అస్తిత్వం కోసం పోరాడుతున్న లఘు పరిశ్రమలకు కొత్త ఊపిరులూదగల భూరి ఉద్దీపన యోజన ఇది. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'లో భాగంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల సముద్ధరణకు తలపెట్టిన ప్రత్యేక చర్యల్ని విశదీకరించిన విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన- ఎన్నో చిరుదివ్వెలు వెలుగులీనుతాయన్న ఆశల్ని మోసులెత్తిస్తోంది. మరిన్ని సంస్థలను ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పరిధిలోకి చేరుస్తూ వాటి నిర్వచనం మార్చిన కేంద్రప్రభుత్వం- తయారీ, సేవా రంగాలమధ్య విభజన రేఖనూ చెరిపేసింది. లఘు పరిశ్రమలు సహా చిన్న వ్యాపారాలకోసం పూచీకత్తు అవసరం లేకుండా 45 లక్షల సంస్థలకు లబ్ధి చేకూర్చేలా మూడు లక్షలకోట్ల రూపాయల మేర రుణాలు ఇస్తామనడం స్వాగతించదగింది. అక్టోబరు నెలాఖరు వరకే పథకం అమలును పరిమితం చేయకుండా కనీసం ఆర్థిక సంవత్సరం ముగిసేదాకా పొడిగించి ఉండాల్సింది. నాలుగేళ్ల గడువులో రుణాలు తిరిగి చెల్లించాలంటున్న ప్రభుత్వం, ఏడాదిపాటు అసలుపై మారటోరియం విధించినా- అన్నాళ్లూ వడ్డీ కట్టాల్సిందేననడం ప్రస్తుత పరిస్థితిలో చిన్న సంస్థలకు భారమే. చెల్లింపు వ్యవధిని పదేళ్లవరకు విస్తరించి వడ్డీరేటును కనిష్ఠస్థాయికి నిర్ధారిస్తూ ప్రభుత్వం లక్ష్మణరేఖ గీసి ఉంటే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు నికరంగా లబ్ధి చేకూరేది! దేశవ్యాప్తంగా లఘు పరిశ్రమల రంగానికి రూ.45లక్షలకోట్ల మేర అవసరమైన నిధుల్లో బ్యాంకులు సమకూరుస్తున్నది 18శాతంలోపే. ఇప్పుడు ప్రభుత్వం తాను హామీగా నిలుస్తానంటున్న దృష్ట్యా, చిన్న సంస్థలకు రుణలభ్యత ఎంత మేర పెరుగుతుందో చూడాలి. రూ.50వేలకోట్లతో నెలకొల్పదలచిన ప్రత్యేక నిధిలో తనవంతుగా అయిదోవంతు సమకూరుస్తామంటున్న కేంద్రం- తక్కిన మొత్తం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థల నుంచి వస్తాయంటోంది. ఆ క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ భుజస్కంధాలపైనే ఉంది!
చిన్నసంస్థల ప్రాధాన్యం ఎనలేనిది
ఉత్పాదక రంగానికి పరిశ్రమలే ఆయువుపట్టు. అందులోనూ స్వల్ప పెట్టుబడులతో విస్తృత ఉపాధి కల్పనకు దోహదపడగల చిన్నసంస్థల ప్రాధాన్యం ఎనలేనిది. ఈ సూక్ష్మం గ్రహించిన అమెరికా, చైనా, జపాన్, సింగపూర్ వంటివి లఘు పరిశ్రమలకు నవీన సాంకేతిక సొబగులు అద్దుతూ సంపద సృష్టిలో కీలక భాగస్వాములుగా వాటిని తీర్చిదిద్దుతున్నాయి. దేశీయంగా జీడీపీలో 35శాతం, ఎగుమతుల్లో మూడోవంతు వాటా కలిగి సుమారు 11కోట్ల మందికి జీవనాధారంగా నిలుస్తున్న చిన్న సంస్థలు సరైన వ్యవస్థాగత తోడ్పాటు ఎండమావై, ఏళ్లతరబడి ఏటికి ఎదురీదుతున్నాయి. కొవిడ్ విజృంభణతో అంచనాలు తలకిందులై ఉక్కిరిబిక్కిరవుతున్న దేశార్థికాన్ని పునరుత్తేజపరచే క్రమంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల ప్రాధాన్యాన్ని ఆకళించుకున్న కేంద్రం కీలక దిద్దుబాటు చర్యలు ఆరంభించింది. ఇది ఇంతటితో ఆగకూడదు. రూ.200కోట్లలోపు టెండర్లను దేశీయ చిన్న సంస్థలకే ప్రత్యేకించడం వాటి వ్యాపార విస్తరణను లక్షించేనన్నది ప్రస్ఫుటమవుతూనే ఉంది. పాత బకాయిల చెల్లింపులు 45రోజుల గడువులో పూర్తయిపోవాలన్నది చిన్న సంస్థల చిరకాల డిమాండ్లలో ఒకటి. కపూర్, గుప్తా, చక్రబర్తి, అబిద్ హుస్సేన్, నాయక్ ప్రభృత కమిటీల మేలిమి సిఫార్సులెన్నో కొన్నేళ్లుగా మన్ననకు నోచుకోకుండా పోగుపడి ఉన్నాయి. విపణితో అనుసంధానం, ఆధునిక పరిజ్ఞానం లభ్యత, కార్మికులకు నైపుణ్య శిక్షణ... తదితరాలూ సత్వరం సాకారమైతేనే పరిమితుల చట్రాన్ని ఛేదించి భారత లఘు పరిశ్రమలు ప్రపంచ మార్కెట్లు కొల్లగొట్టే స్థితికి ఎదుగుతాయి. సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకుని తయారీ రంగంలో దిగ్గజ శక్తిగా ఆవిర్భవించి స్వయం ఆధారిత భారత్‌ను ఆవిష్కరించాలన్నది ప్రధాని మోదీ కంటున్న బంగారు కల. చిన్న సంస్థలకు పెద్దయెత్తున ఊతమిచ్చే కసరత్తు సమర్థ మానవ పెట్టుబడుల రూపేణా కొనసాగాలి. ఆ మేరకు దీటైన కార్యాచరణ యువతకు, దేశ భవితకు కొండంత బలమవుతుంది!