ETV Bharat / opinion

పాఠాలకు కొత్తరూపు.. ప్రసార సాధనాల పాత్ర కీలకం - Teaching news

కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా భారత్‌ లాంటి దేశంలో పూర్తిస్థాయి తరగతి గది బోధన సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అంచనా. వచ్చే విద్యాసంవత్సరంలో కొంతమేరకు బోధన తరగతి గదిలోనూ, మరికొంత ఆన్‌లైన్‌ ద్వారానూ అవసరమన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అందుకు ప్రసార సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆన్‌లైన్‌ బోధన సాఫీగా సాగాలంటే అందుకు ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల కృషి అవసరం.

IMPACT OF COVID ON EDUCATION
పాఠాలకు కొత్తరూపు
author img

By

Published : Jun 27, 2020, 6:56 AM IST

కొవిడ్‌ ప్రభావంతో విద్యారంగం రూపురేఖలు సాంతం మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ప్రస్తుత విద్యాసంవత్సర ప్రణాళికను ఎలా తయారుచేయాలన్న విషయమై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇటలీ, దక్షిణ కొరియాలు ఆన్‌లైన్‌ బోధనతో; వియత్నాం రెండు రోజులకు ఒకసారి తరగతుల నిర్వహణ ద్వారా; హాంకాంగ్‌ ఒంటిపూట బడులతో ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా భారత్‌లాంటి దేశంలో పూర్తిస్థాయి తరగతి గది బోధన సాధ్యంకాకపోవచ్చునన్నది నిపుణుల అంచనా. ఆన్‌లైన్‌ ద్వారా బోధన చేస్తూ, పరీక్షలు నిర్వహించకుండా పాఠశాల, జూనియర్‌ కళాశాల స్థాయిలో అటు కేంద్రీయ పాఠశాలలు, ఇటు రాష్ట్రాల విద్యాసంస్థలు గడచిన విద్యా సంవత్సరాన్ని అతికష్టంగా పూర్తిచేశాయి. ఇక ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు, ఎలా ప్రారంభించాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అటుఇటుగా తేదీలు ప్రకటించినా సందిగ్ధం నెలకొంది. కొంతమేరకు బోధన తరగతి గదిలోనూ, మరికొంత ఆన్‌లైన్‌ ద్వారానూ అవసరమన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

ఆన్‌లైన్‌ విద్యా విధానం తరగతి గది బోధనకు భిన్నమైనది. ఇప్పుడున్న పాఠ్యప్రణాళికను యథాతథంగా అమలు చేయడం ఆన్‌లైన్‌ బోధనకు సరిపోదు. పాఠ్యాంశాల్లోనూ, పాఠ్యప్రణాళికల్లోనూ మార్పులు తేవాల్సి ఉంటుంది. ఆవైపుగా సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికను విద్యార్థులకు తగినట్లు హేతుబద్ధీకరిస్తున్నట్లు, కీలకమైన అంశాలు అందులో ఉండేట్లు జాగ్రత్తపడతామని ఇటీవల విద్యాశాఖ వర్గాలు ప్రకటించాయి. అంతకుముందే మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ పాఠ్య ప్రణాళికను తగ్గిస్తున్నట్లు తెలియజేశారు. కర్ణాటక ప్రభుత్వం 30శాతం వరకు సిలబస్‌ తగ్గించే ఆలోచనలు ఉన్నట్లు, ఆ తగ్గింపు ఎక్కువగా భాషలు, సాంఘిక శాస్త్రాల్లో ఉండేట్లు చూస్తామంటోంది. రాబోయే విద్యా సంవత్సరంలో సిలబస్‌ను కుదించాల్సి వస్తే గణితం, సామాన్య శాస్త్రాలకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆయా పాఠ్యాంశాలు ఒకదానికి ఒకటి అంతర్లీనంగా ముడివడి ఉంటాయి. వాటి గొలుసు ఎక్కడైనా తెగినా లేదా బలహీనపడినా తరవాత పాఠం లేదా తరగతి కొనసాగించడం విద్యార్థులకు కష్టమవుతుంది. స్థానిక అవసరాలు, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని నిపుణులైన ఉపాధ్యాయులు పాఠ్యప్రణాళికను హేతుబద్ధీకరించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ బోధన పద్ధతులు ఇంకా సరైన రూపం సంతరించుకోలేదు. తరగతి గదిలో ఉపాధ్యాయుడి మార్గనిర్దేశకత్వం, స్ఫూర్తి, ప్రోత్సాహం నేరుగా విద్యార్థిపై ప్రభావం చూపుతాయి. ఆన్‌లైన్‌ మాధ్యమంలో ఆ వెసులుబాటు కొరవడుతోంది. ఉపాధ్యాయుడి పర్యవేక్షణ లేక పరస్పర సంభాషణ సందేహ నివృత్తి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. వివిధ స్థాయుల్లోని విద్యార్థుల మధ్య సమతూకం పాటిస్తూ బోధన గరపడం తరగతి గదిలో సాధ్యం. ఈ పరిమితుల దృష్ట్యా ఆన్‌లైన్‌ బోధనలో అవసరమైన మార్పులపై నిపుణులు తక్షణం దృష్టిపెట్టాలి. విద్యార్థులకు వారి గృహ పరిసరాల్లో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి, సృజనాత్మకత పెంపొందించే విధంగా ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్లు ఇవ్వాలి. అందుకు అనువుగా మార్కులు కేటాయించాలి. ఆన్‌లైన్‌ బోధనపరంగా ఉపాధ్యాయుడు, విద్యార్థుల సంసిద్ధతతోపాటు చుట్టూ అనువైన వాతావరణమూ చాలా ముఖ్యం. పట్టణప్రాంత విద్యార్థులకు అంతర్జాల సదుపాయం అందుబాటులో ఉన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవరోధాలే అధికం. అంతర్జాలం, విద్యుత్‌ సౌకర్యం, స్మార్ట్‌ ఫోన్‌, అంతంత మాత్రం గృహ అనుకూలతలు పల్లెల్లోని విద్యార్థులకు ప్రతిబంధకాలు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ట్యాబ్‌లతోపాటు అంతర్జాల సేవల అందుబాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఒక ఏడాదిపాటు విద్యార్థికి ఎటువంటి బోధన లేకపోతే ఆ ప్రభావం తదుపరి ఏడాది విద్యమీద పడుతుంది. ఆన్‌లైన్‌ విద్యాబోధనలో దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. దూరదర్శన్‌, రేడియోలను ఉపయోగిస్తూ విద్యా బోధన చేసే అవకాశాలను పరిశీలించాలి. ఈ విధానంలో పరస్పర సంభాషణకు వీలు లేకపోయినా లక్షల మంది విద్యార్థులకు విద్య చేరుతుంది. ఈ విద్యా సంవత్సరంలో తరగతి గది బోధన పాక్షికమైనా ఆన్‌లైన్‌ బోధన సాఫీగా సాగాలంటే అందుకు ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల కృషి అవసరం.

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి

(రచయిత: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.