అందరికీ గూడు అన్నది సంక్షేమ రాజ్యభావనకు అద్దంపట్టే సమున్నత ఆదర్శం. కూటికి గుడ్డకు కొదవ లేని స్థితికి చేరుకొన్న సగటుజీవికి సొంత ఇల్లు ఓ సుందరస్వప్నం. నగరీకరణ వేగవంతంగా సాగుతున్న దేశాల్లో ఇండియా ముందువరసలో నిలుస్తోందని, 2050నాటికి భారతావని జనాభాలో 52.8 శాతం పట్టణాల్లోనే నివసిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇటీవల వెల్లడించింది. అందుకనుకూలంగా సాగాల్సిన ప్రణాళికాబద్ధ నగరీకరణ కాగితాల్లోనే నీరోడుతుంటే, నిబంధనల్ని తోసిరాజని పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు పెనుసామాజిక సంక్షోభానికే అంటుకడుతున్నాయి. 'ఈ హైకోర్టు భవనమూ అక్రమ నిర్మాణమైతే కూల్చివేత దీని నుంచే మొదలుపెట్టండి' అని ఉన్నత న్యాయస్థానం ఆవేదనతో స్పందించి దాదాపు రెండు దశాబ్దాలైంది. ఆ తరవాత కూడా వ్యవస్థ గాడిన పడకపోబట్టే- ఏడంతస్తుల అక్రమ నిర్మాణాలనైనా అరగంటలో నేలమట్టం చేసే భారీ హైడ్రాలిక్ యంత్రాల్ని జీహెచ్‌ఎమ్‌సీ సమకూర్చుకొంది.
అక్రమ కట్టడాలే..
అడ్డదిడ్డంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో చెరువులు, నాలాలు పూడుకుపోయి కొద్దిపాటి వానలకే నగరాలు వరదముంపు పాలబడటం- దేశవ్యాప్తంగా అనుభవమవుతున్న వైపరీత్యం. కిర్లోస్కర్ కమిటీ నివేదిక ప్రకారం జంటనగరాల్లో 390 కి.మీ. నాలాలుంటే, మూసీకి దారి తీసే 170 నాలాలపై వంద శాతం ఆక్రమణలున్నాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్, వాటన్నింటినీ తొలగిస్తామని లోగడే ప్రకటించారు. భాగ్యనగరంలో 165 చెరువులు అసలు కనిపించడమే లేదని రెవిన్యూ అధికారులూ నివేదించారు. ఎక్కడికక్కడ ఈ తరహా పర్యావరణ విధ్వంసమే నగరాల్ని నరకకూపాలుగా మార్చేస్తోంది. బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలను అనుమతించడం- కాసులు కురిపించే వ్యాపారంగా మారిందని దిల్లీ హైకోర్టు గతంలో నిష్ఠురసత్యం పలికింది. ఎక్కడికక్కడ అక్రమంగా వెలుస్తున్న లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాలకు సర్కారీ విభాగాల అవినీతే అసలైన పునాది. దాన్ని పెళ్లగించే పటిష్ఠ కార్యాచరణ పట్టాలకెక్కితే- భారీ హైడ్రాలిక్ యంత్రాలతో పనేముంది?
ప్రైవేటు పెట్టుబడులు వస్తేనే..
భారతావనిలో ప్రస్తుతం 34శాతంగా ఉన్న పట్టణవాసుల సంఖ్య మరో పదేళ్లలో 40 శాతానికి పైగా పెరగనుందని, అప్పటికి అదనంగా రెండున్నర కోట్ల గృహాలు పేద మధ్యాదాయ వర్గాలకు అవసరమవుతాయని అధ్యయనాలు చాటుతున్నాయి. ‘2020నాటికి అందరికీ ఆవాసం’ పథకం కింద నిరుడీ రోజుల్లో కేంద్రం 83 లక్షల 60వేల ఇళ్లు మంజూరు చేసినా- పెరిగే డిమాండుకు అనుగుణంగా స్థిరాస్తి రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులూ ప్రవహించాలి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఇంకో 10 కోట్ల ఇళ్లు నిర్మించాలని, అందుకు 100 లక్షల కోట్ల రూపాయల భూరి పెట్టుబడులు కావాలని రిజర్వ్‌బ్యాంకు నిరుడు సెప్టెంబరులో నివేదించింది.
సరళతర ప్రణాళికలు..
ఇండియాలో నగరీకరణ ప్రణాళికలకు అవినీతి, అసమర్థతలు గొడ్డలిపెట్టుగా మారాయన్న విఖ్యాత ఆర్కిటెక్ట్ బెన్నిజర్ వ్యాఖ్యలకు- తామరతంపరగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, ఆ తరవాత ఎప్పుడో వాటి కూల్చివేతలు బలం చేకూరుస్తున్నాయి. నగరాల ప్రణాళికాబద్ధ అభివృద్ధికి శాస్త్రీయమైన మార్గదర్శకాలు వెలువరించి, అనుమతుల మంజూరులో అధికారుల ఇష్టారాజ్యాన్ని తుంచి, తప్పు చేస్తే తప్పించుకోలేరన్న భీతిని అక్రమార్కుల్లో కల్పించాల్సిన ప్రభుత్వాలు- క్రమబద్ధీకరణ రాజకీయాలతో పరిస్థితిని మరింత దిగజార్చేశాయి. అసలే ఆర్థిక వనరుల కొరతతో సతమతమవుతున్న వేళ- కోట్ల రూపాయల సొమ్ము, సామాన్యుల సొంతింటి స్వప్నాలు నేలమట్టం కాకుండా ప్రభుత్వాలు సరళతర ప్రణాళికలు చేపట్టాలి!
ఇదీ చదవండి: 'ఏడు నెలల్లో జైడస్ కాడిలా కరోనా వ్యాక్సిన్!'