ETV Bharat / opinion

కరోనాపై పోరులో విడివిడిగా.. కలివిడిగా!

దేశంలో కొవిడ్​ మహమ్మారి రెండో దశలో వికృతరూపంతో విరుచుకుపడుతోంది. ఎన్నో బంధాలను ఛిద్రం చేస్తోంది. కొవిడ్​ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. ఎన్నికల సభలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల.. జన్యుపరంగా రూపాంతరం చెందిన వైరస్​.. జనంలో శరవేగంగా వ్యాపించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులందరూ కలిసికట్టుగా నిబద్ధతతో పోరాడితే కరోనాను తరిమికొట్టడం అసాధ్యమేమీ కాదు. ఇదే జరిగితే 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని స్వేచ్ఛగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవచ్చు.

Covid rules, Physical distance
కరోనా మార్గదర్శకాలు, భౌతిక దూరం
author img

By

Published : May 8, 2021, 7:04 AM IST

దిల్లీ ఉన్నత న్యాయస్థానం అభివర్ణించినట్లు సునామీలా విరుచుకుపడుతున్న కరోనా రెండోదశ భారత్‌కు పెనుముప్పుగా పరిణమిస్తోంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్తలు, స్నేహితులు... ఇలా పెనవేసుకున్న బంధాలన్నింటినీ ఛిద్రం చేస్తోంది. భార్యకు తెలియకుండా భర్తకు, తండ్రికి తెలియకుండా బిడ్డకు దహన సంస్కారాలు చేసే దుస్థితి ఏర్పడింది. ఒకే చితిపై అనేక మృతదేహాలను దహనం చేస్తున్న ఉదంతాలతో కదిలిపోయిన న్యాయస్థానాలు- 'అంతిమ సంస్కారాలను కాస్త గౌరవనీయమైన పద్ధతిలో చేయండి' అని ఆవేదనతో సూచిస్తున్నాయి. నిజానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా మొదటి దశను భారత్‌ సమర్థంగానే ఎదుర్కొంది. ఆ తరవాత అందరిలోనూ అజాగ్రత్త పెరిగింది. కొవిడ్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సభలు, మతపరమైన కార్యక్రమాలు విచ్చలవిడిగా జరిగాయి. ఇదే అదనుగా జన్యుపరంగా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ జనంలో వేగంగా విస్తరించింది.

యువశక్తిపై పంజా

గడచిన వారం రోజుల్లో దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల నాలుగు లక్షలకు మించిపోయింది. సగటున నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త రోజువారీ కొవిడ్‌ కేసుల్లో 46శాతం, మరణాల్లో 25శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ రూపంలో మానవాళి ఇంతటి ఉత్పాతాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో మొదటి దశ వ్యాధి వ్యాప్తిలో అమెరికా, ఐరోపా దేశాల కంటే భారత్‌లో తక్కువ కేసులే నమోదయ్యాయి. కానీ, తరవాత రెండోసారి పడగవిప్పిన ఆ మహమ్మారి దాదాపు కోటిన్నర మంది భారతీయులను పొట్టనపెట్టుకుంది.

కరోనా రెండోదశ వ్యాప్తి ఎప్పటికి అదుపులోకి వస్తుందన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. జూన్‌ రెండో వారం నాటికి ఇది తగ్గుముఖం పడుతుందని కొంతమంది చెబుతున్నారు. ఇంకొన్నాళ్లు పడుతుందని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇప్పుడు యువత ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడుతోంది. మనదేశ జనాభాలో 19-59 ఏళ్ల మధ్య వయసువారు 62 శాతం. దేశాభివృద్ధిలో, ఆర్థిక కార్యకాలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ వయసు పౌరులు కొవిడ్‌ కోరల్లో చిక్కి ప్రాణాలు వదలడం ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూరుస్తోంది. దేశం ఇప్పుడిప్పుడే 'మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా...' లాంటి సృజనాత్మక పథకాల ద్వారా యువతను ప్రోత్సహిస్తోంది. వాళ్ళను విజయవంతమైన వ్యాపారస్తులుగా, చురుకైన ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఆశయాలు నెరవేరాలన్నా దేశానికి యువజనం చాలా అవసరం.

మరింత ఆర్థిక సాయంతో ఆదుకోవాలి..

మరోవైపు, కరోనా మొదటి దశ వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోలుకుంటున్న సమయంలో తిరిగి విజృంభించిన వైరస్‌, వాటి మనుగడకే ముప్పు తెచ్చిపెడుతోంది. దీనివల్ల ఆయా సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, కుటుంబాలకే కాదు- గ్రామాలు, రాష్ట్రాలు, దేశానికీ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నిరుడు లాక్‌డౌన్‌ తరవాత ఈ సంస్థలకు పునరుజ్జీవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిధుల నిర్వహణను సమీక్షించి, దానికి తోడు మరికొంత ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రస్తుత వైద్య రంగానికి అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సరఫరా యంత్రాలు, వైద్య పరికరాలు, మౌలిక వసతులకు సంబంధించిన పరిశ్రమలు, వ్యాపారాలు నెలకొల్పి దేశ అవసరాలను తీర్చే దిశగా యువతను సమాయత్తం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు అయిదు కోట్ల మంది యువతీ యువకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు ఇలాంటి వారికి చక్కటి ఉపాధి మార్గాలుగా నిలుస్తాయి.

సమష్టి ప్రయత్నంతోనే సాధ్యం

మన దేశం మొత్తం జనాభాకు టీకాలు వేసేందుకు 2022 సంవత్సరాంతం వరకూ సమయం పడుతుందని అంచనా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసికట్టుగా సమర్థమైన నిర్వహణ, నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందడుగు వేస్తే వ్యాక్సిన్‌ ప్రక్రియను ఈ ఏడాది చివరికల్లా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. అలాగే, ప్రజలందరూ కొవిడ్‌ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో ఆచరిస్తూ, ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించాలి. మనకంటే చిన్న దేశాలైన న్యూజిలాండ్‌, వియత్నాం, తైవాన్‌ తదితర దేశాలే ప్రజాభాగస్వామ్యంతో కరోనాపై ఇప్పటికే విజయాన్ని సాధించాయి. మన దేశంలోనూ వ్యక్తులు, కుటుంబాలు, పాలకులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి. ఇలాంటి విపత్కర సమయంలో దేశంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రబలకుండా ప్రజలందరూ జాగరూకత వహించాలి. సమాజం పట్ల బాధ్యత, స్వీయ నియంత్రణతో మెలగడమే ప్రస్తుత కాలంలో నిజమైన దేశభక్తి! భారతీయులందరూ కలిసికట్టుగా నిబద్ధతతో పోరాడితే కరోనాను తరిమికొట్టడం అసాధ్యమేమీ కాదు. ఈ స్వప్నం సాకారమైతే 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని స్వేచ్ఛగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవచ్చు.

రచయిత- డాక్టర్​ చుక్కా కొండయ్య, 'నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఎంఎస్​ఎంఈ' మాజీ డైరెక్టర్​ జనరల్​

ఇదీ చదవండి: 'భారత్​లో 'స్పుత్నిక్​ లైట్​' పరీక్షలు జరుపుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.