అందరికీ ఇళ్లు అనేది యాభై ఏళ్ల నాటి లక్ష్యం. ఇది ఇప్పటికీ పూర్తిగా నెరవేరని దశలోనే ఉంది. పల్లె పట్నం తేడా లేకుండా ప్రతి కుటుంబానికీ చౌకధరలో సొంత ఇల్లు సమకూర్చే విధంగా 2015లో నూతన దిశానిర్దేశం చేశారు. ఇప్పుడిది 'అందుబాటు ధరలకు ఇళ్లు' (అఫర్డబుల్ హౌసింగ్) పథకంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2019 డిసెంబరు 27న భారత్ ఈ దిశగా సరికొత్త మైలురాయిని అధిగమించింది. 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పీఎంఏవై-యు)' కింద మంజూరైన ఇళ్ల సంఖ్య కోటి దాటింది. దేశంలోని ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు సమకూర్చాలన్న 2014 నాటి బృహత్ పథకంలో పీఎంఏవై-యు ఒక భాగం. స్వతంత్ర భారతావని అవతరించిన తరవాత 75వ సంవత్సరాని(2022)కల్లా ఈ భారీస్వప్నం సాకారం కావాలని నిర్దేశించారు. 2015లో కేవలం 7.26 లక్షలుగా ఉన్న ఇళ్ల మంజూరు 2019 నాటికి ఎన్నో రెట్లు పెరిగి కోటికి చేరింది.
ఆర్థిక కోణం
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చేయడంతో ‘అందరికీ ఇళ్లు’ పథకానికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. కొవిడ్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ విధానంలో వచ్చిన సానుకూల మార్పుల్లో ఇదొకటి. గృహనిర్మాణంపై పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ మీద భారీ స్థాయిలో గుణక ప్రభావాని(మల్టిప్లయర్ ఎఫెక్ట్)కి దారితీస్తాయి. ఈ నిర్ణయం వెనక ఉన్న ఆర్థిక తర్కం తిరుగులేనిది. కేంద్ర ప్రభుత్వం గత నెల 23న వెలువరించిన తాజా అంచనా ప్రకారం, పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో 1.12 కోట్ల ఇళ్లకు గిరాకీ ఉంది. వీటిలో 1.08 కోట్ల ఇళ్లు ఇప్పటికే మంజూరయ్యాయి. మంజూరైన ఇళ్ల నిర్మాణంపై రూ.1.72 లక్షల కోట్లు వ్యయం చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా విడుదల చేసిన రూ.76,789 కోట్లలో... రూ.67,541 కోట్లు వ్యయం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.37 లక్షల కోట్లు వెచ్చించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటి లబ్ధిదారులు తమ వంతుగా రూ.3.44 లక్షల కోట్లు ఖర్చు పెడతారని అంచనా. ఈ పెట్టుబడుల ఆర్థిక ప్రయోజనాలు వ్యవస్థ మీద సానుకూల ప్రభావం కనబరచే వీలుంది. ఎందుకంటే గృహనిర్మాణం వల్ల ఒనగూడే ప్రయోజనం భారీగా ఉంటుంది.
250 అనుబంధ వ్యాపారాలతో..
ఒక ఇల్లు కట్టాలంటే అనేక వస్తుసేవలు అవసరమవుతాయి. దాదాపు 250 అనుబంధ వ్యాపారాలతో గృహనిర్మాణం అనుసంధానమై ఉంటుందని 2000 సంవత్సరంనాటి అహ్మదాబాద్ ఐఐఎం అధ్యయనం వెల్లడిస్తోంది. నిర్మాణ రంగంతో పోలిస్తే ఇంటి మీద ప్రత్యక్ష వ్యయం వల్ల అయిదురెట్లు అధికంగా వ్యవస్థలో నేరుగా ఆదాయ సృష్టి జరుగుతుంది. గృహనిర్మాణంలో ప్రభుత్వ పెట్టుబడి ఇప్పటి వరకు 550 కోట్ల పనిదినాలు సృష్టించింది. ఇందులో 153 కోట్లు ప్రత్యక్షంగా, 397 కోట్లు పరోక్షంగా సమకూరాయి. ఈ పథకాలు చేపట్టిన తరవాత- ప్రత్యక్షంగా 55 లక్షల మంది, పరోక్షంగా 1.42 కోట్ల మంది (వెరసి 1.97 కోట్లమంది) ఉపాధి పొందారు. ఒక్క 2020లోనే 5.9 కోట్ల టన్నుల సిమెంటు, 1.4 కోట్ల టన్నుల ఉక్కు వినియోగమయ్యాయి. కొవిడ్ సంక్షోభ సమయంలో పరిశ్రమలకు ఇది భారీ చేయూత.
కొత్తగా రూపకల్పన
గుణక ప్రభావం వల్ల గృహనిర్మాణ రంగంలో పెట్టుబడులు సులభసాధ్యం అవుతాయని చెప్పడం ఉద్దేశం కాదు. రుణం తీసుకుని ఇల్లు కొనే మధ్య, ఎగువ తరగతుల వారికంటే- గృహ నిర్మాణ పథకంలో పెట్టుబడి పెట్టేవారికి కొంత భారం తగ్గే మాట వాస్తవం. అయితే, బ్యాంకింగ్ రంగం ఇప్పటికే భారీగా రుణాలు సమకూర్చింది. గడచిన మూడు దశాబ్దాల్లో వాటి పరిమాణం అసాధారణంగా పెరిగింది. 1991 మార్చి నాటికి సమకూర్చిన స్థూల పరపతి రూ.1.18 లక్షల కోట్లు; 2020 మార్చి నాటికి అది రూ.92.63 లక్షల కోట్లకు చేరింది. ఇంత భారీ స్థాయిలో ఇప్పటికే ఇంటి రుణాలు తీసుకున్న ప్రజలు కొత్తగా మళ్ళీ ఇళ్లు కొనాలంటే కష్టం. అన్ని తరగతులదీ ఇదే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే- ఇల్లు నిజంగా అందుబాటు ధరలో ఉన్నప్పుడు, కొనుగోలుదారుడు సంపాదన పెంచుకుని రుణం సవ్యంగా తిరిగి చెల్లించగలిగినప్పుడు గృహనిర్మాణ పథకం విజయవంతం అవుతుంది.
కొవిడ్ వ్యాధిని, అది వ్యాప్తి చెందిన తీరును దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పథకాలకు కొత్తగా రూపకల్పన చేయాలి. సదుపాయాల కల్పన, సామాజిక ప్రదేశాల ఏర్పాటు అంశాల్లో వైరస్ కానీ, ఇతర వ్యాధులు కానీ వ్యాప్తి చెందని విధంగా తగిన మార్పులు చేయాలి. పారిశుద్ధ్యం, గాలి, వెలుతురు, వ్యర్థాల నిర్వహణలను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్యానికి పెద్దపీట వేయడం అవసరం. జనం గుమికూడకుండా ఉండేలా జనావాసాల రూపకల్పన జరగాలి. భూగర్భ జలాల పెంపు, సంప్రదాయేతర ఇంధనాల అధిక వినియోగం, కాలుష్య నివారణ అంశాలకు ప్రాముఖ్యం ఇచ్చి వాతావరణ మార్పు నిబంధనలకు అనుగుణంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించాలి!
భూమి లభ్యతే సమస్య
పేదల ఇళ్ల విషయానికి వస్తే, భూమి లభ్యత ఒక నిరంతర సమస్య. దీన్ని విస్మరించి, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఇళ్ల స్థలాలు పంచుతున్నాయి. పరిమితంగా ఉన్న భూమి ఇవ్వడం కంటే అందులో బహుళ నివాస భవనాలు కట్టి ఇవ్వడం విజ్జత అనిపించుకుంటుంది. ఒకవైపు జనాభా, మరోవైపు పట్టణీకరణ పెనవేసుకుని పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో భూమి రోజురోజుకూ ప్రియం అవుతోంది. దీంతో గృహనిర్మాణ పథకాల వ్యయం తడిసిమోపెడవుతోంది. ఇళ్ల పథకాలు పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యం మరొక సమస్య. మొత్తం మంజూరైన 1.08 కోట్ల ఇళ్లలో 1.03 కోట్లు 20 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇందులో కేవలం 61శాతం ఆవాసాలకు మాత్రమే పునాదులు పడ్డాయి. ఇలా నిర్మాణ దశకు చేరినవాటిలో 58శాతం మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. జాప్యం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. పేదలకు రుణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉన్నత వర్గాలకంటే, జాప్యం తాలూకు భారం పేదలపైనే అధికం. అప్పగింతలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయాలు పెరుగుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాణ జాప్యంలో మహారాష్ట్ర, పశ్చిమ్ బంగ, యూపీ, తమిళనాడు, ఎంపీ, కర్ణాటక, ఏపీ, బిహార్, గుజరాత్ ముందున్నాయి.
- డాక్టర్ ఎస్. అనంత్, రచయిత - ఆర్థిక, సామాజికరంగ నిపుణులు
ఇదీ చదవండి: పట్టు వీడని రైతన్న- మెట్టు దిగని సర్కార్!