కరోనా వైరస్ ధాటికి జీవనోపాధి తెగ్గోసుకుపోయి గూడు చెదిరి గుండె పగిలిన అభాగ్యులెందరో దేశంలో ఇప్పటికీ సరైన లెక్కలు లేవు. తొలి దఫా నష్ట తీవ్రతతో పోలిస్తే రెండో దశ విజృంభణ చిన్నాచితకా పనులతో పొట్ట పోసుకునే వారెందరినో చావుదెబ్బ తీసింది. నిరుటి లాక్‌డౌన్ పిడుగుపాటుకు దేశవ్యాప్తంగా 66 శాతం మేర బతుకు తెరువు కోల్పోయినట్లు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం మదింపు వేసింది. మలి దశ ఆంక్షల పర్యవసానంగా మరింతగా ఉపాధి అవకాశాలు కొల్లబోయాయంటున్న పార్లమెంటరీ స్థాయీసంఘం తాజా నివేదిక, దేశం నలుమూలలా నిరుద్యోగిత విస్తృతి ఆందోళనకరంగా ఉందంటోంది. చేసేందుకు పని లేక, అనివార్యమై తీసుకున్న రుణాలు తీర్చలేక, పోషకాహారం కొరవడి, ఆరోగ్యం దెబ్బతిని, పిల్లల చదువులు చతికిలపడిన కుటుంబాల అవస్థలు చెప్పనలవి కాదన్న భర్తృహరి మెహతాబ్ కమిటీ విశ్లేషణ అక్షరసత్యం. సాధారణ పరిస్థితుల్లోనే వైద్యఖర్చులు భరించలేక ఏటా సగటున అయిదున్నర కోట్లమంది వరకు నిస్సహాయంగా పేదరికంలోకి కూరుకుపోతున్న దేశం మనది.
కొవిడ్ సంక్షోభ వేళ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలన్న కమిటీ తమ నివేదికలో ఇంకో రెండు కీలక సిఫార్సుల్నీ పొందుపరచింది. మహమ్మారి వైరస్ ప్రధానంగా మహిళలు, యువతతోపాటు స్వయం ఉపాధి పొందుతున్నవారిని, వలస కార్మికుల్ని తీవ్ర దురవస్థలపాలు చేసిందన్నది చేదునిజం. వారందరికీ ఇతోధిక సామాజిక భద్రతా చర్యలు చేపట్టాలన్న కమిటీ- అసంఘటిత రంగ శ్రామికులకు ప్రత్యక్ష నగదు బదిలీ అత్యవసరమంటోంది. దేశవ్యాప్తంగా 90 శాతం (41.9కోట్లమంది) శ్రామికులు అసంఘటిత రంగానికే చెందిన వారైనందువల్ల ఆకలిమంటలు పెచ్చరిల్లకముందే సిఫార్సు అమలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం చురుగ్గా స్పందించాల్సి ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలన్న కమిటీ- అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం తరహాలోనే, 'పట్టణ ఉపాధి హామీ'కి ఓటేస్తోంది!
అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలో జాతీయ రోజువారీ కనీస వేతనం రూ.375. కొవిడ్ కేసుల ప్రకోపం కారణంగా భిన్నరంగాలు, వివిధ కార్యకలాపాలు దెబ్బతిని 23కోట్ల మందిదాకా భారతీయుల దినసరి సంపాదన అంతకన్నా దిగువకు పడిపోయిందన్న విశ్లేషణలు ఇప్పటికే వెలుగుచూశాయి. 2011నాటి జనాభా లెక్కల అనుసారం 11కోట్ల 80లక్షలుగా నమోదైన వలస కార్మికుల సంఖ్య ఏటికేడు విస్తరిస్తూనే ఉంది. ఎందరో ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతుల్ని సైతం హమాలీలుగా రోజు కూలీలుగా మార్చేసిన కరోనా జమానాలో 27శాతం భారతీయులు తరచూ పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందన్నది ఆహార హక్కు ఉద్యమ సంస్థ సర్వే సారాంశం.
ఏదీ పట్టణ ఉపాధి?
లాక్‌డౌన్ల ఉపసంహరణ తరవాతా పల్లెల్లో 15శాతం, పట్టణాల్లో 28శాతం కుటుంబాలు తీసుకునే ఆహార పరిమాణం పెరగనే లేదంటున్న కథనాలు- దుర్భర దారిద్య్రం కోట్లమందిని ఎలా నమిలేస్తోందో చాటుతున్నాయి. అటువంటి అన్నార్తులను కన్నతల్లిలా ఆదుకోవడంలో 'పట్టణ ఉపాధి హామీ' అక్కరకొస్తుందన్న అంచనాలను నిజం చేసేదెలా? దేశంలో రెండువందలకు పైగా జాతీయ రహదారి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోగడ వాపోయారు. 18 రాష్ట్రాల్లో వివిధ మౌలిక ప్రాజెక్టుల నిమిత్తం సుమారు రూ.100 లక్షలకోట్ల భూరి ప్రణాళికను మోదీ ప్రభుత్వం నిరుడు ప్రకటించింది. వాటి అమలును ఉరకలెత్తించేలా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దగలిగితే ఉభయతారకమవుతుంది. చిన్న పట్టణాల్లో ప్రాథమిక సేవలు సదుపాయాలను మెరుగుపరచడానికి, స్థానిక యువతకు నైపుణ్యాలు అలవరచడానికి సైతం ప్రతిపాదిత యోజన ఉపయుక్తమవుతుంది.
పట్టణ పరిపాలన సంస్థల ఆర్థిక నిర్వహణ సామర్థ్యాల పెంపుదలకు అది అక్కరకొస్తుందన్న అధ్యయనాలూ లోగడ వెలుగుచూశాయి. నిపుణుల సూచనలు, సలహాలను రాబట్టి పట్టణ ఉపాధి హామీని వీలైనంత త్వరగా పట్టాలకు ఎక్కిస్తే- దేశంలో కోట్లమంది జీవనహక్కుకు సరైన మన్నన దక్కుతుంది!
ఇవీ చదవండి: