కొవిడ్ మహాసంక్షోభ ఖడ్గ ప్రహారాలకు రెక్కలు తెగిపడిన విహంగాల్లా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు విలవిల్లాడుతున్నాయి. లాక్‌డౌన్లతో లావాదేవీలు చతికిలపడి, భవిష్యత్తు అగమ్య గోచరమై అలమటిస్తున్న యూనిట్ల పునరుద్ధరణ కృషీ అరకొరేనని ఇటీవలి పరిణామాలు చాటుతున్నాయి. కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుదేలైన లఘు పరిశ్రమలకు చేయూతగా 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' కింద అదనంగా 20శాతం రుణం అనుగ్రహించాలని బ్యాంకుల్ని కేంద్రం ఆదేశించింది. అందుకోసం కేటాయించిన మూడు లక్షల కోట్ల రూపాయల్లో నేటికీ సగమైనా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు చేరలేదని అధికారిక గణాంకాలే చాటుతున్నాయి.
చిన్న సంస్థలకు పెద్ద ఉద్దీపనగా అభివర్ణిస్తూ ప్యాకేజీ ప్రకటించాక తొలి ఆరువారాల్లో రుణవితరణగా విడుదలైనది కేవలం ఎనిమిది శాతమే. దాదాపు ఆరు మాసాలు కావస్తున్నా నిర్దేశిత రుణపందేర లక్ష్యం ఇంకా నెరవేరని కారణంగా, ఈ నవంబరు నెలాఖరుదాకా పథకం కాలావధిని తాజాగా పొడిగించారు. దేశవ్యాప్తంగా 6.3కోట్లమేర సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు నెలకొని ఉండగా, కేంద్ర పూచీకత్తుపై అత్యవసర రుణప్రదానం 45లక్షల యూనిట్లకు మేలు చేయనుందన్న అంచనాలే- పథక రచనలో మౌలిక లోపాన్ని పట్టిచ్చాయి. లఘు పరిశ్రమల రంగానికి నికరంగా రూ.45లక్షల కోట్ల దాకా అవసరమైన నిధుల్లో బ్యాంకులు సమకూరుస్తున్నది 18శాతం లోపే. ఆ లొసుగును పూడ్చటంలో ముఖ్యభూమిక పోషించాల్సిన ప్యాకేజీ అక్కరకు రాని చుట్టంగా మిగలడానికి దారితీసింది నిబంధనలే. వడ్డీరేటును కనిష్ఠ స్థాయికి నిర్ధారిస్తూ చెల్లింపు వ్యవధిని పదేళ్ల వరకు విస్తరించి ఉండాల్సింది. ఏడాదిపాటు అసలుపై మారటోరియం విధించినా నాలుగేళ్లలో రుణాలు తిరిగి చెల్లించాలనడం, 9.25శాతం వడ్డీరేటును నిర్ధారించడంతో లఘు పరిశ్రమలు దిమ్మెరపోయాయి. 'కొల్లేటరల్ సెక్యూరిటీ'తో నిమిత్తం లేకుండా అదనపు రుణం మంజూరు చేయాల్సిన బ్యాంకులు అందుకు నిరాకరిస్తుండటం మూలాన భారీ ఉద్దీపన స్ఫూర్తి మసకబారింది. ఈ యథార్థాల్ని విస్మరించి ఇప్పుడు పథకం కాలావధిని పొడిగించినంత మాత్రాన అదనంగా ఒరిగేదేముంది?
తోడ్పాటు సజావుగా అందుంటే...
లాక్‌డౌన్ దరిమిలా అందుబాటులో ఉన్న కొద్దిపాటి సిబ్బందితో 30శాతం వరకు లఘు పరిశ్రమలు ఉత్పత్తి కార్యకలాపాలు ఆరంభించినా, ఎక్కడా ఏదీ సరైన గాడిన పడలేదు. ముందస్తు చెల్లింపులతోనే ముడిసరకు సరఫరా అవుతోందని, రవాణా ఛార్జీలు తడిసి మోపెడై ఆర్థిక క్లేశాలు ముమ్మరించినట్లు నిర్వాహకులు వాపోతున్నారు. అత్యవసర రుణ తోడ్పాటు సజావుగా అంది ఉంటే, లఘు పరిశ్రమలు నేడిలా దిక్కుతోచని స్థితిలో కునారిల్లేవి కాదు! తీవ్ర కష్టనష్టాల బారిన పడిన చిన్న సంస్థలు మరింత ఛిన్నాభిన్నం కాకుండా యూకే సిన్హా కమిటీ సిఫార్సుల్ని తక్షణం అమలుపరచడంతోపాటు ముద్రా బ్యాంకు ద్వారా అదనపు రుణ సహాయం అందించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గత ఏప్రిల్‌లో పిలుపిచ్చింది. వాస్తవిక కార్యాచరణలో ఆ స్ఫూర్తి వట్టిపోతుండగా- ఇప్పటికే సుమారు 11 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించిన చిన్న సంస్థల్ని మరో అయిదు కోట్లమందికి జీవిక ప్రసాదించేలా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి గడ్కరీ చెబుతున్నారు.
సంస్కరణలు మొదలుపెట్టాలి!
కరోనా వైరస్ కోరసాచక ముందు- జీడీపీలో 29శాతంగా ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వాటాను ఏడేళ్లలోగా 50 శాతానికి విస్తరించాలని కేంద్రం సంకల్పించింది. అవి వట్టిమాటలుగా మిగిలిపోరాదంటే, రుణ వితరణతోనే సత్వరం సంస్కరణలు మొదలుపెట్టాలి! జర్మనీ, సింగపూర్, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటివి లఘు పరిశ్రమలకు సమధిక ప్రాధాన్యం కట్టబెట్టి సృజనాత్మక డిజిటల్ సాంకేతికతను మప్పి విశేషంగా రాణిస్తున్నాయి. చిన్న సంస్థలు సకారణంగా కోరినంతనే రుణాల మంజూరు నిమిత్తం వెయ్యి గ్రామీణ వాణిజ్య బ్యాంకులకు చైనా నిధులందిస్తోంది. అందుకు విరుద్ధంగా అహేతుక నిబంధనలు, అంతంత మాత్రం వ్యవస్థాగత పరపతి ఇక్కడి లఘు పరిశ్రమల ఉసురు తీస్తున్నాయి. సంక్షోభంలో సదవకాశం చూడాలంటున్న కేంద్రం- చిన్న సంస్థల్ని చురుగ్గా ఆదుకుంటే, మున్ముందు దేశార్థికానికి అవి పెద్ద ఆసరా కాగలుగుతాయి!