ETV Bharat / opinion

ముంచుతున్న నిర్లక్ష్యం 'వరద' - floods in assam

ఏటా దేశంలోని పలు రాష్ట్రాలు వరదల తాకిడికి అతలాకుతలం అవుతున్నాయి. గతేడాది బిహార్​, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో వరదలు విలయం సృష్టించాయి. ప్రస్తుతం అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. వరదల నివారణకు సరైన ప్రణాళిక లేక భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్న తొలి అయిదు దేశాల్లో భారత్​ ఒకటిగా నిలుస్తోంది. నెదర్లాండ్స్‌- పటిష్ఠ రక్షణ ఛత్రాన్ని సిద్ధం చేసి ప్రపంచానికే పాఠాలు చెబుతోంది. ఆ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని వరద ముప్పు నివారణ చర్యలకు ఇండియా నిష్ఠగా నిబద్ధం కావాలి!

floods in India
ముంచుతున్న నిర్లక్ష్యం 'వరద'
author img

By

Published : Jul 20, 2020, 7:55 AM IST

నిరుడీ రోజుల్లో బిహార్​లోనూ, ఆగస్టు నెలలో ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వరదలు సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ఆ ఉత్పాతాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ముంచెత్తుతున్న వరదల బీభత్సంతో అసోం అల్లాడిపోతోందిప్పుడు! బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియ భరలి, కొపిలి, బెకి వంటి నదులన్నీ ప్రమాద సూచికల్ని మించి వరదలెత్తుతుండటంతో- 27 జిల్లాల్లో అరకోటి మందికి పైగా జనజీవనం అతలాకుతలమైంది. ఎనభై మంది అభాగ్యుల ప్రాణాల్ని కబళించిన వరదల వైపరీత్యం- 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న కజిరంగా జాతీయ పార్కులో 95 శాతాన్ని ముంచేసి ఖడ్గమృగాలు సహా ఎన్నో మూగజీవాల ఉసురుతీసింది.

కరోనా మహమ్మారి విజృంభణతో కళవరపడుతున్న అసోంలో ఆగస్టు మధ్యనాటికి 64 వేల కేసులుంటాయని ఆరోగ్యశాఖే అంచనా కట్టిన నేపథ్యంలో విరుచుకుపడిన వరదలు రెండున్నర లక్షల హెక్టార్లలో పంటల్ని ధ్వంసం చెయ్యడమే కాదు- జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ పెచ్చుమీరే అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. భారతావని భూభాగంలో 12 శాతానికి(నాలుగు కోట్ల హెక్టార్లు) వరద ముప్పు ఉందని దశాబ్దాల క్రితమే గుర్తించినా, ఇండియా ఎదుర్కొంటున్న ప్రకృతి విపత్తుల్లో 52 శాతం వరదలే ఉంటున్నాయని తెలిసినా- తీరైన కార్యాచరణ పట్టాలెక్కకపోబట్టే, అనేక రాష్ట్రాలు ‘కావవే... వరదా’ అని వేడుకోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతోంది. 1953-2017 మధ్యకాలంలో దాదాపు లక్షా ఏడు వేలమంది వరదల్లో మరణించారని, రూ.3.66 లక్షల కోట్ల ఆస్తినష్టం సంభవించిందనీ కేంద్ర జలసంఘం రెండేళ్ల క్రితం ప్రకటించింది. వాతావరణ మార్పులతో వరదలు మరింతగా పోటెత్తి మహా నగరాల్నీ ముట్టడిస్తున్న తరుణంలో- దిద్దుబాటు చర్యల్ని మరేమాత్రం ఉపేక్షించే వీలులేదు!

తొలి ఐదింటిలో..

వాతావరణ మార్పుల కారణంగా 2050నాటికి ఇండియా జనాభాలో సగంమంది జీవన ప్రమాణాలు కోసుకుపోతాయని ప్రపంచ బ్యాంకు అధ్యయనం లోగడ నివేదించింది. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు అత్యధికంగా సంభవిస్తున్న తొలి అయిదు దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తోంది. తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం, నేటి అవసరాలకు దీటుగా లేని డ్రైనేజి వ్యవస్థ, రిజర్వాయర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వరద నియంత్రణ నిర్మాణాలు లోపభూయిష్ఠంగా ఉండటం వంటివి వరదల ముప్పును పెంచుతున్నాయని కేంద్రమే అంగీకరించింది.

కాగితాలు దాటనేలేదు..

1960ల నాటి కరకట్టలు 1990 నాటికే సామర్థ్యం కోల్పోగా 2000 సంవత్సరం నుంచి ఏటా వరదల ఉత్పాతం అసోం సౌభాగ్యాన్ని కబళిస్తూనే ఉంది. 2004 నాటి భీకర వరదలు దాదాపు 500 మందిని బలిగొన్న వేళ- శాశ్వత పరిష్కారాలు కనుగొనాలంటూ నాటి కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తే, దాని నివేదిక మీద సాలీళ్లు గూళ్లు కడుతున్నాయి. బ్రహ్మపుత్ర నదీగర్భంలో మేటను తొలగించడం ద్వారా వరదల కట్టడిని లక్షించిన రూ.40 వేలకోట్ల పథకం ఇంకా కాగితాలు దాటనేలేదు. దేశవ్యాప్తంగా విపత్తుల్ని ఎదుర్కోవడానికి పద్నాలుగో ఆర్థిక సంఘం అయిదేళ్ల కాలావధికి చేసిన కేటాయింపులే రూ.61,219 కోట్లు! రాష్ట్రాలవారీగా ఉత్పాతాల నిభాయక సంస్థల్ని పటిష్ఠీకరించేందుకు, ఆస్తి, ప్రాణ నష్టాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసే కార్యాచరణకు కొత్త ఆర్థిక సంఘం ఏమిస్తుందో తెలియదు!

వరదల నుంచి రక్షణ నిమిత్తం వెచ్చించే ఒక్కో డాలరు- ఏడెనిమిది డాలర్ల నష్ట నివారణకు దోహదపడుతుందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. సముద్ర మట్టానికి దిగువన ఉన్న ప్రాంతాల్లోనే మూడింట రెండొంతుల ఆర్థిక వ్యవస్థ గల నెదర్లాండ్స్‌- పటిష్ఠ రక్షణ ఛత్రాన్ని సిద్ధం చేసి ప్రపంచానికే పాఠాలు చెబుతోంది. ఆ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని వరద ముప్పు నివారణ చర్యలకు ఇండియా నిష్ఠగా నిబద్ధం కావాలి!

ఇదీ చూడండి: అసోంలో ఆగని వరద ఉద్ధృతి.. 105కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.