అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఐదు రకాల వలసదారుల వీసాలు ఉన్నాయి. దేశంలో పౌరసత్వం పొందడం, శాశ్వతంగా స్థిరపడటం(గ్రీన్ కార్డు), కుటుంబం, శరణార్థులు, అడాప్షన్ ఇందులో విభాగాలు. ఇందులో భాగంగా వీరికి వివిధ రకాల వీసాలు జారీ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. హెచ్1బీ, హెచ్2బీ, జే, ఎల్ వీసాలు వలసేతరులకు స్వల్ప కాలంలో అమెరికాలో పనిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి.
ఇదీ చదవండి: ట్రంప్ దెబ్బ.. ఏ వీసాపై ఎలాంటి ప్రభావం?
హెచ్1బీ
1990 యూఎస్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ప్రకారం హెచ్1బీ వీసాలను జారీ చేస్తున్నారు. విశ్వవిద్యాలయ డిగ్రీ కలిగి ఉన్న విదేశీయులను తాత్కాలికంగా ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి సంస్థలకు అవకాశం కల్పిస్తున్నారు. సాధారణంగా హెచ్1బీ వీసా 3 నుంచి 6 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఉద్యోగ గడువు పూర్తయినా ఈ వీసాదారులు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు.
హెచ్2బీ
హెచ్2బీ వీసాలు వ్యవసాయేతర కార్మికులకు ఇస్తారు. 81 దేశాలకు ఈ వీసాలు జారీ చేస్తారు. అయితే ఇందులో భారత్ లేదు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా అమెరికాలో 6 నెలల నుంచి సంవత్సరం వరకు పని చేయడానికి వచ్చే కార్మికులకు ఈ వీసా మంజూరు చేస్తారు.
వీసా 'జే'
'జే' వీసాలు ప్రత్యేకమైన సాంస్కృతిక, విద్యాపరమైన కార్యక్రమాల కోసం జారీ చేస్తారు. వీసా పొందిన వ్యక్తులు ఆ కార్యక్రమాలు పూర్తైన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
'ఎల్' వీసా
అమెరికా వెలుపల ఉన్న కంపెనీలకు పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లకు ఈ ఎల్ వీసాలు మంజూరు చేస్తారు. విదేశాల్లో పనిచేసే తమ ఉద్యోగులను తాత్కాలికంగా లేదా ప్రత్యేక కార్యాచరణ నిమిత్తం అమెరికాకు రప్పించాలనుకుంటే ఈ వీసాలను ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: 'హెచ్1బీ వీసాలపై ఆంక్షలు తెలుగువారిపై పెద్దగా ఉండవు'
అయితే.. జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ వీసాదారులకు అమెరికాలోని ప్రవేశం లేకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. 2020, ఏప్రిల్ 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. అమెరికాలోని ఉద్యోగాలకు వలసదారులు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నారని ట్రంప్ అప్పట్లో ఆరోపించారు. అయితే ఏప్రిల్ ప్రకటనలో హెచ్1బీ, హెచ్2బీ, ఎల్ కేటగిరీలను చేర్చలేదు.
ఇదీ చదవండి: 'అమెరికా వెళ్లే అవకాశం పోయిందని ఆందోళన వద్దు'
ఎన్నికల వ్యూహం!
2020 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులోనే ఉంటుంది. ఎన్నికల్లో శ్వేతజాతీయుల ఓట్లను ఆకర్షించడానికి ట్రంప్ ప్రయోగించిన మరో అస్త్రమే ఈ విదేశీ వ్యతిరేక విధానం. వలసదారు వ్యతిరేక విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి క్రమంగా అమలు చేస్తూ వస్తోంది. ఆఫ్రికా సహా ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణాలపై నిషేధం విధించింది. అమెరికాలో ఆశ్రయం పొందడాన్ని దాదాపు అసాధ్యం చేసింది. అమెరికా దక్షిణ సరిహద్దును పంచుకునే మెక్సికోకు అడ్డంగా గోడ నిర్మించేందుకు అమితాసక్తి కనబర్చారు ట్రంప్. దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులను అడ్డుకుంటామని ఎన్నోసార్లు ఉద్ఘాటించారు.
శరణార్థుల అమెరికా ప్రవేశానికి సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షించే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇన్ఫర్మేషన్(యూఎస్సీఐఎస్) విభాగాన్ని ఈ ఏడాది మార్చి నుంచి నిలిపివేశారు. దీంతో ఇప్పటికే ఉన్న వలస దరఖాస్తుల ప్రక్రియ సైతం ఆగిపోయింది.
కొవిడ్ ప్రభావం
2020 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య ఏకంగా 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. కీలక రంగాల్లో అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్1బీ, ఎల్ వీసాదారులను సంస్థలు చేర్చుకుంటున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన 1.7 కోట్ల మంది అమెరికన్ల స్థానంలో హెచ్2బీ వీసాదారులను భర్తీ చేసుకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అమెరికాలోని ఉద్యోగాలపై ఏర్పడిన ప్రతికూల ప్రభావం వల్లే ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బహిరంగంగానే అసంతృప్తి
విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు చేయడంపై ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల నుంచి అమెరికన్లు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
"ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలో తాత్కాలికంగా పనిచేయడానికి వచ్చిన విదేశీయులతో అమెరికన్లు పోటీ పడుతున్నారు. విదేశీ ఉద్యోగులు తమ భార్య, పిల్లలను దేశానికి తీసుకొస్తున్నారు. అందులో చాలా మంది అమెరికన్లకు పోటీగా వస్తున్నారు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వీసాలపై అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా 5.25 లక్షల ఉద్యోగాలను కాపాడినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని మైనారిటీలు, దివ్యాంగులు, కాలేజీ డిగ్రీ లేని ఆఫ్రో అమెరికన్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
వీరికి మినహాయింపు
ఈ వీసాల్లో కొన్ని రంగాల వారికి మినహాయింపులు ఇచ్చారు. ఆహార సరఫరా రంగంలో పనిచేసే హెచ్2బీ వీసాదారులు, 'దేశ ప్రయోజనాల' కోసం పనిచేసే వ్యక్తులను ఇందుకు మినహాయించారు. రక్షణ, కరోనా సంబంధిత వైద్య సేవలు, న్యాయం, దౌత్యం-జాతీయ భద్రత సహా అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అవసరమయ్యే వ్యక్తులను 'దేశ ప్రయోజనాల' కేటగిరీలో చేర్చారు. హెచ్1బీ, ఎల్ వీసాదారులను అనుమతించాలని రాజకీయ ప్రభావం ఉన్న కంపెనీలు ట్రంప్ యంత్రాంగాన్ని కోరిన నేపథ్యంలో చివరి కేటగిరీకి చేర్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ట్రంప్ 'వీసా' దెబ్బతో నష్టం ఎవరికి? లాభపడేదెవరు?
భారత్‌పై ప్రభావం
వీసాలు నిలిపివేయడం వల్ల భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఏటా అమెరికా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాల్లో ముప్పావు వంతు భారత పౌరులే వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఈ వీసాలపై అమెరికా వెళ్తున్నారు. 2004-12 మధ్య 5 లక్షల వీసాలు భారతీయ ఉద్యోగులకు జారీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కుటుంబసభ్యులతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 7.5 లక్షలు ఉంటుంది. అమెరికాలో ఉన్న 30 లక్షల భారత సంతతి ప్రజలతో కలిసి వీరంతా... ఆ దేశ ఆర్థిక ప్రగతిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
భారత సంస్థలకూ ముఖ్యమే
భారత్‌కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సంస్థలు ప్రధానంగా ఈ హెచ్1బీ వీసాలను ఉపయోగించుకుంటున్నాయి. వీటితో పాటు 2017 నాటికి భారత్‌కు చెందిన మొత్తం 100 కంపెనీలు అమెరికాలో 17.9 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలలో కలిపి 1.13 లక్షల ఉద్యోగాలు కల్పించాయి.
వస్తు, సేవల రంగంలో భారత్‌కు అమెరికా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. హెచ్1బీ వీసాలు నిలిపివేయడం వల్ల అమెరికాలోని సాంకేతిక, తయారీ, అకౌంటింగ్ రంగాల భారత కంపెనీలకు నైపుణ్య కార్మికుల అంతరాయం ఏర్పడుతుంది. కొవిడ్ ప్రభావిత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ రంగాలే ప్రభావవంతంగా పనిచేస్తాయి.
నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారుల సేవలపై నిషేధం విధిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత పౌరులు, సంస్థలకే కాక ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం పడుతుంది. ఈ చర్య భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. పరస్పర ప్రయోజనకరమైన అంశాలను ఇది బలహీనపరుస్తుంది.
(రచయిత- అశోక్ ముఖర్జీ, ఐక్యరాజ్య సమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి, వాషింగ్టన్ డీసీకి భారత మాజీ రాయబారి)
ఇవీ చదవండి