దేశంలో వివిధ కారణాల వల్ల జరుగుతున్న పంటల నష్టం రూ.92వేల కోట్లకు పైమాటేనని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అనుబంధ విభాగం సీఫెట్ (కేంద్ర పంట కోతల అనంతర ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థ) 2012లో అంచనా వేసింది. ఆ తరవాత కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ అధ్యయనం సైతం వ్యవసాయ రంగంలో భారీయెత్తున వృథా జరుగుతోందని 2015లో నిర్ధరించింది. దేశంలో 120 జిల్లాల్లో 43 పంటలు, పాడి పరిశ్రమ ఉత్పత్తి గణాంకాలను, టోకు ధరలను ఆ అధ్యయనంలో పరిశీలించారు. ఆహార ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు, ఉద్యాన పంటలు, మసాలా దినుసులు, కూరగాయలు, పండ్లు, పాలు, చేపలు, మాంసం, కోడి మాంసం ఉత్పత్తి, రవాణాలలో వృథా జరుగుతోంది. పంట కోత, నూర్పిడి, గ్రేడింగ్, ఆరబెట్టడం, ప్యాకేజింగ్, రవాణా స్థాయుల్లో నష్టం జరుగుతోంది. పొలం వద్ద, గోదాములు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, టోకు వర్తకులు, చిల్లర వర్తకుల స్థాయుల్లో నిల్వ నష్టాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మొక్కజొన్న పంటకు 4.65 శాతం, జొన్నకు 5.99 శాతం మేర నష్టం సంభవిస్తోంది.
మౌలిక వసతులు పెరగాలి
పంట నష్టాలను నివారించాల్సిన అవసరాన్ని రైతులకు తెలియజెప్పాలి. శీతలీకరణ, నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలను విస్తరించాలి. పంట కోత, నూర్పిళ్లు, పంట గ్రేడింగ్ స్థాయులలో నష్టాలను బాగా తగ్గించాలి. పంట కోత నుంచి అమ్మకం వరకు పడుతున్న వ్యవధిని తగ్గిస్తే నష్టాలను నివారించవచ్చు. పంటలను నిల్వచేసినప్పుడు వివిధ కారణాల వల్ల నాణ్యత తగ్గిపోతోంది. అలాంటి నాసిరకం బియ్యం, గోధుమలను ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేయకూడదు. భారత ఆహార సంస్థ (ఎఫ్.సీ.ఐ) 2013-14లో రాష్ట్ర ప్రభుత్వాలకు 523 లక్షల టన్నుల బియ్యం, గోధుమలను జారీచేయగా, వాటిలో కేవలం 0.047 శాతం గింజలే నాసిరకమైనవిగా తేలింది. 2018-19లో ఈ నష్టం 0.02 శాతమే. గిడ్డంగుల్లో బియ్యం, గోధుమలను దీర్ఘకాలం నిల్వ చేస్తే వాటిలో తేమ శాతం తగ్గిపోతుంది. ఇది గోధుమలకు మంచిదే కానీ, బియ్యానికి నష్టదాయకం. 2012-13లో నిల్వ నష్టాలు 0.22 శాతం; ఎఫ్‌సీఐ దీన్ని 2019-20లో 0.03 శాతం మిగులుగా మార్చగలిగింది. 2013-14లో మొత్తం నిల్వ నష్టం రూ.457 కోట్ల పైచిలుకు. ఎఫ్‌సీఐ కాలువలు, రహదారులు, రైల్వేల ద్వారా ఆహార ధాన్యాలను రవాణా చేసేటప్పుడు జరిగే నష్టాన్నీ తగ్గించగలిగింది. 2012-13లో 0.47 శాతంగా ఉన్న రవాణా నష్టాన్ని 2019-20లో 0.33 శాతానికి తగ్గించింది.
నష్టాలను అరికట్టే మార్గాలు
ఆహార ధాన్యాలను బస్తాల్లో కాకుండా ఉక్కు గాదెల్లో రాశులుగా పోసి భద్రపరిస్తే నిల్వ నష్టాలు బాగా తగ్గిపోతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆధునిక ఉక్కు గాదెలను ఏర్పాటుచేసే కార్యక్రమం చేపట్టింది. ఒక గాదె నుంచి మరో గాదెకు ఆహార ధాన్యాలను ప్రత్యేక వ్యాగన్లలో రాశులుగా తరలించడం ద్వారా రవాణా నష్టాన్ని అరికట్టవచ్చు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ఆహార ధాన్యాలను సాధారణ గిడ్డంగుల్లో బస్తాలుగా నిల్వ చేస్తోంది. 2019 డిసెంబరు నాటికి ఎఫ్‌సీఐకి 127.77 లక్షల టన్నులను సాధారణ గిడ్డంగుల్లో నిల్వచేసే సామర్థ్యం ఉండగా, ఉక్కు గాదెల్లో కేవలం 1.10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమే ఉంది. ఉక్కు గాదెల వద్దనే గోధుమలను సేకరిస్తే- ఏపీఎంసీ మండీల్లో, సహకార సంఘాల సేకరణ కేంద్రాల్లో చెల్లించాల్సిన కమిషన్లు ఆదా అవుతాయి. పంజాబ్, హరియాణాలలో 2021 ఏప్రిల్ నుంచి ఉక్కు గాదెల వద్ద గోధుమ సేకరణపై మార్కెటింగ్ రుసుము ఏదీ చెల్లించనక్కర్లేదు. ఆ మేరకు ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుంది. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తుందో లేదో కానీ, గోధుమ సేకరణను యథాతథంగా కొనసాగిస్తానని లిఖితపూర్వకంగా వాగ్దానం చేసింది. నిరుటికన్నా ఈ ఏడాది ఎక్కువ గోధుమ సేకరణ జరగనున్నది. ఆ అదనపు గోధుమల నిల్వకు గిడ్డంగులను పెంచక తప్పదు. మామూలు గిడ్డంగుల బదులు ఉక్కు గాదెల నిర్మాణాన్ని చేపట్టాలి.
పంపిణీ సమస్యలకు తక్షణ పరిష్కారం
భారతదేశం 2020 అంతర్జాతీయ ఆకలి సూచీలోని 107 దేశాల్లో 94వ స్థానం ఆక్రమిస్తున్నా, ఇక్కడ ఏటా 1400 కోట్ల డాలర్ల విలువైన ఆహారోత్పత్తులు వృథా కావడం విడ్డూరం. 2020లో కొవిడ్ మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసిన నేపథ్యంలో ఆహారం ఇంతగా వృథా కావడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. కొవిడ్ కాలంలో పేదలకు ఆహార పంపిణీ చేసిన ప్రభుత్వం, వైరస్ తాకిడి మరికొన్నేళ్లపాటు ఉంటుందని గ్రహించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆహార వృథాను నిర్మూలిస్తే పేదలకు పంపిణీ చేయడానికి మరింత ఆహారం లభ్యమవుతుంది. వినియోగదారులు అవసరానికన్నా ఎక్కువ ఆహారం కొనడం వల్ల కూడా వృథా జరుగుతోంది. సూపర్ మార్కెట్లలో భారీ తగ్గింపు ధరలకు పెద్ద పెద్ద ప్యాకెట్లలో ఆహారోత్పత్తులు విక్రయించడం ఈ పరిస్థితికి ఒక కారణం. కుటుంబాలు తాము కొన్న ఆహారాన్ని సరిగ్గా నిల్వచేయలేకపోవడం మరొక కారణం. పెళ్ళిళ్లలో 10 నుంచి 20 శాతం వరకు ఆహారం వృథా అవుతోంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల రక్షణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆహార వృథాను అరికట్టడాన్ని ఉద్యమ ప్రాతిపదికపై చేపట్టింది. దీన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలూ స్వచ్ఛంద సంస్థలూ కలసికట్టుగా పనిచేయాలి.
ఉక్కు గాదెల్లో ధాన్యం నిల్వ!
ఆహార ధాన్యాల నష్టాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పైలెట్ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ఎప్పటిలా బస్తాల్లో ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. బియ్యం నిల్వకోసం బిహార్‌లోని కైమూర్, బక్సార్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉక్కు గాదెలు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా 15.10 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు అనువుగా ఉక్కు గాదెలు నిర్మిస్తామని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) స్పష్టం చేస్తోంది.
- పరిటాల పురుషోత్తం, రచయిత - సామాజిక ఆర్థిక విశ్లేషకులు
ఇదీ చదవండి: ఈ 'పంచ'తంత్రం.. అందరికీ పెద్ద పరీక్షే!