మలిదఫా విజృంభణలో కొవిడ్ కేసులు ఇంతలంతలవుతున్న తీరు యావత్ దేశ ప్రజానీకాన్నీ హడలెత్తిస్తోంది. కొన్ని నగరాల్లో రాష్ట్రాల్లో రాత్రివేళ కర్ఫ్యూ, పరిమిత కాల లాక్‌డౌన్ విధింపు నిర్ణయాలు- పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. కరోనా వైరస్ మరింతగా రెచ్చిపోతే దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ అమలుపరచే అవకాశాలపై వివిధ అంచనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కి), అసోచామ్ ప్రతినిధులతో; టీసీఎస్, ఎల్‌అండ్‌టీ ప్రభృత సంస్థల సారథులతో సంప్రతింపుల సందర్భంగా- జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ విధింపు అవకాశాల్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ నిన్న- లాక్‌డౌన్ విధించే పరిస్థితి రాకుండా సకల చర్యలూ చేపట్టాలనడంపై మరోమాట లేదు! నిరుటి లాక్‌డౌన్ కారణంగా తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లోనే దేశార్థికం 23.9శాతం మేర కుంగిపోయిన అనుభవం పునరావృతం కారాదంటూ- బతుకులను, బతుకుతెరువులను కాపాడే వ్యూహరచనపై కేంద్రమిప్పుడు దృష్టి సారించింది.
జాప్యం తగదు..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45సంవత్సరాల గడువును తొలగించాల్సిందేనన్న సంస్థలు, సంఘాల ప్రతినిధులు స్థూలంగా కోరింది ఒకటే. గతంలో లాక్‌డౌన్ సందర్భంగా ప్రకటించిన వేర్వేరు పథకాలను పొడిగించాలన్న సూచన సత్వరం అనుసరించదగిందే. రెండోదఫా కొవిడ్ భీకర ప్రహారాల ధాటికి తరతమ భేదాలతో రాష్ట్రాలవారీగా చిల్లర వ్యాపారులు, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు, రోజుకూలీలు కకావికలమవుతున్నట్లు క్షేత్రస్థాయి కథనాలు స్పష్టీకరిస్తున్నాయి. మానవీయ సహాయం అందించే వ్యూహాలికనైనా పదును తేలాలి! రూ.25కోట్ల వరకు బకాయి పడి చెల్లించలేకపోతున్న రుణాన్ని ఒక్కసారి పునర్ వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ గతంలో ఉదార నిర్ణయం ప్రకటించింది. 2020 డిసెంబరుతో ముగిసిపోయిన ఆ పథకం గడువును 2022 మార్చి నెలాఖరు వరకు విస్తరించాలంటూ ఎఫ్‌ఐడీసీ (ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్) తాజాగా రిజర్వ్ బ్యాంకుకు చేసిన అభ్యర్థన సహేతుకమైంది. కోట్లమందిని సాంత్వనపరచే నిర్ణయాల విషయంలో జాప్యం ఎంతమాత్రం మంచిది కాదు!
కరోనా వైరస్ పెచ్చరిల్లడానికి మునుపు- స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో లఘు పరిశ్రమల 24 శాతం వాటాను ఏడేళ్లలోగా 50 శాతానికి విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అనూహ్య సంక్షోభంతో లెక్కలు తలకిందులయ్యాయి.
ఆత్మనిర్భర్ మొదలైనట్లు..
దేశంలో అతిపెద్ద ఉపాధికల్పనదారు అన్న తగరపు కిరీటం తప్ప చిన్న సంస్థల రంగానికి ఆపత్కాలంలోనూ పెద్దగా ఒరిగిందేమీ లేదు. సర్కారీ పూచీకత్తుపై 45 లక్షల యూనిట్లను గట్టెక్కించగలదంటూ ప్రకటించిన మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు రుణ వితరణ పథకం ఉపశమనం కలిగించిందెక్కడ? దేశంలోని లఘు పరిశ్రమలకు అవసరమైన రూ.45 లక్షల కోట్ల మేర నిధుల్లో బ్యాంకుల ద్వారా సమకూరుతున్నవి 18 శాతం లోపే. సుమారు 11 కోట్ల మందికి జీవనాధారంగా నిలుస్తున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రాణవాయువులూదేలా, రుణ పరపతిలో కంతల్ని పూడ్చాల్సిన కేంద్రం- ఇటీవలి బడ్జెట్లో దిగ్భ్రాంతకరమైన ప్రతిపాదనలు పొందుపరచింది. ఈ ఏడాది విపణి ప్రోత్సాహక పథకం (ఎంపీఎస్) నిధులు సగానికి తెగ్గోసుకుపోయాయి. సేకరణ, విపణి మద్దతు పథకానికీ అదే గతి పట్టింది. అననుకూల వాతావరణం నెలకొందంటూ- జాతీయ, అంతర్జాతీయ విపణుల్లో లఘు పరిశ్రమల ఉత్పత్తులకు గిరాకీ పెంపొందించడానికి ఉద్దేశించిన ఎమ్‌ఏఎస్ (విపణి తోడ్పాటు పథకం) పద్దుకు మొండిచెయ్యి చూపించారు. డిజిటల్ సాంకేతికతను అలవరిస్తే ఇక్కడి చిన్న సంస్థలు ప్రపంచ దేశాల ఆదరణ చూరగొనగలవని కేపీఎంజీ-గూగుల్ అధ్యయనం చెబుతుండగా, వాస్తవంలో అవి ఉనికి కోసం అనునిత్యం పోరాడాల్సి వస్తోంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు నిలదొక్కుకుంటే కోట్లాది జీవితాల్ని కుదుటపరచగలుగుతాయి. వాటిని సమస్యల సుడిగుండం నుంచి వెలికిలాగి ఆపన్నహస్తం అందించేలా సమర్థ కార్యాచరణ పట్టాలకు ఎక్కితేనే-'ఆత్మనిర్భర్ భారత్' ఆవిష్కరణ మొదలైనట్లు!
ఇదీ చదవండి: ఆక్సిజన్ ప్లాంట్లకు సాయుధ బలగాల రక్షణ
ఇదీ చదవండి: ఆన్‌లైన్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు