బుద్ధిగా బువ్వ తినకపోతే బూచాడొచ్చి పట్టుకెళ్తాడని బుడ్డోళ్లను బెదిరించడం అమ్మలందరికీ అలవాటే. తల్లికోడిలా పిల్లల్ని రెక్కల కింద ఎంత జాగ్రత్తగా పొదువుకొన్నా అదాటున గద్దల్లా వచ్చి తన్నుకుపోయే బూచాళ్ల సంతతికి పట్టపగ్గాల్లేకపోవడం- సామాజికంగా పెను ఉపద్రవమే. 2015-18 మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా రెండు వేలమంది పిల్లలు కనపడకుండా పోయారని, వారిలో 1,350 మంది ఆడపిల్లలు, తక్కినవారు మగపిల్లలని పేర్కొంటూ- వాళ్ల ఆనుపానుల్ని పసిగట్టాల్సిన పోలీసులు ఆయా కేసుల్ని మూసేస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆడపిల్లల అక్రమ రవాణాలో తెలంగాణ దేశంలోనే ఎనిమిదో రాష్ట్రంగా దుష్కీర్తి మూట కట్టుకోవడాన్ని ప్రస్తావించి, సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలే- మాటేసిన మాఫియా శక్తుల వేటకు బలైపోతున్నారని పిటిషనర్ విన్నవించారు. మూసేసిన కేసుల్ని మళ్లీ తెరిచి దర్యాప్తు సాగిస్తే అసలైన నేరగాళ్ల పనిపట్టగల వీలుందన్న అర్జీకి స్పందిస్తూ- మానవ అక్రమ రవాణా మాఫియా మీద పోరులో కేంద్ర ప్రభుత్వాన్నీ భాగస్వామిని చెయ్యాలని ఉన్నత న్యాయపాలిక తాజాగా సూచించింది. తమను తాము కాపాడుకోలేని పిల్లల రక్షణ విషయంలో ఎలాంటి ఉదాసీనతా పనికిరాదనీ హితవు పలికింది. ఏటికేడు పెరుగుతున్న పిల్లల అదృశ్యం కేసులు ఒక్క తెలంగాణకే పరిమితమైనవి కావు. పసివాళ్లను కసిగా కబళిస్తున్న రాబందుల రెక్కల్ని కత్తిరించడానికి- మానవ అక్రమ రవాణాపై మడమ తిప్పనిపోరు ఉద్ధృతంగా సాగాలిప్పుడు!
మధ్యప్రదేశ్లో అధికంగా..
హైదరాబాద్‌లో అపహరణకు గురైన రెండున్నరేళ్ల పాపను 24 గంటల వ్యవధిలోనే పోలీసులు తిరిగి తల్లి ఒడికి చేర్చగలిగారు. ఆ పాపను అమ్మి అవసరాలు తీర్చుకోవాలనుకున్న ఆటో డ్రైవర్ నోరు విప్పితే తప్ప పిల్లల విక్రయ ముఠాల నెట్‌వర్క్ లోతుపాతులు బయటపడవు. 2019లో దేశవ్యాప్తంగా 73,138 మంది పిల్లలు కనిపించకుండా పోయారని, వారిలో 71శాతం ఆడపిల్లలేనని జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ రెండు నెలల క్రితం వెల్లడించింది. 15-18 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు అందులో 78శాతమని, 6-14 ఏళ్లలోపు ఉన్నవారు 17 శాతమని నివేదించింది. పిల్లలు కనిపించకుండా పోవడంలో మధ్యప్రదేశ్(15శాతం), బంగాల్, బిహార్, దిల్లీ, మహారాష్ట్ర తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. 2018లో 61.5శాతం పిల్లల్ని కనిపెట్టగలిగినట్లు, 2019లో అది 59.6శాతానికి పరిమితమైనట్లు చాటుతున్న గణాంకాలు- వాస్తవ దయనీయ స్థితిని ప్రతిబింబించేవి కావు. పోలీసు పొత్తాల్లో నమోదయ్యేవాటికన్నా ఎంతో ఎక్కువగా 'కనిపించని' కేసులు ఉంటాయి. సగటున 40శాతం కేసుల్లో ఆచూకీ లభ్యం కావడంలేదంటే, మానవ అక్రమ రవాణా మూలాలు ఎంత బలిష్ఠంగా ఊడలు దిగి విస్తరించాయో గ్రహించాలి. 15 ఏళ్లలోపు పిల్లల్ని అపహరించి అక్రమంగా తరలించడం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యాపారంగా వేళ్లూనుకొందంటే- దాని మూలాలు పెకలించడానికి ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన కదలాలి!
నాలుగేళ్లైనా పూర్తికాని విచారణ..
కంటిపాపల్లా చంటిపిల్లల్ని సాకే తల్లిదండ్రులకు వారు కనబడకుండా పోతే కలిగే క్షోభ అంతా ఇంతా కాదు. ఫిర్యాదు అందగానే పోలీసులు స్పందిస్తే కథ సుఖాంతమయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయో, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తే అంతకంతా భయావహ పరిస్థితులూ ఉత్పన్నమవుతాయి. నొయిడాలోని నిథారిలో 2006 డిసెంబరు చివర్లో ఓ మురుగుకాల్వలో ఎనిమిది అస్థిపంజరాలు లభ్యమై గగ్గోలు పుట్టింది. తీగ లాగితే కదిలిన డొంకలు- అంతక్రితం ఆ ప్రాంతంలో రెండేళ్లుగా కనబడకుండా పోయిన 16 మంది పిల్లల దారుణ హత్యకు సాక్షీభూతంగా ఎముకల గూడుల్ని కళ్లకు కట్టాయి. ఆ కేసులో నిందితులుగా సీబీఐ బోనెక్కించిన వ్యాపారి మొహిందర్ సింగ్ పంథేర్, అతగాడి సహాయకుడు సురేందర్ కోలిల మీద వరస హత్యాచారాల నేరాభియోగాలపై ఇంకా విచారణ పూర్తి కానేలేదు. ఆ దారుణాలపై దర్యాప్తు జరిపిన మంజులాకృష్ణన్ కమిటీ 2007 జనవరిలోనే- తప్పిపోయిన పిల్లల భద్రతకు పోలీసు యంత్రాంగం స్పందన ఏ విధంగా ఉండాలో వివరిస్తూ నివేదిక సమర్పించినా- వాటి అమలుకు గట్టి కృషి సాగడంలేదు.
2014లో అజంఖాన్ యూపీ క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు రామ్‌పూర్‌లోని వ్యవసాయ క్షేత్రం నుంచి కొన్ని బర్రెలు కనిపించకుండా పోతే- ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం, పోలీసు జాగిలాల్నీ రంగంలోకి దింపి హుటాహుటిన వాటి ఆచూకీ కనిపెట్టగలిగింది. అదే 2008-2010 జనవరి మధ్య దేశవ్యాప్తంగా 392 జిల్లాలనుంచి లక్షా 17 వేల మంది పిల్లలు కనిపించకుండా పోగా, వారిలో దాదాపు 42 వేల మంది ఆచూకీ దొరకనేలేదంటూ 2013లో 'బచ్‌పన్ బచావో ఆందోళన్' సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోజుకు సగటున వందమంది పిల్లలు అదృశ్యమవుతున్నారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో దర్యాప్తు జరపడంద్వారా వారిని కనిపెట్టే కార్యాచరణకు రాష్ట్రాలను ఆదేశించాలని నాటి ప్రజాప్రయోజన వ్యాజ్యం కోరింది. సుప్రీం వ్యక్తీకరించిన ఆందోళనకూ రాష్ట్రాలు చెవి ఒగ్గిన దాఖలాలు లేకపోబట్టే- కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చే దారుణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి!
పోలీసు వ్యవస్థతోనే..
ప్రపంచంలోనే అత్యధికంగా- జనాభాలో 53శాతం పిల్లలే ఉన్న దేశం మనది. ప్రతి ఎనిమిది నిమిషాలకొక 'అదృశ్య' కేసుతో బాలల భద్రత దేవతావస్త్రంలా మిగిలిన దేశమూ మనదే. సమీకృత బాలల పరిరక్షణ పథకా(ఐసీపీఎస్)న్ని 2009-10 నుంచే కేంద్రం పట్టాలకెక్కించి, రాష్ట్రాలన్నింటినీ దానిలో భాగస్వాముల్ని చేసినా- ఒనగూడిన ప్రయోజనం నామమాత్రమే. 2013-18 మధ్య అయిదేళ్ల కాలంలో తప్పిపోయిన పిల్లల్లో 43వేల మందిని 88 ప్రధాన రైల్వేస్టేషన్ల నుంచి కాపాడగలిగామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించింది. ఇంట్లో పెద్దలమీద అలిగి పారిపోయి వచ్చి ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న వారిని పసిగట్టి అయినవాళ్లకు అప్పగించడం శ్లాఘనీయమే. నేర ముఠాల చేతివాటానికి బలైపోతున్న వేలమంది అభాగ్యుల భవిష్యత్తే ఆందోళన రగిలిస్తోంది. ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి లేదా కొనుగోలు చేసి వారి సత్వర ఎదుగుదలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వ్యభిచార రొంపిలోకి దింపే ముఠాల దారుణాలు 2018లో యాదగిరిగుట్ట కేంద్రంగా వెలుగు చూశాయి. ఆ తరహా నేరముఠాలపై ఉక్కుపాదం మోపాలంటే మొదట రక్షకభట యంత్రాంగానికే సానపట్టాలి. స్వచ్ఛంద సంస్థల సాయంతో అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, ముఖ కవళికల గుర్తింపు సాంకేతికతను విస్తృతంగా వినియోగించి- చిరుదీపాలు కొడిగట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాచుకోవాలి. ఈ విధివిహిత బాధ్యతను న్యాయస్థానాలు ఇంకెన్నిసార్లు గుర్తు చేయాలి?
- పర్వతం మూర్తి, రచయిత
ఇదీ చదవండి: అన్నదాతల ఆందోళనలో ఏకమైన జాట్‌లు