కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు, కుదేలైన అసంఖ్యాక జీవితాలు, ఛిద్రమైన బతుకుతెరువులు, ఛిన్నాభిన్నమైన ఎన్నో రంగాలు... ఇవీ, కొవిడ్ మహా సంక్షోభం నేడు విశ్వవ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామాలు. 1930ల నాటి మహా మాంద్యం తరహా పెను విపత్తు పొంచి ఉందంటూ ఏప్రిల్ నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చేసిన భవిష్యద్దర్శనం నిజమైందనడానికి ఇప్పుడు దేశదేశాల్లో అనేకానేక రుజువులు!
ప్రజల తలసరి ఆదాయాలు తెగ్గోసుకుపోయి కోట్లమంది కడు పేదరికంలోకి జారిపోయే ప్రమాదాన్ని నాలుగు నెలల క్రితమే ఊహించిన ప్రపంచబ్యాంకు, 2021 చివరికల్లా దాపురించే దుస్థితిని తాజాగా మదింపు వేసింది. ముఖ్యంగా సబ్ సహారన్ ఆఫ్రికాలో, దక్షిణాసియాలో కొత్తగా 15కోట్లమంది దుర్భర దారిద్ర్యం పాలబడతారంటున్న ప్రపంచ బ్యాంకు- అందుకు తగ్గట్లు ఆయా దేశాల ప్రగతి వ్యూహాలు, నైపుణ్య శిక్షణ ప్రణాళికల రూపురేఖలు మారాలని పిలుపిస్తోంది. వాస్తవానికి, ఇండియాకు సంబంధించి మరింత దుస్సహ స్థితిని ఊహించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) అంచనా ప్రకారం- దేశంలో విస్తృత ప్రాతిపదికన ఉపాధి నష్టం దృష్ట్యా, పీకలోతున లేమిలో కూరుకుపోయే శ్రామికుల సంఖ్య ఎకాయెకి 40కోట్లు. ఆసియా
మాంద్యం సమయంలో కరోనా దెబ్బ
అభివృద్ధి బ్యాంకు, ఫిచ్ లాంటి రేటింగ్ సంస్థలు మొదలు ప్రపంచ బ్యాంకు వరకు దేశార్థిక రంగం 9- 9.6శాతం మేర క్షీణిస్తుందని విశ్లేషిస్తున్నాయి. అసలే మాంద్యం పాలబడి కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి ఇప్పట్లో కోలుకోలేనంత గట్టి దెబ్బ తీసింది. రేపెలా గడుస్తుందో అంతుచిక్కని అనిశ్చితి- ఉన్నట్లుండి స్థిరాదాయం లేకుండాపోయిన కోట్లమంది శ్రామికుల్ని, వారిపై ఆధారపడ్డవాళ్లను పట్టి కుదిపేస్తోంది. కొవిడ్ అనంతర స్థితికి దీటుగా పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు పట్టాలకెక్కి పరిస్థితి తిరిగి కుదుటపడేదాకా- అన్నార్తులకు రోజులు గడిచేదెలా, వారి ఆకలిమంటలు చల్లారేదెలా?
వ్యవసాయం ఆసరా
తరతమ భేదాలతో తక్కిన రంగాలు చతికిలపడగా, ఉన్నంతలో సేద్యం జాతిని సాంత్వనపరుస్తోంది. కొవిడ్ కోర సాచే సమయానికి దేశవ్యాప్తంగా అయిదు లక్షల రేషన్ దుకాణాలకు ఏడాదిపాటు ఆహారధాన్యాల సరఫరాకు కావాల్సిన నిల్వలతో గోదాములు సుభిక్షంగా ఉన్నాయి. రబీ దిగుబడులూ సమధికంగా అందుబాటులోకి వచ్చిన స్థితిలో- అసాధారణ సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించేలా ప్రభుత్వాల సన్నద్ధత పదును తేలాలి. సమృద్ధ నిల్వలున్నాయన్న భరోసాతోనే, దేశంలోని 80కోట్లమంది నిరుపేదలకు నవంబరు నెలాఖరు వరకు ఉచితంగా ఆహారధాన్యాలు, పప్పుదినుసులు ఇవ్వదలచినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రభుత్వాలు విధిగా...
కరోనా కరకు కోరల పాలబడి ఉపాధి కోల్పోయినవారి కుటుంబాలు ఆకలిమంటల్లో కుమిలిపోకుండా, మళ్ళీ సాధారణ జీవితం గడిపే వాతావరణం నెలకొనేదాకా- వారందరికీ ఉచితంగా రేషన్ సమకూర్చే మానవీయ బాధ్యతను ప్రజాప్రభుత్వాలే భుజాలకెత్తుకోవాలి. జిల్లాలు, రాష్ట్రాలవారీగా ఎక్కడ ఎంతమంది జీవనాధారం కోల్పోయి కుములుతున్నారో నిగ్గుతేల్చే కూలంకష సర్వే నిర్వహణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. నిజంగా ఎవరికి అవసరముందో వారికే రేషన్ సరకులు చేరేలా పకడ్బందీ పంపిణీ వ్యవస్థను కొలువు తీర్చాలి. ఆహార పదార్థాలకయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. మధ్యలో ఏ పందికొక్కులూ చొరబడకుండా పటిష్ఠ జాగ్రత్తలు తీసుకుంటూ యావత్ పంపిణీ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వాలు నిష్ఠగా నిభాయించాలి!
క్షామం బారిన పడకుండా
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ ప్రావిన్స్‌ను దుర్భర క్షామం హడలెత్తించింది. అప్పట్లో ధాన్యరాశులతో గోదాములు పిగిలిపోతున్నా ఆంగ్లేయుల విధానపర వైఫల్యాల పర్యవసానంగా 30 లక్షలమంది వరకు ప్రజలు అసువులు బాశారు. అటువంటి దయనీయ దురవస్థను పునరావృతం కానివ్వని పటిష్ఠ కార్యాచరణే, కోట్లాది క్షుద్బాధాపీడితుల ప్రాణాలు నిలబెట్టగలుగుతుంది!