ETV Bharat / opinion

కొవిడ్​ కోరల్లో నేతన్న.. సర్కారు చేయూత అవసరం

author img

By

Published : Jun 15, 2020, 7:19 AM IST

దేశంలో వ్యవసాయం తర్వాత అధికమంది ఆధారపడేది చేనేతమీదే. అంతగా ఉపాధి కల్పిస్తోంది ఈ రంగం. దేశవ్యాప్తంగా గతంలో ఉత్పత్తవుతోన్న వస్త్రాల్లో చేనేత రంగం వాటా 25 శాతం ఉండగా.. ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో సుమారు 90 శాతం మన దేశానివే. ఇంతటి చరిత్ర కలిగిన చేనేత పరిశ్రమకు లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై కార్మికులకు కుటుంబ పోషణ భారంగా మారి.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది.

Government need to help for Weavers from Corona crisis
కొవిడ్​ కోరల్లో నేతన్న.. సర్కారీ చేయూత అవరసరం

వ్యవసాయం తరవాత భారత్‌లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. 24లక్షల మగ్గాలు పనిచేస్తేనే 43.31లక్షల మంది జీవనం సాగుతుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్త్రాల్లో చేనేత రంగం వాటా 15శాతం. గతంలో ఇది 25శాతంగా ఉండేది. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని చేనేత వార్షిక నివేదిక-2015 చెబుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో సుమారు 90శాతం మన దేశానివే. బనారస్‌, కంచి, బెంగాలు చీరలు అంతర్జాతీయంగా ప్రసిద్ధిపొందాయి. ఉమ్మడి ఏపీలో మంగళగిరి, పోచంపల్లి, ఎమ్మిగనూరు, గద్వాల్‌, ధర్మవరం, సిరిసిల్ల, వెంకటగిరి, సిద్దిపేట, ఉప్పాడ, మాదవరం, పొందూరు వంటి ప్రాంతాలు చేనేతకు పేరొందాయి. వీటిలో పోచంపల్లి, గద్వాల చీరలకు 2008లో పేటెంట్లు దక్కాయి. పోచంపల్లి చీరలు ‘ఇక్కత్‌’, ‘డబుల్‌ ఇక్కత్‌’గా పేరొందాయి. సిద్దిపేట చీరలు ‘గొల్లభామ’ చీరలు, ఎమ్మిగనూరు పట్టుచీరలు ‘కోటకొమ్మ’ చీరలు, పొందూరు ఖాదీ చీరలు, పంచెలు ఎనలేని పేరు ప్రఖ్యాతులు పొందాయి. నేటికీ మన వస్త్రాలకు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన చేనేత పరిశ్రమకు లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై కార్మికులకు కుటుంబ పోషణ భారంగా మారింది. నేతన్నల బతుకు పోగులు తెగిపోతున్నాయి. మగ్గం మూగబోతోంది. చేయూత కోసం ప్రభుత్వాలవైపు చూస్తోంది. కులవృత్తినే నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.

పెరిగిన ఉత్పత్తి వ్యయం

వస్త్రాల తయారీలో పడుగు పేకలను పొందికగా అమర్చే నైపుణ్యం ఉన్న నేత కార్మికుల్లో అత్యధికులు బడిమెట్లు కూడా ఎక్కలేదని, 55,615 మంది పలకా బలపం పట్టలేదని, ప్రాథమిక విద్య కూడా పూర్తిచేయని వారు 21,979 మంది ఉన్నారని, 13 వేల మంది ఇంటర్‌/ డిగ్రీ లేదా ఆ పై తరగతులు చదివారని, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ కార్డులు లేనివారు కూడా వీరిలో ఉన్నారని చేనేతల స్థితిగతులపై 2019-20లో కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో తేలింది. ఇదిగాక 2014 ఎన్నికల ముందు నాటి ప్రభుత్వం నిర్వహించిన సర్వే- దేశవ్యాప్తంగా నేతన్నల రుణభారం మొత్తం రూ.3,000 కోట్లుగా పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, తగ్గుతున్న గిరాకీ, పోటీదారులైన మరమగ్గాలకు, మిల్లులకు కల్పిస్తున్న రాయితీలు వంటివి ఈ రంగానికి పెద్ద సమస్యలుగా పరిణమించాయి. చేనేతకు ముడి సరకులైన చిలపల నూలు, జరీ, సిల్కు, రంగుల ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరగడంతో వస్త్ర ఉత్పత్తి వ్యయమూ విపరీతంగా పెరిగిపోయింది. కూలీల వ్యయమూ భారీస్థాయిలో పెరిగింది. ఉత్పత్తి వ్యయంతోపాటు అమ్మకపు ధర కూడా పైకెగబాకింది. వినియోగదారులు అందంగా కనిపించే, తక్కువ ధరలకే లభ్యమయ్యే మరమగ్గాలు, మిల్లు వస్త్రాలవైపే మొగ్గు చూపుతున్నారు.

కరోనా మూలంగానే..

ఈ రంగంపై ఆధారపడి బతుకీడుస్తున్న మాస్ట్టర్‌ వీవర్లు, మగ్గం యజమానులు, దినసరి కూలీలు, సొసైటీల సిబ్బంది, ఉప వృత్తుల వ్యాపారులు, చిల్లర వర్తకులు, వారి సిబ్బంది వంటి వారందరి బతుకులు కరోనా మూలంగా కల్లోలంగా మారాయి. పనుల్లేక అందరి జీవితాల్లో కారుమబ్బులు కమ్ముకున్నాయి. సాధారణ రోజుల్లోనే చేనేతకు చెప్పలేని కష్టాలు. చాలీచాలని ఆదాయం, కుటుంబమంతా ఒక మగ్గంతో పనిచేస్తే రోజుకు దక్కేది కేవలం రూ.300 మాత్రమే. అంతంతమాత్రంగా ఉన్న ఆ ఆదాయాన్ని కూడా కరోనా మింగేసింది. రెండు నెలలుగా వీరంతా పనుల్లేక ఇళ్లకే పరిమితమయ్యారు. చేనేతకు పెద్ద దిక్కయిన సొసైటీల వద్ద నుంచి వస్త్రాలు సేకరిస్తున్న రాష్ట్ర, కేంద్రస్థాయి విక్రయశాలలు మూతపడ్డాయి. ఫలితంగా రూ.లక్షలు విలువ చేసే వస్త్రాలు సొసైటీల వద్ద, విక్రయశాలల వద్ద పేరుకుపోయాయి. ఈ వస్త్రాలు అమ్మితేగాని, ఈ విక్రయశాలలుగాని, మాస్టర్‌ వీవర్లుగాని కొత్త వస్త్రాల ఆర్డర్లు బుక్‌ చేయరు. లాక్‌డౌన్‌ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించడంతో ముడిసరుకులు అందక పనులన్నీ స్తంభించాయి.

నేతల మాటలు నీటి మూటలు

లాక్‌డౌన్‌ కారణంగా శుభకార్యాలు వాయిదాపడటం వల్ల చేనేత వస్త్రాల అమ్మకాలకు గండి పడింది. ప్రభుత్వాల సాయం కొన్ని కారణాల వల్ల చాలామంది నేతన్నలకు అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం సగం వస్త్రాలైనా ప్రభుత్వాలు కొనాలని సొసైటీలు కోరుతున్నాయి. చేనేత పరిశ్రమను దయనీయ దుస్థితి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపైనా ఉంది. వారంలో ఒక్కరోజైనా అందరూ చేనేత దుస్తులు ధరించాలన్న నేతల మాటలు నీటి మూటలుగా మారాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రంగం బతికి బట్టకట్టాలంటే ప్రజల్లో చేనేతకు ఆదరణ కలిగేలా చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి. చేనేత ఉపవృత్తులు ఆధారంగా జీవిస్తున్న మగ్గంలేని కార్మికులనూ ఆదుకోవడం అవసరం. కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలలో ‘సంక్షేమ కమిటీ’ని ఏర్పాటు చేయాల్సి ఉంది. తమిళనాడు, తెలంగాణ తరహాలో పండగల వేళ పేదలకు చేనేత వస్త్రాల ఉచిత పంపిణీని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి.

- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు, రచయిత- ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాణిజ్య విభాగం ఆచార్యులు

ఇదీ చదవండి: పెద్దల సభకు వెళ్లే ఆ 18 మంది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.