ప్రజల ఆహార అలవాట్లలో కరోనా వైరస్ పెనుమార్పులు తీసుకురానుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై వైరస్‌లు ఎక్కువగా విరుచుకుపడతాయన్న భయాల నేపథ్యంలో- ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల శ్రద్ధ పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు శరీరానికి శక్తిని అందించే పండ్ల వినియోగం మాత్రం తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పండ్లు పండించిన రైతులకు లాభసాటి ధరలు కూడా దక్కడం లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి పెట్టి అత్యధిక పోషకాలను అందించే పంటల సాగుకు విస్తృతంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. వ్యాపారులను కట్టడి చేయడంతో పాటు- సరైన వ్యూహాలతోనే రైతుకు మేలు చేయగలుగుతామని పాలకులు గుర్తించాలి.
ఆధునిక అలవాట్లతో తంటా..
కరోనా వంటి వైరస్‌లు మన దరి చేరకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారంతో మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. ఏం తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందనే ఆసక్తి, అవగాహన నెల రోజులుగా ప్రజల్లో పెరిగింది. పండ్లు, కూరగాయలతో పాటు పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకు కూరలను నిత్య ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్-సి ఇచ్చే నిమ్మజాతి పండ్ల వినియోగం బాగా పెరగాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తున్నా వాటిని పండిస్తున్న రైతులకు మంచి ధరలు అందించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది. కొన్నేళ్లుగా ప్రజల ఆహార అలవాట్లు చాలావరకు గాడి తప్పాయి. శరీరానికి ఏమివ్వాలో అది ఇవ్వకుండా- కడుపు నిండితే చాలనే ధోరణి అనర్థాలకు కారణమవుతోంది. సంప్రదాయ ఆహారపు అలవాట్లను వదిలేయడం, ఆధునికత తెచ్చిన మార్పులతో 'పిజ్జా సంస్కృతి' పెచ్చుమీరింది. ఫలితంగా దేశంలో ఊబకాయులు, మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోంది.
డెంగీ, చికున్‌గన్యా, స్వైన్‌ఫ్లూ, సార్స్, ఎబోలా తాజాగా కరోనా వంటి వైరస్‌లు ఒక ఉపద్రవంగా ముంచుకొస్తుంటే తట్టుకునే శక్తి లేకప్రజలు అల్లాడిపోతున్నారు. వాటి వ్యాప్తికి అనుకూలమైన కాలం (సీజన్) వచ్చినప్పుడు అవి విజృంభిస్తున్నాయి. ఆ సమయాల్లో 'ఈ గండం గడిచేదెలా' అనే ఆందోళనతో ప్రజలు బిక్కచచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తున్నా సమాజంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెరగడం లేదు. సమస్య వచ్చినప్పుడు స్పందించడం కంటే ముందు జాగ్రత్తలతో రోగాల వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, వ్యక్తిగతంగా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలనే స్పృహ ప్రజల్లో కలగాలి. సమస్య రాకముందే మన శరీరాన్ని సిద్ధం చేయడం అనేది మన సంస్కృతిలోనే ఉంది. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేసినప్పుడే రోగనిరోధకశక్తి ప్రభావశీలంగా ఉంటుంది. అప్పుడే ఎలాంటి వైరస్‌లూ దాడి చేయలేవు. కాబట్టి, శరీరానికి ఏమేం అవసరమో అవన్నీ తినాలి. వయసుతో పాటు క్షీణించే రోగనిరోధక శక్తిని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా పెంచుకోవచ్చు. అందుకోసం ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకుంటూ మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. పూర్వీకులు అనుసరించిన విధానాల్నీ చాలావరకు విస్మరిస్తున్నారు. దీనివల్ల రోగాలకు తేలికగా చిక్కే పరిస్థితి వస్తోంది.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
అపరాలు, వరి, చిరుధాన్యాల కలబోతతో పూర్వం బలవర్ధకమైన ఆహారం తినేవారు. ఇప్పుడు సమతులాహారం తీసుకోలేకపోతుండటంతో త్వరగా నీరసించి రోగనిరోధక శక్తి తగ్గి, వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం భారతీయులు సంపాదిస్తున్న మొత్తం ఆదాయంలో సగానికి పైగా వైద్యం కోసం ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ తరుణంలో కరోనా వంటి వైరస్‌ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కరోనా భయాలు ప్రజల్లో కొత్త అలవాట్లకు తెరతీశాయి. ఎటువంటి ఆహారంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్న వెతుకులాట అంతర్జాలంలో రెట్టింపైంది. తాజా పండ్లు, కూరగాయలు, పాలు, మాంసాన్ని ఆహారంలో బాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పాలకులు చెబుతుంటే వెంటనే ఆచరించే దిశగా అడుగులు పడ్డాయి. వినియోగానికి గిరాకీ ఉన్నా- రైతులకు మాత్రం అమ్మితే గిట్టుబాటు ధర రావడంలేదు. నిమ్మ, బత్తాయి, కమలా పండ్ల లభ్యత అధికంగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఒక్క పండూ వృథా కాకుండా రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రజలు విరివిగా వినియోగించేలా చేస్తే- అటు పండించే రైతులకు లాభసాటి ధరలు అందుతాయి. ఇటు ప్రజల ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. లాక్‌డౌన్ కాలంలో పేదలకు అందించే ఆహార సరఫరా ఎలా ఉండాలనే అంశంపై యంత్రాంగం స్పష్టంగా పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. పాలతో పాటు రోగనిరోధక శక్తినిచ్చే పండ్లు, క్యారెట్, చిక్కుడు వంటి కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలను సైతం కలిపి ఒక కిట్‌లా అందిస్తే ఉపయోగం ఉంటుంది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రైతులూ బాగుండేలా పటిష్ఠ కార్యాచరణను అమలు చేయడం అత్యంత ప్రాధాన్యాంశం.
వినియోగం అత్యల్పం..
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్‌ది- చైనా తరవాతి (రెండో) స్థానం. నిమ్మజాతి పండ్ల ఉత్పత్తిలో ఆరో స్థానం. దేశంలో పండే పండ్లలో నిమ్మజాతివి- అరటి, మామిడి తరవాత 12.5 శాతంతో మూడో స్థానం ఆక్రమిస్తున్నాయి. ఈ పండ్ల ఉత్పత్తి తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అరటి, మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, జామ సహా ప్రధానంగా పది రకాల పండ్లను పండిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో స్థానికంగా పండించే పండ్ల కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పండ్లను ప్రజలు అధికంగా వినియోగిస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. మనం పండిస్తున్న మొత్తం పండ్లలో ప్రజలు తీసుకుంటున్న శాతం రెండు శాతం లోపే ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది ఆందోళన కలిగించే అంశమే. ప్రతి వ్యక్తీ నిత్యం వంద గ్రాముల పండ్లు తినాల్సి ఉండగా 30 గ్రాములైనా తీసుకోనివారి శాతం సగం కంటే అధికంగా ఉండటం కలవరపెడుతోంది. మనకు రోగనిరోధకశక్తిని ఇచ్చే పండ్లను 98శాతం ఎగుమతి చేస్తూ, ఇతర పండ్లను దిగుమతి చేసుకోవడం అవగాహన లోపంతోనే జరుగుతోంది. ఈ దిశగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు యంత్రాంగం నడుం బిగించాలి. ఇక్కడ పండించే రోగనిరోధకశక్తిని పెంచే పండ్లను స్థానికంగా వినియోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో అవి పండించే రైతులకు మంచి ధరలు అందించడం అంతే కీలకం.
- అమిర్నేని హరికృష్ణ