నిధులు, విధులు, అధికారాలు- ప్రజాస్వామ్యంలో ఏ అంచె పాలన వ్యవస్థకైనా ప్రాణవాయువులు. ఆ మూడింటినీ బిగపట్టి ఏడు దశాబ్దాలకుపైగా దేశవ్యాప్తంగా పునాది స్థాయి స్థానిక స్వపరిపాలన స్ఫూర్తిని నేతాగణాలు ఎంతగా భ్రష్టుపట్టించాయో అందరికీ తెలుసు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన విధులున్నా తగినన్ని నిధులు లేక, కేంద్రాన్ని అర్థించడం వినా గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రాలు సైతం పెద్ద సైజు మున్సిపాలిటీలుగా బిక్కమొగమేయడాన్ని చూస్తూనే ఉన్నాం. చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలది మరింత దయనీయావస్థ. విధులు నిజం- నిధులు, అధికారాలు మిథ్యగా వాటి వేదన వర్ణనాతీతం. దుర్నిరీక్ష్యమైన విచక్షణాధికారాలతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను మరింతగా బలోపేతం చేసి, ఎన్నికైన సర్కార్లకు రాజకీయంగా సున్నంకొట్టే క్రతువు నిర్నిరోధంగా సాగుతూనే ఉంది. ఎన్నికైన ప్రభుత్వం చొరవకు అడుగడుగునా 'బేడీ'లతో దక్షిణాదిన పుదుచ్చేరిలో వివాదాల కచేరి శ్రుతి మించుతుంటే, దేశ రాజధాని దిల్లీపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మరింత గట్టిగా బిగపట్టే కార్యాచరణ చట్ట సవరణ రూపంలో పట్టాలకెక్కనుంది. ఆ వైనం చిత్తగించండి!
రాజకీయ భూకంపం..
మిడిసిపాటు మొదటికే చేటు! పొంచిఉన్న భూకంపాల ముప్పు తీవ్రతపరంగా దేశాన్ని అయిదు జోన్లుగా విభజిస్తే- దేశ రాజధాని నాలుగో జోన్ (తీవ్ర భూకంప ప్రమాదం)లో ఉంది. దిల్లీలో ఆప్ సర్కారు పాగా వేసింది మొదలు రాజకీయ భూకంపాల తీవ్రత అక్కడ అయిదో జోన్ పరిధిని మించిపోతోంది. 2014 ఫిబ్రవరిలో లోకాయుక్త బిల్లు ఒడిశా అసెంబ్లీ ఆమోదం పొంది గవర్నర్ సమ్మతికి వెళ్లిన రోజునే- దిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడమే దుర్లభమై అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నిష్క్రమించాల్సి వచ్చింది. తొలి ఏలుబడి అలా ఏడువారాల్లోనే ముగిసిపోగా 2015 ఎన్నికల్లో 'ఆప్' 70 అసెంబ్లీ స్థానాలకు 67 గెలిచి అధికారం చేపట్టినా- మూడు నెలలు తిరిగే సరికల్లా కేంద్రంతో మరో యుద్ధం మొదలైంది. అధికారుల నియామకాలు, బదిలీలతో పాటు అవినీతి నిరోధక విభాగాన్నీ కేజ్రీ సర్కారు పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో విభేదాల అగ్గి భగ్గుమంది.
అన్నిటికీ ఎల్జీనే..
కీలక పరిపాలన అంశాలపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పరిపూర్ణ అధికారాలు కట్టబెడుతూ చేసిన నిర్ణయంపై దిల్లీ హైకోర్టు కేంద్ర సర్కారు వైఖరే సరైనదని న్యాయనిర్ణయం చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి ఎల్‌జీయే పాలనాధికారి అన్న ఉన్నత న్యాయస్థానం- మంత్రిమండలి సలహాను ఆయన పాటించాల్సిన అవసరం లేదు పొమ్మంది. దానిపై అప్పీలును పరిష్కరిస్తూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2018లో ఇచ్చిన తీర్పు ఎవరి పరిమితులేమిటో స్పష్టీకరించింది. దిల్లీ ప్రభుత్వ అధికార పరిధి నుంచి రాజ్యాంగం మినహాయించిన భూమి, పోలీసు, శాంతిభద్రతలు తప్ప, తక్కిన అన్ని అంశాలపైనా మంత్రిమండలి సలహా మేరకే ఎల్‌జీ నడుచుకోవాలని, ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంలోనూ ఎల్‌జీ జోక్యం చేసుకోరాదని లక్ష్మణ రేఖలు గీసింది. ఆ తీర్పు స్ఫూర్తికి కట్టుబడితే అసలు గొడవే లేకపోను. అంతా రాజ్యాంగ బద్ధంగా సాగిపోతే- స్వీయ రాజకీయ ప్రయోజనాల గతేంకాను?
రాజకీయం అంటే ఇదేమరి..
'సమస్య కోసం దేవులాడటం, అన్ని చోట్లా అదే కనిపిస్తోందనడం, దాని మూలకారణాల్ని తప్పుల తడకగా నిర్ధారించడం, నిరర్థక పరిష్కారాన్ని అమలు చేయడం- ఈ కళ పేరు రాజకీయం' అని ఎర్నెస్ట్ బెన్ అనే బ్రిటిష్ ప్రచురణ కర్త కొన్ని దశాబ్దాల క్రితమే సూత్రీకరించారు. నిరుడు మళ్లీ అసెంబ్లీలో 62 సీట్లు గెలిచి పాలనాధికారం చేపట్టిన ఆప్ సర్కారు మెడలు వంచడానికి- బెన్ సూత్రీకరణ మేరకు సంకుచిత రాజకీయ కళాకౌశల ప్రదర్శనకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా పూర్వరంగాన్ని మోదీ ప్రభుత్వం సిద్ధం చేసిందిప్పుడు! రాజ్యాంగం మేరకు- మంత్రిమండలి నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయం తనకు ఉంటే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు 'ఎల్‌జీ' పంపించాలి.
దిల్లీపై పెత్తనమే అజెండా..
రాష్ట్రపతి చెంత ఆ దస్త్రం పెండింగులో ఉన్నప్పుడు అత్యవసరమైతే ఎల్‌జీయే తన నిర్ణయం ప్రకటించగల వీలుంది. రోజువారీ పాలన వ్యవహారాల్లో ప్రతి అంశం మీద ఎల్‌జీ అనుమతి పొందాల్సిన అవసరం లేదని 'సుప్రీం' న్యాయపాలిక స్పష్టీకరించడంతో- ఆ రాజ్యాంగ నిబంధన ప్రభావశూన్యమై పోయింది. దానికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసేలా- దిల్లీ ప్రభుత్వం శాసన ప్రతిపాదనల్ని పక్షం రోజులు ముందుగా, పాలనాపరమైన వాటిని వారం రోజులు ముందుగా ఎల్‌జీకి పంపించాలంటూ, అలా అయితే జాప్యం కాకుండా ఎల్‌జీ అభిప్రాయం పొందగల వీలుందని తాజా చట్టసవరణ నిర్దేశిస్తోంది. సుప్రీంకోర్టు చెప్పింది అది కాదే! దేశ రాజధానిపై పైయెత్తున పెత్తనం తనదే కావాలన్న సంకుచిత రాజకీయం కోరచాస్తే దిల్లీలో రాజుకొనేది వివాదాల అగ్ని గుండమే!
వ్యతిరేకించిన నెహ్రూ..
బ్రిటిష్ జమానాలో ఇండియాకు రాజధానిగా ఉన్న కలకత్తాపై సంపూర్ణ పెత్తనం కోసం స్థానిక ప్రభుత్వానికి, నాటి వైస్రాయి లార్డ్ చార్లెస్ హార్డింగ్‌కు మధ్య ఇప్పటి మాదిరే తీవ్ర ఘర్షణ జరిగింది. ఇక లాభం లేదనుకొని 1912లో రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చడానికీ ఆ రగడే ప్రధాన హేతువైందని 1955 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘమే వెల్లడించింది. శాసనసభతో పాటు పరిమిత స్వయంప్రతిపత్తి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఉండేలా దిల్లీ పాలన వ్యవస్థను తీర్చి దిద్దాలని పట్టాభి సీతారామయ్య కమిటీ మొదట ప్రతిపాదించింది. ఆ తరహా ఏర్పాటు ఎంత సంఘర్షణాత్మకంగా పరిణమిస్తుందో కోల్‌కతా అనుభవంతో తెలుసుకొన్న నెహ్రూ, అంబేడ్కర్‌లు దాన్ని తోసిపుచ్చారు. 1987లో ఎస్.బాలకృష్ణన్ కమిటీ మూడు ప్రత్యామ్నాయాల్ని సూచిస్తే- అసెంబ్లీతో కూడిన పాక్షిక రాష్ట్ర ప్రతిపత్తికి ఆమోదం దక్కింది. 1991 నాటి చట్టం, 1993 నాటి నిబంధనలు దిల్లీ పాలన వ్యవహారాల సరళిని నిర్దేశిస్తున్నా- రాజధానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం 2014 దాకా గొంతెత్తిన కమలం పార్టీ దరిమిలా ఆ ఊసే ఎత్తడం మానేసింది. పూర్తి రాష్ట్ర హోదా కోసం ఎలుగెత్తుతున్న 'ఆప్'- ఉన్నదైనా మిగిలితే చాలనుకొనేలా నయా రాజకీయ సమరం సాగుతోంది!
అప్పుడలా.. ఇప్పుడిలా..
న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిని మినహాయించి తక్కిన ప్రాంతానికంతా పూర్తిస్థాయి ప్రతిపత్తి ఇవ్వాలంటూ 1998లో భాజపా ప్రభుత్వమే దిల్లీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదాను సిద్ధం చేసింది. నేడదే పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతూ, దిల్లీలో కేజ్రీ ప్రభుత్వం పరిమిత చట్రంలోనైనా ఊపిరి పీల్చుకొనే అవకాశం లేకుండా కొత్త నిబంధనలకు సానపెడుతోంది. అసలు రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య భావనలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత స్వాతంత్య్రం ఉందని దిల్లీ ప్రభుత్వ వ్యాజ్య విచారణలోనే న్యాయపాలిక స్పష్టీకరించింది. కానీ, రాజ్యాంగానికే రాజకీయ గ్రహణం పట్టిస్తే సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా వట్టిపోతుంది. ఎన్నికల్లో జయాపజయాలు జనాధీనమైన ప్రజాస్వామ్యంలో- మిడిసిపాటు మొదటికే చేటు తెస్తుంది. రాజ్యాంగ సంవిధానాన్ని కాలదన్ని వ్యవస్థల్ని నీరుగారిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని పాలకులు గ్రహించాలి! ఏమంటారు?
- పర్వతం మూర్తి
ఇవీ చదవండి: బలిపీఠంపై భావస్వేచ్ఛ!