ఫ్రాన్స్‌లో వ్యంగ్య చిత్రాలు మత భేదాలను రెచ్చగొట్టి దేశాల మధ్య చిచ్చుకు దారితీస్తున్నాయి. అక్టోబరులో ఒక ఉపాధ్యాయుడు లౌకికత్వం గురించీ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి బోధిస్తూ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను విద్యార్థులకు చూపడం ఆయన ప్రాణాలు తీసింది. ఉపాధ్యాయుడు ప్రవక్తను కించపరుస్తున్నారని ఆగ్రహించిన ఓ 18 ఏళ్ల చెచెన్ విద్యార్థి ఆ టీచర్ తల నరికారు. అంతకు కొన్ని రోజుల ముందు ఒక పాకిస్థానీ చార్లీ హెబ్డో పాత కార్యాలయం వద్ద ఇద్దరిని కత్తితో పొడిచారు. ఫ్రాన్స్‌లోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి మతప్రేరిత దాడులు జరిగాయి. ఈ దురంతాలు ఫ్రాన్స్‌కు శిరోధార్యమైన గణతంత్ర, లౌకిక విలువల మీద దాడి అని దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీవ్రంగా ఖండించారు. దాడులకు భయపడి కార్టూన్లను వదులుకొనేది లేదని స్పష్టం చేశారు.
మార్పుకోసం కొత్త చట్టం...
ఇస్లాం వేర్పాటువాదంపై పోరు, లౌకికత్వ సంరక్షణలకు వచ్చే డిసెంబరులో సరికొత్త చట్టం తీసుకొస్తానని మేక్రాన్ ప్రకటించారు. మతాల స్థానంలో లౌకికవాదానికి పట్టం కడుతూ ఫ్రాన్స్ 1905లో తీసుకొచ్చిన ఒక కీలక చట్టాన్ని డిసెంబరులో వచ్చే కొత్త చట్టం మరింత పటిష్ఠం చేస్తుంది. పాత చట్టం పౌరులకు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇస్తూనే, మతానికీ ఫ్రెంచి రాజ్య వ్యవస్థకు స్పష్టమైన విభజన రేఖ గీసింది. ఈ లౌకికవాద చట్టానికి ఫ్రాన్స్‌లో అన్ని పార్టీలు, ప్రజలు బద్ధులై ఉంటారు. రానురాను ముస్లిముల వలసలు పెరగడంతో 1905నాటి లౌకిక చట్టాన్ని ప్రభుత్వం మరింత పకడ్బందీగా అమలు చేయసాగింది. 2004లో ముస్లిం మహిళలు తలమీద కప్పుకొనే వస్త్రాలను నిషేధించింది. పాఠశాలల్లో మత చిహ్నాలు కనబడకూడదని ఆదేశించింది. 2011లో వచ్చిన చట్టం బురఖాలను నిషేధించింది. ఇదంతా ఫ్రాన్స్‌లో దుర్విచక్షణకు గురవుతున్నామని ముస్లిములు భావించడానికి ఆస్కారం కల్పించింది. అయితే ఫ్రాన్స్‌లో లౌకికవాదం నోటిమాటగా కాకుండా తు.చ. తప్పకుండా అమలవడమే ఈ అపోహకు కారణం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి లౌకిక వ్యవస్థపై ఇస్లాం ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయంటే కారణమిదే.
ఫ్రాన్స్‌లోని ఇస్లాం మతానుయాయులపై విదేశీ (జిహాదీ) దుష్ప్రభావాలు పెరగడం ఇలాంటి అవాంఛనీయ దాడులకు కారణమని అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. డిసెంబరులో వచ్చే కొత్త చట్టం ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని సాగనివ్వబోదన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచమంతటా ఇస్లాం మతం సంక్షోభంలో పడిందని వ్యాఖ్యానించడాన్ని టర్కీ, పాకిస్థాన్ దేశాలు ఖండించాయి. ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని సూపర్ మార్కెట్లు ఫ్రెంచి వస్తువుల బహిష్కరణను చేపట్టాయి.
ఐరోపా దేశాలన్నింటిలోకీ ఫ్రాన్స్‌లోనే ముస్లింలు ఎక్కువ. 6.7 కోట్ల ఫ్రాన్స్ జనాభాలో ముస్లింల సంఖ్య 50 లక్షలు. ఫ్రెంచి ముస్లిములలో అత్యధికులు అల్జీరియా, ట్యునీసియా, మొరాకో వంటి పూర్వ ఫ్రెంచి వలస దేశాల నుంచి వచ్చినవారే. అల్జీరియాలో 132 ఏళ్ల ఫ్రెంచి వలస పాలనలో 50 లక్షల మంది ముస్లిములు హతమయ్యారని అంచనా. ఇలాంటి చేదు అనుభవాలకుతోడు మతానికి తావు ఇవ్వని ఫ్రెంచి లౌకికవాదం, కరోనా వల్ల విజృంభించిన నిరుద్యోగం ఫ్రాన్స్ ముస్లిం సమాజంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.
వలస పాలనతో అనర్థాలు
వలస యుగం అంతరించాక ఫ్రాన్స్‌లోని ఫ్యాక్టరీలలో తక్కువ వేతనాలకు పనిచేయడానికి అల్జీరియా, టర్కీ, మొరాకో, ట్యునీసియా తదితర దేశాల నుంచి ముస్లిములు తరలి వచ్చారు. పారిశ్రామిక యుగం ముగిసి హైటెక్ విజ్ఞానాధారిత సమాజం అవతరించాక ఉద్యోగావకాశాలు అడుగంటాయి. ఫ్రెంచి ముస్లిములలో నిరుద్యోగం 15 శాతం వరకు ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఫ్రెంచి ప్రభుత్వం తన పౌరులకు బడ్జెట్ ఇళ్లు నిర్మించింది. యుద్ధానంతరం ఆర్థికాభివృద్ధి పుంజుకోవడంతో ఫ్రెంచి పౌరులు ఈ ఇళ్లను ఖాళీచేసి, మెరుగైన గృహాల్లోకి మారిపోయారు. ఆ బడ్జెట్ ఇళ్ల సముదాయాలు వలస వచ్చిన ముస్లిం కార్మికులకు ఆవాసాలుగా మారాయి.
కాలక్రమంలో ఈ కాలనీలు ఫ్రెంచి సమాజానికి దూరంగా మురికివాడలుగా తయారవడమే కాదు, అక్కడ నేరాలూ ఎక్కువయ్యాయి. నేడు ఫ్రాన్స్ జైళ్లలోని ఖైదీలలో సగంమంది ముస్లిములేనంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్ఛు. అయితే, ఆర్థిక అభద్రత అనేది ఒక్క ముస్లిములకే పరిమితం కాలేదు. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత శ్వేతజాతివారిలోనూ తీవ్ర అభద్రతాభావం నెలకొన్నది. ప్రపంచీకరణ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి లబ్ధి పొందేవారి సంఖ్య పరిమితంగా ఉంటోంది. కొవిడ్ తరవాత అందరి ఆర్థిక స్థితి దిగజారిపోయింది.
కొవిడ్ వ్యాప్తిని ఆరంభంలోనే అడ్డుకోవడంలో అధ్యక్షుడు మేక్రాన్ విఫలమయ్యారనే భావన ప్రజల్లో నెలకొంది. ఇలాంటి వాతావరణంలో గోరుచుట్టుపై రోకటి పోటులా ఇస్లామిక్ ఉగ్ర దాడులు జరిగాయి. ఇదంతా ఫ్రాన్స్‌లోని అతి మితవాద, జాత్యహంకార వర్గాలు రాజకీయంగా పుంజుకోవడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తోంది. మతవాదులు ఎంత రెచ్చగొట్టినా లౌకికత్వాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను విడనాడేది లేదనీ, ఫ్రాన్స్ శిరోధార్యంగా భావించే విలువలకు అనుగుణంగా ఇస్లాం మతానుయాయులు నడచుకోవాలని మేక్రోన్ ఇచ్చిన పిలుపును ప్రపంచమంతటా ప్రజాస్వామ్యవాదులు సమర్థిస్తున్నారు.