నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి దేశంలో అప్రకటిత ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) నడుస్తోందని ఆయన ప్రత్యర్థులు తరచూ విమర్శలు గుప్పిస్తారు. కానీ.. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో అష్టకష్టాలు అనుభవించినవారికి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారికి ఈ పోలిక ఎంతో కుత్సితంగా, అవమానకరంగా తోస్తుంది. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఆత్యయిక స్థితి 21 నెలలపాటు కొనసాగింది. ఆ రోజులకు, ఇప్పటి మోదీ జమానాకు ముడిపెట్టడం దారుణం. అది ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని ఎదిరించి, మన రాజ్యాంగాన్ని, ప్రజాతంత్ర జీవనాన్ని పునరుద్ధరించడానికి సాహసోపేతంగా పోరాడిన లక్షలాది స్త్రీపురుషుల త్యాగాలను కించపరచడమే అవుతుంది. వీరి పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర ఉద్యమంగా వర్ణిస్తున్నారు.
స్వేచ్ఛకు సంకెళ్లు..
ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సర్కారు ఎన్నో అకృత్యాలకు పాల్పడింది. వాటిలో అత్యంత దుర్మార్గమైనది సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన హెబియస్ కార్పస్ కేసు. ఇందిర నాయకత్వంలో నడుస్తున్నది నిరంకుశ ప్రభుత్వం కాదు, ఏకంగా ఫాసిస్టు ప్రభుత్వమని ఆ కేసు తేల్చిచెప్పింది. 1976లో సుప్రీం ముందుకు వచ్చిన ఆ కేసును కోర్టు పరిభాషలో ఏడీఎం, జబల్ పూర్ వెర్సస్ శివకాంత్ శుక్లా కేసుగా పరిగణిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.ఎన్.రే, జడ్జీలు హెచ్.ఆర్.ఖన్నా, హెచ్.ఎం.బేగ్, వై.వి.చంద్రచూడ్, పీఎన్ భగవతిలతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం దాన్ని విచారించింది. రాష్ట్రపతి జారీ చేసిన అత్యంత వివాదాస్పద ఉత్తర్వుకు సంబంధించిన కేసు అది.
ఇదీ చదవండి: 'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'
నైదర్ రోజెస్ నార్ థార్న్స్..
రాజ్యాంగంలోని 14వ అధికరణ పౌరులంతా చట్టం ముందు సమానులని ఉద్ఘాటిస్తోంది. 21వ అధికరణ పౌరులకు ప్రాణాలను కాపాడుకునే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉన్నాయని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వు ఈ రెండు అధికరణలను సస్పెండ్ చేసింది. దీన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) కింద అరెస్టయినవారు వ్యతిరేకించారు. తమ హెబియస్ కార్పస్ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించాలని కోరారు. అయితే భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ నిరేన్ డే, ఎమర్జెన్సీ అమలులో ఉన్నంతకాలం ఏ పౌరుడూ 14, 21 రాజ్యాంగ అధికరణల కింద రక్షణ కోసం సుప్రీంకోర్టు గుమ్మం తొక్కరాదని వాదించారు. అటార్నీ జనరల్ వాదన ప్రజాస్వామ్యవాదులందరినీ నిర్ఘాంతపరచినా, అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో ఒక్క జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా మినహా మిగిలిన న్యాయమూర్తులెవరూ అన్యాయానికి వ్యతిరేకంగా పెదవి విప్పలేదు. ఆ ఘటనను జస్టిస్ ఖన్నా తన ఆత్మకథ 'నైదర్ రోజెస్ నార్ థార్న్స్'లో గుర్తు చేసుకున్నారు. జస్టిస్ ఖన్నా మాత్రం అటార్నీ జనరల్‌ను నిలదీశారు. ఒక పోలీసు అధికారి తనకు గిట్టని వ్యక్తినెవరినైనా కాల్చి చంపితే,హతుడి సంబంధీకులు కోర్టును ఆశ్రయించకూడదా అని అటార్నీ జనరల్ నిరేన్ డేని ప్రశ్నించారు. దానికి నిరేన్ 'అవును.. ఎమర్జెన్సీ అమలులో ఉన్నంతకాలం కోర్టు రక్షణ కోరకూడదు' అని తెగేసి చెప్పారు. ఇలాంటి కేసుల్లో న్యాయపరమైన పరిష్కారమే ఉండదన్నారు. ఇది మీ అంతరాత్మను, నా అంతరాత్మను కదిలించవచ్చు కానీ, తన వాదన మాత్రం మారదని ఖండితంగా చెప్పారు.
ఇదీ చదవండి: కశ్మీర్-దిల్లీ దూరానికి ముగింపు పలకాలి: మోదీ
తీవ్ర దుష్ప్రరిణామాలు..
తన వాదనను తన అంతరాత్మే అంగీకరించడం లేదని అటార్నీ జనరల్ నిరేన్ డే ఒప్పుకొన్నా, జస్టిస్ ఖన్నా తోటి న్యాయమూర్తుల అంతరాత్మల్లో మాత్రం ఎలాంటి చలనమూ లేదు. పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛకు పూచీ ఇచ్చే హక్కులను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రధాన న్యాయమూర్తి రే తో పాటు జస్టిస్ బేగ్, జస్టిస్ చంద్రచూడ్ నిర్ధారించారు. జస్టిస్ బేగ్ అంతటితో ఆగకుండా మీసా నిర్బంధితుల పుండు మీద కారం రాసే వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం మీసా నిర్భంధితులకు అన్నపానాలను అందిస్తూ, మర్యాదగా వ్యవహరిస్తూ కన్నతల్లిలా చూసుకొంటోందని బేగ్ అన్నారు. ఖన్నా ప్రజాస్వామ్యం కోసం నిలబడినందుకు లభించిన బహుమానం- సుప్రీంకోర్టు పదోన్నతులలో ఆయనకు అన్యాయం జరగడం. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరిలోకీ ఖన్నాయే అత్యంత సీనియర్ అయినా, ఇందిర ప్రభుత్వం ఖన్నాను కాదని జస్టిస్ ఎం.హెచ్.బేగ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఈ చర్యకు నిరసనగా ఖన్నా రాజీనామా చేశారు.
హెబియస్ కార్పస్ కేసులో ప్రభుత్వ అభీష్టానికి అనుగుణంగా నడుచుకున్న చంద్రచూడ్, భగవతి తరవాత సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. నిరేన్ డే భార్య విదేశీయురాలు. తాను కనుక ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తే ఇందిర ప్రభుత్వం తనను వేధింపులకు గురిచేస్తుందని నిరేన్ భయపడ్డారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు, స్వేచ్ఛకు సుప్రీంకోర్టు రక్షణ లేకున్నా, వారు వెనకడుగు వేయలేదు. వారి త్యాగాలను విస్మరించి ఎమర్జెన్సీ దుష్పరిణామాలను తక్కువచేసి చూపడం మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరచడమవుతుంది. అలాంటి ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటించాలి.
రచయిత- ఎన్.సూర్యప్రకాశ్, ప్రసార భారతి మాజీ ఛైర్మన్
ఇవీ చదవండి: