తెగటారిన ఉపాధి అవకాశాలు, ఛిద్రమైన అసంఖ్యాక జీవితాలు, పెను నైరాశ్యంలో కూరుకుపోయిన భిన్నరంగాలు.. ఎక్కడికక్కడ కొవిడ్ మహాసంక్షోభ దారుణ దుష్పరిణామాల్ని కళ్లకు కడుతున్నాయి. కకావికలమైపోయిన వలసకూలీల స్థితిగతుల విచారణకు ఉద్దేశించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఎదుట న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజా వ్యాఖ్యలు మనిషన్నవారినెవరినైనా కదిలిస్తాయి.
పేదరికంలోకి 24కోట్ల మంది
రిక్షా కార్మికులు, చిరువ్యాపారులు, అసంఘటిత రంగ శ్రామికులెందరో మలమల మాడిపోతున్న దయనీయ దృశ్యం దుర్భరమైనది. నిరుటితో పోలిస్తే, తిండీతిప్పలూ కరవై ఆకలిమంటల్లో కమిలిపోతున్న అసంఘటిత రంగ శ్రామికుల సంఖ్య ఇంతలంతలై మానవ మహా విషాదాన్ని ఆవిష్కరిస్తోందన్నది చేదునిజం. కొవిడ్ మలిదఫా విజృంభణలో వృత్తి ఉపాధులు కోల్పోయి కొత్తగా 24కోట్ల మంది వరకు దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారన్నది గుండెల్ని మెలిపెట్టే యథార్థం. ఇటువంటప్పుడు కోట్లాది వలస కార్మికులు దేశంలో ఎక్కడ చిక్కుకుపోయినా వివిధ పథకాల ప్రయోజనాలు దక్కేలా వారందరి విస్తృత సమాచార నిధికై 2018లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులు ఇంకా నీరోడుతున్నాయి. వలసకూలీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చేదాకా అత్యవసర ప్రాతిపదికన ఆహార పంపిణీ నిలిపివేత కుదరదంటూ సర్వోన్నత న్యాయస్థానం మానవీయంగా స్పందించింది. దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు రేషన్ ఇచ్చి, స్వస్థలాలకు వెళ్లగోరేవారికి రవాణా సదుపాయం కల్పించాల్సిందిగా పదిరోజులక్రితం దిల్లీ, యూపీ, హరియాణా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడా ఉత్తర్వులను దేశవ్యాప్తంగా అమలుపరచాలంటున్న న్యాయస్థానం- అందుకు తగ్గ విధివిధానాలను పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను నిర్దేశించింది. 'సుప్రీం' చొరవతోనైనా పరిస్థితి ఎంతో కొంత కుదుటపడుతుందేమో చూడాలి!
కరోనాకాలం క్షుద్బాధలమయం
ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయి; మరోపక్క, విశ్వవ్యాప్తంగా ఆహారధాన్యాల సరఫరా వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడిందంటూ ఐక్యరాజ్యసమితి అభివర్ణించినట్లు- కరోనాకాలం క్షుద్బాధలమయం. అత్యవసర పరిస్థితుల్లో ఉండాల్సినదానికన్నా మూడురెట్లు అధిక ఆహార నిల్వలు దేశీయ ప్రభుత్వ గోదాముల్లో పేరుకుపోయి ఉండగా, కేంద్రం స్పందించిన తీరే తీవ్ర దిగ్భ్రాంతకరం. నిరుటి మాదిరిగా దేశమంతటా సంపూర్ణ లాక్‌డౌన్ విధించకుండా అక్కడక్కడా పరిమిత ఆంక్షలకు మొగ్గినందువల్ల వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేసేది లేదని రెండువారాల క్రితం కేంద్రం తెగేసి చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకింద మే, జూన్ నెలల్లో రేషన్ కార్డుదారులకు అదనంగా తిండిగింజలిస్తామన్న ప్రభుత్వం- కార్డులేని కోట్లాది అభాగ్యుల్ని గాలికొదిలేసింది.
1550 టన్నుల తిండిగింజలు వృథా
గోదాముల్లో నిర్వహణ లోపాల కారణంగా ఆరునెలల వ్యవధిలోనే 1550 టన్నుల మేర తిండిగింజలు వృథా అయినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గణాంకాలు చాటుతున్నాయి. ఆ వృథాను అరికట్టి పంపిణీని పరిపుష్టీకరిస్తే, ఎందరికో కడుపు నిండేది! 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు అధికారిక నివేదికలు చాటుతున్నాయి. ప్రభుత్వం తలచుకుంటే, సంవత్సరకాలంపాటు 25 కోట్లమంది అన్నార్తులకు నెలకొకసారి అయిదు కిలోల వంతున పంపిణీ చేయగలిగేంత ధాన్యరాశి అది! ఎందరో క్షుద్బాధా పీడితులై అలమటిస్తున్న వేళ, కొవిడ్ మరణాలకు ఆకలి చావులు జతపడకుండా కాచుకోవాల్సిన దశలో దేశీయ ఆహారావసరాలు తీరకుండా తీర్చకుండా ఇలా ఎగుమతులకు వెంపర్లాడటమేమిటి? ప్రభుత్వ ప్రాథమ్యాలు గాడి తప్పిన పర్యవసానంగానే వలసకూలీలతోపాటు కోట్లాది నిరుపేదల జీవనహక్కూ నేడు నిస్సహాయంగా కొల్లబోతోంది!
ఇదీ చదవండి: కరోనా వైరస్‌తో వేల కోట్లలో ఆకలి కేకలు!