వరుణుడు ఉగ్రరూపం దాల్చగా పోటెత్తిన వరదల బీభత్సం దేశ ప్రజానీకాన్ని హడలెత్తిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి దేశంలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు విస్తార జలాశయాల్ని తలపిస్తున్నాయి. పెద్దయెత్తున వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగిన దృశ్యాలు రైతుల్ని శోకసంద్రంలో ముంచెత్తుతుండగా- ఎన్నో ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడి జనజీవనం అతలాకుతలమవుతోంది.
పంటలకే కాదు- ప్రాణాలకూ విస్తృత నష్టం వాటిల్లిందన్న యథార్థాన్ని భారత వాతావరణ శాఖ తాజా నివేదికాంశాలు ధ్రువీకరిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సహా 11 రాష్ట్రాల్లో జులై-ఆగస్ట్ భీకర వరదలు 868 నిండు ప్రాణాల్ని కబళించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అసోం, బిహార్లలోనే 55 లక్షలమందిని నిరాశ్రయుల్ని చేసిన వరుణుడి ప్రకోపం- ఉభయ తెలుగు రాష్ట్రాల్నీ గడగడలాడిస్తోంది. గోదావరి మహోగ్రరూపం భద్రాద్రి ఏజెన్సీతోపాటు ఏపీనీ బేజారెత్తిస్తుండగా- కుంభవృష్టితో వాగులు చెరువులు పొంగిపొర్లుతున్న తెలంగాణలో ఊరూ ఏరూ ఏకమై పెను విషాదం నింపుతున్నాయి.
లక్షల క్యూసెక్కులు సముద్రంలోకే..
జోరెత్తిన జల ప్రవాహాలు పొలాల్ని రహదారుల్ని ముంచి ఉరకలెత్తుతున్న వేళ- లక్షలాది క్యూసెక్కుల జలరాశిని మహాసాగరంలోకి వదిలేస్తున్నారు. 65 శాతానికిపైగా భూభాగానికి కరవు కాటకాల ముప్పు పొంచి ఉండే దేశంలో ఇంత భూరి మొత్తం నీటిని ఉప్పు సముద్రానికి దఖలుపరచాల్సి రావడం జాతి ప్రారబ్ధం. ఏటా 70 శాతం వర్షాలు 100 రోజుల్లోనే కురిసిపోతుంటే, ఆ అమూల్య జలాల్ని పదిలపరచుకునే సన్నద్ధత కొరవడి అపార ప్రకృతి సంపదను వృథాగా పోగొట్టుకుంటున్నాం!
దేశంలో ఎక్కడా వరదల మూలాన విషాదం దాపురించకుండా నివారించేందుకంటూ ఆరున్నర దశాబ్దాలక్రితమే జాతీయ వరదల కమిషన్ కొలువుతీరింది. ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణనష్టాలను కనిష్ఠ స్థాయికి పరిమితం చేసే మౌలిక లక్ష్యంతోనే పదిహేనేళ్ల కిందట జాతీయ విపత్తు నిర్వాహక ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) అవతరించింది. వాటి ప్రయోజకత్వం ఏపాటిదో ఏటేటా గుండెల్ని పిండేస్తున్న విషాద పరంపర ఎలుగెత్తుతూనే ఉంది. వరదలు విరుచుకుపడి పంట దిగుబడుల్ని పశుసంపదను ఆస్తిపాస్తుల్ని బలిగొంటుండగా, నీటిమట్టాలు తగ్గుముఖం పట్టాక కసిగా కోరచాస్తున్న విషజ్వరాలూ అంటురోగాలు ఊళ్లకు ఊళ్లనే దుర్భర దుఃఖభాజనం చేసేస్తున్నాయి.
అనుసంధానం మాటేమిటి?
ఆరున్నర దశాబ్దాల వ్యవధిలో దేశంలో 87కోట్లమందికి పైగా వరద కరకు కోరల్లో చిక్కారని, లక్షా 10వేలమంది వరకు మృత్యువాత పడ్డారని, ఎకాయెకి నాలుగు లక్షల 70వేలకోట్ల రూపాయలకు పైబడి నష్టం వాటిల్లిందని అధికారిక అంచనా. గంగ, కావేరి నదుల్ని కలిపితే పట్నా దగ్గర 150 రోజులపాటు 60వేల క్యూసెక్కుల నీటిని బిగపట్టి 40 లక్షల హెక్టార్లను సస్యశ్యామలం చేయగల వీలుందని తెలుగుబిడ్డ కేఎల్‌రావు ఏనాడో లెక్కకట్టారు. మోదీ ప్రభుత్వం ఏకంగా 60 నదుల్ని అనుసంధానించాలని తలపోసినా, భావిభారత భాగ్యోదయానికి నాంది కాగల ప్రతిపాదన చురుకందుకొనకపోవడం విషాదం.
సురేశ్ ప్రభు కార్యదళం చెప్పినట్లు- పార్టీలు, ప్రభుత్వాల మధ్య రాజకీయ అనుసంధానమే అందుకు ప్రాణాధారం. దాంతోపాటు నాలాలపై అక్రమ ఆక్రమణల సత్వర తొలగింపు, ఏ చెరువులూ దొరువులూ కబ్జాకు గురికాకుండా కాచుకునే వ్యూహాల అమలుకు ప్రభుత్వాలు నిబద్ధం కావాలి. విపత్తులపై జాతీయ ప్రణాళికను కలిసికట్టుగా పట్టాలకు ఎక్కించగలిగితేనే, వరస విషాదాల నుంచి దేశానికి విముక్తి!