దక్షిణాదికి ద్రవ్య సంకెళ్లు బిగించిన పదిహేనో ఆర్థిక సంఘం తొలి దఫా సూచనల ఒరవడినే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సముఖానికి చేరిన తుది సిఫార్సులూ కొనసాగించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించి గతంలో పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు 42 శాతం వాటా అనుగ్రహించింది. 2020-21 సంవత్సరానికి ఆ కేటాయింపుల్ని ఒక శాతం తగ్గిస్తూ, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారినందువల్ల అక్కడి భద్రతాంశాల్నీ పరిగణనలోకి తీసుకుని ఒక శాతాన్ని అటు మళ్ళించామని ఎన్‌కే సింగ్ సంఘం గడుసుతనం ప్రదర్శించింది.
ఇప్పుడది మరో అయిదేళ్లకూ అంతే వాటా నిర్ధారించడం, వై.వి.రెడ్డి కమిషన్ సిఫార్సులతో పోలిస్తే రాష్ట్రాల వాటాలో తెగ్గోతే! సింగ్ కమిషన్ 17కు పెరిగిన రెవిన్యూ లోటు రాష్ట్రాలకు రూ.2.9లక్షల కోట్ల గ్రాంటును, అయిదేళ్లలో స్థానిక సంస్థలకు రూ.4.3లక్షల కోట్లను ఇవ్వాలని సిఫార్సు చేస్తూనే- అదే చేత్తో దేశ రక్షణ పద్దు బాధ్యతను రాష్ట్రాలపైనా రుద్దేసింది.
ఇప్పటివరకు దేశ భద్రతకోసం నిధుల్ని కేంద్ర బడ్జెట్‌లోనే ప్రత్యేకిస్తూ వచ్చారు. రూ.2.4లక్షల కోట్ల సురక్షా నిధి మొత్తాన్ని ముందే విడిగా తీసిపెడుతున్నప్పుడు, విభాజ్య నిధిలో రాష్ట్రాల వాటాను కనీసం 50 శాతానికి పెంచి ఉంటే సముచితంగా ఉండేది! పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 42శాతం వాటా పంపిణీకి సుముఖమంటూనే, కేంద్రం తాను భరించాల్సిన వ్యయ పద్దును అప్పట్లో నిష్కర్షగా తెగ్గోసింది.
2015-18 సంవత్సరాల మధ్య రాష్ట్రాలకు పంచిన వాటా 35 శాతానికే పరిమితమైనట్లు కేంద్రమే లోక్‌సభాముఖంగా ప్రకటించింది. పద్నాలుగో ఆర్థిక సంఘం చెప్పినదానికన్నా రాష్ట్రాలకు పన్ను వాటా పంపిణీలో తగ్గుదల ఎకాయెకి రూ.7.43లక్షల కోట్లుగా తేలింది. అటువంటప్పుడు, తాజాగా చెబుతున్న 41శాతం వాటా నికరంగా ఎంతకు పరిమితం కానుందో ఏమో! కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు సరైన వాటాల పంపిణీ ఎవరి దయాధర్మమో కాదు.. అది రాజ్యాంగబద్ధ హక్కు!
కేంద్రం చేసే విచక్షణాధికార నిధుల బదిలీని కనిష్ఠ స్థాయికి కట్టడి చేసి, మొత్తం కేటాయింపుల తీరుతెన్నుల్ని కూలంకషంగా సమీక్షించాలని జస్టిస్ పూంఛీ కమిషన్ ఉద్బోధించింది. ఆ కీలకాంశాన్ని విస్మరించిన కేంద్రం.. రాష్ట్రాల పనితీరు ప్రాతిపదికన ప్రోత్సాహకాల్ని పదిహేనో ఆర్థిక సంఘం పరిశీలనాంశాల్లో చేర్చడమే అభ్యంతరకరం. జనాభాకు 15శాతం వెయిటేజీ ఇచ్చిన కారణంగా, జనసంఖ్య స్థిరీకరణలో మెరుగ్గా రాణించిన ఏపీ, తెలంగాణ ప్రభృత రాష్ట్రాలు సహజంగానే కలవరపాటుకు గురయ్యాయి. అలా వాటిల్లే నష్టాన్ని పూడ్చేందుకంటూ ప్రత్యేక ఫార్ములా రూపొందించినట్లు చెబుతున్నా- చర్యల నివేదికతో పాటు పూర్తి సిఫార్సులూ వెలుగు చూసేదాకా ఉత్కంఠ తప్పదు!
విభాజ్య నిధి పరిధిలో చేర్చకుండా వివిధ సుంకాల పేరిట కేంద్ర ఖజానాలో జమపడుతున్న మొత్తం మాటేమిటని మహారాష్ట్ర వంటివి చిరకాలంగా ప్రశ్నిస్తున్నాయి. రకరకాల సెస్సులు, సర్చార్జీలను కేంద్రమే గుప్పిట పడుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం వసూళ్లు రూ.21.6 లక్షల కోట్లు.
రాష్ట్రాల వాటాగా నిర్ధారించిన రూ.6.6 లక్షల కోట్లు.. మొత్తం పన్ను రాబడిలో 30.5 శాతంగానే లెక్క తేలుతుంది! ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటివి విభాజ్య నిధిలో కనీసం 50శాతం వాటా కోరుతుండగా- షరతులూ మెలికెల మాటున రాబడి కుంగుదల, గ్రాంట్లలో సైతం క్షీణత రాష్ట్ర ప్రభుత్వాలను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నాయి.
డాక్టర్ అంబేడ్కర్ ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తిని దేశంలో చెక్కుచెదరకుండా నిలబెట్టాలంటే- పన్నుల్లో వాటాల పంపిణీకి సహేతుక సూత్రాలు రూపొంది తీరాలి. సమధిక బాధ్యతలు మోయాల్సిన రాష్ట్రాలు ఆ బరువు కింద కుదేలయ్యే దుస్థితి దాపురించకుండా కేంద్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే- సమతులాభివృద్ధి సాకారమై అందరికీ ప్రగతి ఫలాలు దక్కుతాయి!