ETV Bharat / opinion

భద్రతా ప్రమాణాల పెంపుతోనే విద్యుత్ ప్రమాదాలకు కళ్లెం

దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో విద్యుత్​ ప్రమాదాల్లోనూ పెరుగుదల నమోదవుతోంది. లైన్లు విస్తరిస్తున్న కొద్దీ విద్యుత్‌ ప్రమాదాలూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. పరికరాల తయారీదారులు, కార్మికులు, పంపిణీ సంస్థలు, వినియోగదారులు భద్రతా ప్రమాణాలు పాటించి జాగ్రత్తగా వ్యవహరిస్తే దేశంలో విద్యుత్‌ ప్రమాదాలను పూర్తిగా నిరోధించి, ఏటా వేలాది ప్రాణాలను, కోట్ల రూపాయల ఆస్తి నష్టాలను నివారించవచ్చు.

electrical hazards
విద్యుత్
author img

By

Published : Jul 2, 2020, 10:31 AM IST

గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పల్లెకు విద్యుత్‌ లైన్లు విస్తరించడంతో వందశాతం విద్యుదీకరణ లక్ష్యం నెరవేరింది. వివిధ గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. అనేక పరిశ్రమలు నెలకొల్పడం, వ్యవసాయ మోటార్ల విస్తృత వినియోగం తదితర కారణాలతో విద్యుత్‌ వాడకం పెరుగుతోంది.

అంతర్జాతీయ తలసరి సగటు విద్యుత్‌ వినియోగం 2,674 యూనిట్లు. ఇది మనదేశంలో 1,181, తెలంగాణలో 1,896, ఆంధ్రప్రదేశ్‌లో 1,234 యూనిట్లుగా ఉంది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. లైన్లు విస్తరిస్తున్న కొద్దీ విద్యుత్‌ ప్రమాదాలూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2018లోనే 12,154 మంది విద్యుదాఘాతంతో, 1,719 మంది విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వంటి ప్రమాదాల్లో చిక్కుకొని మరణించారు. అంటే రోజుకు సగటున 38 మంది విద్యుత్‌ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్నిబట్టి ఈ ప్రమాదాల తీవ్రత అర్థమవుతుంది.

మెలకువలతోనే రక్షణ

విద్యుదాఘాతానికి గురైన వారిలో 18 నుంచి 45 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని పోషించే వారే 66 శాతం. విద్యుత్‌ ప్రమాదాల వల్ల సుమారు 4,893 జంతువులు మరణించడమే కాకుండా, షార్ట్‌ సర్క్యూట్‌తో కోట్ల రూపాయల ఆస్తి అగ్గిపాలవుతోంది. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోతున్నవారెందరో. కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రతా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ- ఏటా జూన్‌ 26ను జాతీయ విద్యుత్‌ భద్రతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రోజు నుంచి వారంపాటు విద్యుత్‌ భద్రతా వారోత్సవాన్ని చేపట్టి, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు.

ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లలేకపోయాయి. నాసిరకం విద్యుత్‌ పరికరాలను ఉపయోగించడం, తీగల సామర్థ్యానికి మించి విద్యుత్‌ వాడకం, నైపుణ్యం లేనివారితో విద్యుత్‌ పనులు చేపట్టడం, సరైన భద్రత పనిముట్లు ప్రామాణిక పద్ధతులు పాటించకపోవడం, నిర్లక్ష్యం వంటివి విద్యుత్‌ ప్రమాదాలకు ప్రధాన కారణాలు. నాణ్యత ప్రమాణాలు లేని ఉపకరణాలను ఉత్పత్తి చేయకుండా నిరోధించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉండగా, అలాంటి ఉత్పత్తుల్ని కొనకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.

దేశంలో 86 శాతం..

విద్యుత్‌ ఉపకరణాలు అమ్మే సమయంలోనే, వాటిని వాడే పద్ధతులను వివరిస్తూ- స్థానిక భాషలో కరపత్రాలు అందజేస్తే వినియోగదారులు జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. విద్యుత్‌ తీగల వ్యవస్థ ఏర్పాటు పనుల్ని సుశిక్షితులైన సిబ్బంది మాత్రమే చేపట్టాలి. పనిచేసే ప్రదేశాల్లో విద్యుత్‌ ప్రమాదాలు ఇతర దేశాల్లో పదిశాతం లోపే. భారత్‌లో 86శాతం వరకు చోటుచేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్‌ ప్రమాదాలకు లోనైన వారిలో సుమారు 18 శాతం ఆ శాఖ కార్మికులే.

ఈ విషయంలో ప్రభుత్వాలు స్పందించి దేశవ్యాప్తంగా పని చేస్తున్న కోట్ల మంది విద్యుత్‌ కార్మికులకు, పనిలో మెలకువలు నేర్పించి, భద్రతా పనిముట్లు అందజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రంలో ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి నేతృత్వంలో విద్యుత్‌ సంబంధ తనిఖీలు కేవలం భారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, 15 మీటర్ల పైబడిన భవనాలు తదితర వాటికే పరిమితమైంది.

లోపాలను సరిదిద్దాలి

విద్యుత్‌ పంపిణీ సంస్థలు లైన్లను, ట్రాన్స్‌ఫార్మర్లను ప్రమాదరహితంగా నెలకొల్పడమే కాకుండా, వినియోగదారులకు భద్రతపై అవగాహన కల్పిస్తూ జాగృతపరచాలి. అధిక కరెంటు సరఫరా నుంచి రక్షించే ఉపకరణాలను వినియోగించాలి. విద్యుత్‌ ఉపకరణాలకు చిన్నారులను దూరంగా ఉంచడం, రోడ్లపై ఉండే ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు స్తంభాల చెంతకు ఎవరూ వెళ్లకుండా చూడటం వల్ల కొంతమేర ప్రమాదాలు నివారించవచ్చు. కాలం చెల్లిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. వేలాడే తీగల్ని సరిచేయడంద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు.

ఇటీవల తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు... పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా విద్యుత్‌ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ముదావహం. విద్యుత్‌ భద్రతా సూత్రాలను కూడా రహదారి భద్రతా నియమావళి మాదిరిగా పాఠశాలస్థాయి పాఠ్యాంశాల్లో చేరిస్తే విద్యుత్‌ ప్రాధాన్యాన్ని విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. ప్రమాదాల నుంచి తప్పించుకునే మార్గాలను తెలుసుకుంటారు. పరికరాల తయారీదారులు, కార్మికులు, పంపిణీ సంస్థలు, వినియోగదారులు భద్రతా ప్రమాణాలు పాటించి జాగ్రత్తగా వ్యవహరిస్తే దేశంలో విద్యుత్‌ ప్రమాదాలను పూర్తిగా నిరోధించి, ఏటా వేలాది ప్రాణాలను, కోట్ల రూపాయల ఆస్తి నష్టాలను నివారించవచ్చు.

(రచయిత- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఇంధనరంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.