తమిళనాడు అధికార పక్షం.. అన్నా ద్రవిడ మున్నెట్ర కళగం (అన్నాడీఎంకే) 49వ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు లేకుండానే కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించడం వల్ల అంతర్గత గొడవలు సైతం కొలిక్కివచ్చాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) నేతృత్వంలోనే ముందుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అయితే, రానున్న రోజుల్లో పార్టీ కఠిన సవాళ్లు ఎదుర్కోనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలు పార్టీ భవిష్యత్తుకు, పళనిస్వామి నాయకత్వానికి పరీక్ష కానున్నాయి.
ఇదీ చూడండి: సీఎం అభ్యర్థిగా మళ్లీ 'పళనిస్వామి'కే ఓటు
సార్వత్రిక దెబ్బ..
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి గట్టిదెబ్బే తగిలింది. పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 18.48శాతం. పార్టీ చరిత్రలో ఇదే అత్యల్పం. గత ఎన్నికలతో పోలిస్తే.. భారీగా పడిపోయింది. 21 స్థానాల్లో పోటీ చేసి గెలిచింది ఒక్కటే సీటు మాత్రమే. ఈ ఎన్నికల్లో భాజపా, పీఎంకేలతో కలిసి పోటీ చేసింది అన్నాడీఎంకే. 2014లో జయలలిత సారథ్యంలో పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. దాదాపు 44శాతం ఓట్లతో.. 39 స్థానాల్లో పోటీచేసి 38చోట్ల జయకేతనం ఎగురవేసింది.
ప్రణాళిక అవసరం..
అన్నాడీఎంకే చిరకాల ప్రత్యర్థి.. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) రానున్న ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈపీఎస్.. సాధ్యమైనంత వేగంగా, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుందంటున్నారు విశ్లేషకులు.
ఇది అన్నాడీఎంకే పార్టీకి, ఈపీఎస్ నాయకత్వానికి కఠిన సవాలే. అయితే అధికార పక్షం చీలిపోకుండా.. అధికారం చేజారకుండా పార్టీని ఐక్యంగా ఉంచటంలో సఫలీకృతులయ్యారు. మరోవైపు పళనిస్వామి నేతృత్వంలో పార్టీ.. బలమైన డీఎంకేతో పోటీ పడుతుందన్నది కూడా విస్మరించకూడదు.
-డా. ఆర్. తిరునావకరసు, ప్రొఫెసర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే రాష్ట్రంలో పునరావృతం అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.
సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే... మోదీ వ్యతిరేక నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఘన విజయం సాధించింది. శాసనసభ ఎన్నికల్లో ఆ అవకాశం లేదు. పరిస్థితులు మారిపోతాయి. ఈపీఎస్‌కు.. జయలలిత అంతటి ఘన కీర్తి లేకపోయినా.. అన్నాడీఎంకే శ్రేణులను ఏకీకృతం చేయటంలో విజయం సాధించారు.
-డా. ఆర్. తిరునావకరసు, ఆచార్యులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
ముంచుకొస్తున్న ఉప్పెన
అయితే అధికార పార్టీలో ప్రస్తుతానికి అంతర్గత విబేధాలు లేకపోయినా.. జయలలిత నెచ్చెలి వీకే శశికళ రూపంలో పెద్ద ఉప ద్రవమే పొంచి ఉంది. ఆమె వచ్చే ఏడాది ఆరంభంలో జైలు నుంచి విడుదలవ్వనున్నారు. పార్టీపై ఆమె పట్టు సాధించడానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే, పార్టీని అస్థిరపరిచే శక్తిగా పనిచేస్తుందో లేదో చూడాలి. అన్నాడీఎంకే శశికళకు ప్రాధాన్యం ఇచ్చేే స్థితిలో లేదని నేతలు చెబుతున్నా.. విశ్లేషకుల వాదనలు మరోలా ఉన్నాయి.
శశికళను అంత సులభంగా పక్కనపెట్టే అవకాశం లేదు. పదవుల విషయంలో మంత్రులే కాదు, ముఖ్యమంత్రి కూడా ఆమెకు రుణపడి ఉంటారు. శశికళ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. ఆమె విడుదల తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయం.
-డా. సి. లక్ష్మణన్, సహాయ ఆచార్యులు, మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్
అన్నాడీఎంకే భవిష్యత్తు గురించి బెంగపడటం మానేసి.. ప్రస్తుత పరిస్థితులపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈపీఎస్, ఓపీఎస్లే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాతృవియోగంతో స్వస్థలం సేలంలోనే ఉన్న ముఖ్యమంత్రి స్థానిక కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. పార్టీ శ్రేణులను సమన్వయం చేసి, చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో అంతర్గత విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి.
పార్టీ కార్యకర్తలందరిలో ఉత్సాహం నింపే బాధ్యత తీసుకున్నారు పన్నీర్ సెల్వం. పార్టీ 50పడిలోకి అడుగుపెతున్న సందర్భంలో.. మరోసారి అధికారం దక్కించుకునేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 235స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టిద్దామన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే వరసగా రెండోసారి అధికారంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రతికూలతలు, అనుకూలతల నడుమ జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకే మూడో సారి విజయం సాధింస్తుందా? అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
ఇదీ చూడండి: భాజపా గూటికి కుష్బూ- లాభం ఎవరికి?
ఇదీ చూడండి: తమిళనాడు సీఎం పళనిస్వామికి మాతృ వియోగం