ETV Bharat / opinion

బాధ్యతారాహిత్యం.. భరోసానివ్వని ప్రభుత్వం! - covid

రోజుకు 3లక్షలకు చేరువైన కరోనా కేసులు.. ఆరోగ్యరంగ సంసిద్ధత పరంగా పాలకవర్గాల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాయి. మహమ్మారి కట్టడిలో గతేడాదితో పోలిస్తే పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు.. వాస్తవ పరిస్థితికి పొంతనలేదు. పడకలు, ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని వెక్కిరిస్తోంది.

editorial
సంపాదకీయం
author img

By

Published : Apr 22, 2021, 8:10 AM IST

అయ్య వచ్చేదాకా అమాస ఆగదు. దావానలంలా దేశాన్ని భయంకరంగా చుట్టేస్తున్న కొవిడ్‌ మహమ్మారిదీ అదే తీరు! కరోనా మలివిడత విజృంభణ మహోగ్రంగా ఉంటుందని అమెరికా, ఐరోపా అనుభవాలు కళ్లకుకట్టినా ముందస్తు జాగ్రత్తల్ని విస్మరించి, వైద్యసేవల పరంగా సన్నద్ధతను గాలికొదిలేసి పాలక శ్రేణులు నిష్పూచీగా వ్యవహరించబట్టే కొవిడ్‌ ఇంతగా ప్రాణాంతకమవుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో నిరుటితో పోలిస్తే క్షేత్రస్థాయి పరిస్థితులు ఎంతగానో మెరుగుపడ్డాయని ప్రధానమంత్రి చెబుతున్నా- మూడు వారాల్లో మూడు రెట్లు పెరిగిన కేసులు, మరణాలు పెను సామాజికార్థిక సంక్షోభానికి అద్దంపడుతున్నాయి. కరోనా పరీక్షా కేంద్రాల్ని రెండున్నర వేలకు పెంచామని కేంద్రం ప్రకటించినా- తాకిడి తట్టుకోలేక దేశ రాజధానిలోనే రెండు రోజుల పాటు నమూనాల సేకరణ నిలిపేశారంటే ఏమనుకోవాలి? కొవిడ్‌ ప్రత్యేకాసుపత్రుల్ని భారీగా ఏర్పాటుచేశామన్న వ్యాఖ్యల డొల్లతనాన్ని ఆసుపత్రుల్లో పడకల కొరత వెక్కిరిస్తోంది. ఆక్సిజన్‌ సైతం అందుబాటులో లేక రోగుల ప్రాణాలు పోతున్న హృదయవిదారక దృశ్యాలూ నమోదవుతున్నాయి. నిన్నమొన్నటి దాకా 70కి పైగా దేశాలకు 6.6 కోట్ల వ్యాక్సిన్లను ఎగుమతి చేసిన ఇండియాలో టీకాల నిల్వలూ నిండుకొన్నాయి. నయం కాగల ఆరోగ్య సమస్యలతోనే రోగులు రాలిపోతున్నారన్న యువవైద్యుల ఆవేదన ప్రభుత్వాల నిష్క్రియాపరత్వాన్నే బోనెక్కిస్తోంది. ఎనిమిది నెలల కాలయాపన దరిమిలా 162 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సమ్మతించినా, అందులో అయిదో వంతే ఏర్పాటుచేయగలిగారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రధాని నియమించిన టాస్క్‌ఫోర్స్‌ సక్రమంగా పనిచేసి ఉంటే రోజూ మూడు లక్షలకు చేరువవుతున్న కేసులతో, పదిశాతం దాటిన మరణాల రేటుతో దేశం ఇంతగా శోకసంద్రమయ్యేదే కాదు! తాజా వ్యాక్సిన్‌ విధానమూ దేశారోగ్యానికి భరోసా ఇచ్చేలా లేదు!

ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్లలో 60 శాతానికి పైగా ఉత్పత్తి అయ్యే ఇండియాలోనే కొవిడ్‌ టీకాల కొరత నిర్ఘాంత పరుస్తోంది. కొవిడ్‌ ముప్పును గణనీయంగా నిరోధించి, ఒకవేళ సోకినా ప్రాణాంతకం కాకుండా నిలువరించి, వ్యాధి వ్యాప్తినీ అడ్డుకోవడానికి వ్యాక్సినే శరణ్యమని యావత్‌ ప్రపంచం భావిస్తోంది. వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉండగానే అమెరికా తన 30 కోట్ల జనావళికి 60 కోట్ల డోసుల కోసం పూర్తి చెల్లింపులు జరిపితే, 130 కోట్ల పైబడిన జనాభా గల ఇండియా కోటీ 10 లక్షల డోసులకు ఆర్డరు ఇచ్చింది! దేశీయంగా జనవరి 16నే అంచెలవారీ టీకా కార్యక్రమం మొదలైనా, తొలివిడతలో మూడు కోట్ల మంది కొవిడ్‌ పోరాటయోధుల్లో 37 శాతానికే వ్యాక్సిన్‌ అందింది. దరిమిలా 60 ఏళ్ల పైబడిన వారు, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా విస్తృతికి కేంద్రం బాటలు పరచినా- వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు అర్థించాల్సిన దుస్థితి దాపురించింది. ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు సహకరించాలన్న వ్యాక్సిన్‌ సంస్థల అర్జీలపై కాలయాపన, టీకాల తయారీలో మూడు ప్రభుత్వరంగ సంస్థలను భాగస్వాముల్ని చేయడంలో జాప్యం- ప్రాణాంతక వైరస్‌కు కొత్త కోరలు తొడిగాయి. తాజాగా టీకా తయారీదారులకు ఆర్థిక దన్ను చేకూరుస్తూనే పద్దెనిమిదేళ్లు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామన్న కేంద్రం- 45 ఏళ్లు దాటిన వాళ్ళని తన పద్దులో వేసుకొని, తక్కిన వారి బాధ్యత రాష్ట్రాలు, ప్రైవేటు రంగానికి బదలాయించడమే విడ్డూరం. కొవిడ్‌ కారణంగా ఉపాధి అవకాశాలు కోసుకుపోయి పౌరులు, రాబడులు కుంగి రాష్ట్ర ప్రభుత్వాలు అవస్థల పాలవుతూ టీకాలకు డబ్బువెచ్చించలేని దశలో కేంద్రం ఇలా బాధ్యతలు దులపరించేసుకోవడం అసంబద్ధం. పరిమిత వ్యాక్సిన్లను దక్కించుకోవడంలో ధనిక పేద రాష్ట్రాల మధ్య అసమాన పోటీ- సమాఖ్య స్ఫూర్తికి గొడుగుపట్టేదేనా? సార్వత్రికంగా కొవిడ్‌ వ్యాక్సిన్లను ఉచితంగా అందించేందుకు, అందుకు దీటుగా నిరంతరాయంగా టీకాల సరఫరాకూ కేంద్రం పూచీపడకపోతే- కరోనా మరణమృదంగాన్ని ఆపడం ఎప్పటికైనా సాధ్యపడుతుందా?

ఇదీ చూడండి: కొవిడ్ కట్టడికి త్వరపడాల్సిన తరుణమిది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.