అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించామని ఉపకులపతుల సదస్సులో సగర్వంగా ప్రకటించిన ప్రధాని మోదీ- భావి అవసరాల్ని అది సమర్థంగా తీర్చగలదని దృఢవిశ్వాసం వ్యక్తీకరించారు. సాధారణ విద్యార్జనకు కాదు, నైపుణ్యాభివృద్ధికే దేశంలో విశేష ప్రాధాన్యం ఇస్తున్నామనీ ఆయన పునరుద్ఘాటించారు. వాస్తవానికి ఆ విధాన ముసాయిదా, కేంద్రంలో రెండోదఫా కొలువు తీరిననాడే మోదీ ప్రభుత్వ సముఖానికి చేరింది. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు భిన్న అంచెల్లో నిర్ణాయక సంస్కరణల ద్వారా భారతీయ బోధన రంగాన్ని ప్రపంచ అత్యుత్తమ వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టాలన్న ఆశయం అక్షరాలా బృహత్తరమైంది. దాన్ని సాకారం చేసే క్రమంలో- కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3డీ ముద్రణ తదితర రంగాల్లో అపార అవకాశాల్ని రెండు చేతులా ఒడిసిపట్టేందుకు ప్రధానమంత్రి సన్నద్ధత చాటుతున్నారు. ఆయా నవీన నైపుణ్యాల్ని సంతరింపజేసే సంస్థలను మూడు పెద్ద మెట్రో నగరాల్లో నెలకొల్పదలచామని, అందులో ఒకటి ఇప్పటికే ముంబయిలో ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు.
కేవలం మూడింటికే..
తయారీరంగ పరిశ్రమలకు ప్రపంచ రాజధానిగా చైనా అవతరించినట్లే, నిపుణ మానవ వనరుల విశ్వ కేంద్రంగా భారత్ వెలుగొందాలన్న ప్రగాఢ ఆకాంక్షలు గతంలోనే వెలుగుచూశాయి. వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతికత, కొత్తగా పుట్టుకొస్తున్న అవకాశాలకు తగ్గట్లు విరివిగా నిపుణ శక్తుల సృజన నిమిత్తం జిల్లాస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అవతరించాలని గతంలో 'నీతి ఆయోగ్' సహేతుకంగా సిఫార్సు చేసింది. అందుకు భిన్నంగా కేంద్రం మూడు ప్రధాన నగరాలకు వాటిని పరిమితం చేస్తామనడం విస్మయపరుస్తోంది. రేపటి వృత్తి ఉద్యోగాలకు వీలైనంత ఎక్కువ మందిని సంసిద్ధపరచడమే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల వికేంద్రీకరణపై ప్రభుత్వం సత్వరం దృష్టి సారించాలి!
70 శాతం యువతకు తెలియదు..
పుష్కరకాలం నాటి జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం స్థానే ఆరేళ్లక్రితం 2015లో కొత్త పాలసీ పట్టాలకు ఎక్కింది. పేదరికానికి, నిరుద్యోగానికి చెల్లుచీటీ రాసేలా 2022 నాటికి ఎకాయెకి 40కోట్ల మందిని నిపుణశక్తులుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం అప్పట్లో సంకల్పించింది. పకడ్బందీ కార్యాచరణ కొరవడటం 'స్కిల్ ఇండియా' మౌలిక లక్ష్యాన్నే నీరుకార్చింది. పథకాన్ని ఘనంగా ప్రారంభించిన మూడేళ్ల దరిమిలా చేపట్టిన అధ్యయనం- దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్లు 70శాతం యువతకు తెలియనే తెలియదని ధ్రువీకరించింది. సగటున ఏటా కోటిమందికిపైగా సుశిక్షితుల్ని చేశామన్న అధికారిక ప్రకటనలకు, శిక్షణ సజావుగా పూర్తయ్యి కొలువుల్లో కుదురుకున్నవారి సంఖ్య ఆరేడు లక్షల లోపేనన్న విశ్లేషణలు గాలి తీసేశాయి.
ప్రామాణిక శిక్షణ..
నిరుద్యోగిత విస్తరించిందన్న సీఎంఐఈ (భారత ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కేంద్రం) గణాంకాల్ని వెన్నంటి కోరసాచిన కరోనా మహమ్మారి- మానవ మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది. కొవిడ్ ఉపశమించిన తరవాత సాంకేతికతకు ప్రాముఖ్యమిస్తూ పారిశ్రామిక, సేవారంగాల్లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా దేశ యువత పనిపోకడలకు సానపట్టడమన్నది నిజంగానే గడ్డుసవాలు. పాఠశాల చదువు పూర్తయ్యేసరికి ఏదో ఒక వృత్తి నైపుణ్యం ఒంటపట్టాలన్న నూతన విద్యావిధాన స్ఫూర్తికి మన్నన దక్కాలంటే- బోధన సిబ్బందికి ప్రామాణిక శిక్షణ అందించాల్సిందే. 2030 నాటికి ఉద్యోగార్హ నైపుణ్యాలు కరవై నిరాశానిస్పృహల్లో కూరుకుపోయే 90కోట్ల మంది యువతలో భారతీయులదే పెద్దవాటా కాబోతోందని గతంలో పలు అధ్యయనాలు హెచ్చరించాయి. ఆ పీడకలను ఏ దశలోనూ నిజం కాకుండా చేస్తేనే- నూతన జాతీయ విద్యావిధానం, నైపుణ్యాభివృద్ధి పథకం... సంక్లిష్ట పరీక్షలో నెగ్గినట్లు!
ఇదీ చూడండి: కొవిడ్ కట్టడికి త్వరపడాల్సిన తరుణమిది!