ETV Bharat / opinion

గిరాకీ, సరఫరాలే ఆర్థిక సంక్షోభానికి మందు

భారత ఆర్థిక వృద్ధిరేటు ఇకమీదటా ఆశాజనకంగా ఉండే అవకాశాల్లేవని అంతర్జాతీయ ద్రవ్యనిధి నివేదిక-2020 గణాంకాలు తెలుపుతున్నాయి. దీని ప్రకారం 2020-21లో భారత ఆర్థిక వృద్ధిరేటు -10.9 శాతంగా ఉంటుంది. ఇదీ మిగతా దేశాల కంటే తక్కువే. భారత రిజర్వు బ్యాంకు అంచనాలూ దాదాపు ఇదే తీరుగా ఉన్నాయి. ఇటీవలి వరకు ప్రపంచంలోనే అధిక వృద్ధి నమోదవుతున్న దేశాల జాబితాలోని భారత్‌.. కరోనా కారణంగా తీవ్ర ప్రతికూలతల్లోకి జారుకొంది.

economic
ఆర్థిక వృద్ధి
author img

By

Published : Nov 7, 2020, 8:39 AM IST

ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా కుంగదీస్తోంది. 1930నాటి అంతర్జాతీయ ఆర్థికమాంద్యం తరవాత ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభమిది. దీనివల్ల ఎన్నో దేశాల ఆర్థిక వృద్ధిరేట్లు విపరీతంగా పడిపోతున్నాయి. ఇటీవల విడుదలైన తొలి త్రైమాసిక గణాంకాల (2020-21) ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధిరేటు -23.9శాతం. భారత్‌లో పెద్దయెత్తున ఉద్యోగులు ఆదాయాలు కోల్పోయి, పేదరికంలోకి జారుకుంటున్నారు.

భారత ఆర్థిక వృద్ధిరేటు ఇకమీదటా ఆశాజనకంగా ఉండే అవకాశాల్లేవని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నివేదిక-2020 గణాంకాలు తెలుపుతున్నాయి. దీని ప్రకారం 2020-21లో భారత ఆర్థిక వృద్ధిరేటు -10.9 శాతంగా ఉంటుంది. ఇదీ మిగతా దేశాల కంటే తక్కువే. భారత రిజర్వు బ్యాంకు అంచనాలూ దాదాపు ఇదే తీరుగా (-9.5శాతం) ఉన్నాయి. ఇటీవలి వరకు ప్రపంచంలోనే అధిక వృద్ధి నమోదవుతున్న దేశాల జాబితాలోని భారత్‌- కరోనా కారణంగా తీవ్ర ప్రతికూలతల్లోకి జారుకొంది.

కొనుగోలు శక్తి ఇనుమడించాలి

తొమ్మిది దశాబ్దాల కిందట ఏర్పడిన మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవలకు గిరాకీ పడిపోయింది. ఇప్పుడు గిరాకీతోపాటు సరఫరా సైతం కుప్పకూలింది. ఈ సంక్షోభంలో బయటినుంచి మద్దతు లేకుండా ఆర్థిక వ్యవస్థ సహజంగా కోలుకోవడం అంత సులభం కాదు. 1930 మాంద్య సమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు అధిక వ్యయం చేయాలని జె.ఎమ్‌.కీన్స్‌ అనే ఆర్థికవేత్త సూచించారు. మౌలిక సదుపాయాలపై వ్యయం పెంచడంతోపాటు- వినియోగ ప్రవృత్తి కలిగిన పేద, దిగువ, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వాలు నగదు బదిలీ చేయాలని ఆయన సూచించారు. దానివల్ల కొనుగోలు శక్తి పెరిగి డిమాండు ఇనుమడిస్తుంది. అందుకు అనుగుణంగా సరఫరా సైతం పెరుగుతుంది. ప్రజల ఆదాయాలు అధికమవుతాయి.

ఈ రకంగా ప్రభుత్వ వ్యయం పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీయదు. ప్రభుత్వ రంగ పెట్టుబడి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఒక శాతం పెరిగితే- దానివల్ల ప్రైవేటు రంగంలో 10శాతం పెట్టుబడి ఇనుమడిస్తుందని ఐఎంఎఫ్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. ఫలితంగా మొత్తంగా జీడీపీ వృద్ధి 2.7శాతం మేర పెరుగుతుందని, దానివల్ల 3.3కోట్ల మందికి ఉపాధి లభ్యమవుతుందని నివేదికలో విశ్లేషించారు. ప్రస్తుత సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమే మేలైన పరిష్కారం.

మూడేళ్లుగా..

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించే సమయానికే దేశ ఆర్థికం అంతకు ముందు మూడేళ్లనుంచీ అవరోహణక్రమంలో ఉంది. 2016-17 వరకు సుమారు ఎనిమిది శాతంగా నమోదైన వృద్ధిరేటు, 2019-20నాటికి 4.2 శాతానికి పడిపోయింది. దీనికి చాలావరకు పెద్దనోట్ల రద్దు (2016), వస్తు సేవల పన్ను (2017) వంటి విధానాలే కారణం. వీటివల్ల దేశ ఆర్థికానికి వెన్నెముకలాంటి అసంఘటిత రంగం కుదేలైంది. ఆ తరవాత విధించిన వరస లాక్‌డౌన్‌లు ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అధిక ఉద్యోగ సాంద్రత కలిగిన అసంఘటిత రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపాయి.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు- భారత ప్రభుత్వం జీడీపీలో ఏడుశాతం వాటాను ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులో కీలకభాగం ప్రైవేటు రంగానికి రుణాల (5.2 శాతం) రూపేణా వెచ్చిస్తున్నామంటున్నారు. ప్రభుత్వ పెట్టుబడులుగా; ప్రజలకు ప్రత్యక్ష నగదు, వస్తు బదిలీ రూపంలోనూ చేస్తున్న వ్యయం (1.8శాతం) తక్కువే. మిగిలిన దేశాల్లో పోలిస్తే ఈ వ్యయం చాలా స్వల్పం. అందువల్లే ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధిరేట్ల పతనం భారత్‌తో పోలిస్తే నామమాత్రంగా ఉంది.

మౌలిక సౌకర్యాలపై దృష్టి

ప్రభుత్వ విత్త వ్యయం అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేట్లు ఘనంగా ఉన్నట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ద్రవ్య విధానం ద్వారా వడ్డీరేట్లు తగ్గించాలని, ఫలితంగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, సంక్షోభ సమయాల్లో ప్రైవేటు పెట్టుబడులు వడ్డీరేట్లు ఎంత అన్నదానికన్నా- భవిష్యత్తులో లాభాలు వస్తాయా రావా అన్న అంచనాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం జీడీపీలో సుమారు అయిదు శాతం మేరకు వ్యయం చేయాలి.

ఇందుకోసం కేంద్రం ఆర్‌బీఐనుంచి దీర్ఘకాల ప్రాతిపదికన రుణాలు తీసుకొని- వాటిని డిమాండ్‌ సృష్టించే రంగాల్లో ప్రాధాన్య ప్రాతిపదికన ఖర్చుపెట్టాలి. మౌలిక సౌకర్యాలపై ముఖ్యంగా విద్య, వైద్య, రవాణా, వ్యవసాయ, డిజిటల్‌ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. దీనివల్ల ప్రైవేటు రంగమూ చురుగ్గా ముందుకొస్తుంది. అసంఘటిత రంగంలో ఉంటూ పన్ను పరిధిలోకి రాని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కనీసం ఆరు నెలలపాటు నెలకు పదివేల రూపాయల నగదు బదిలీ చేస్తే- వారికి కొంతలో కొంత ఊరట దక్కుతుంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్దిష్ట కాలావధిలో చెల్లించే ప్రాతిపదికన కనీసం పదివేల రూపాయలను వడ్డీలేని రుణాలుగా ఇవ్వడం సముచితం. దీనివల్ల డిమాండ్‌ పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది.

(రచయిత- డాక్టర్‌ చీరాల శంకర్‌ రావు, ఆర్థిక రంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.