కొవిడ్ వ్యాధితో ఆస్పత్రి పాలైన రోగుల్లో న్యుమోనియో వంటి బ్యాక్టీరియా వ్యాధులూ కనిపిస్తున్నాయి. అమెరికాలో 20 శాతం కొవిడ్ రోగులు బ్యాక్టీరియా రోగాల బారిన పడుతున్నారు. మెజారిటీ కేసుల్లో యాంటీబయాటిక్ మందులు పని చేస్తున్నా, ఔషధాలకు లొంగని సూపర్ బగ్స్ పొంచి ఉన్నాయి. వీటిని నిర్మూలించగల కొత్త తరహా యాంటీబయాటిక్స్‌ను కనిపెట్టకపోతే, కొవిడ్ నుంచి కోలుకున్నవారు బ్యాక్టీరియా రోగాల బారిన పడి మరణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రపంచంలో ఏటా ఏడు లక్షలమంది ఇలాంటి మొండి సూక్ష్మజీవులవల్ల మరణిస్తున్నారు. కొత్త తరహా మందులు, చికిత్సలను కనుగొనకపోతే ఈ మరణాల సంఖ్య 2050కల్లా ఏటా కోటికి చేరుతుంది. ఈ మరణాల వల్ల సంభవించే ఉత్పాదకత నష్టం 100 లక్షల కోట్ల డాలర్లని విఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక ది ల్యాన్సెట్ అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు ‘ప్రపంచ యాంటీబయాటిక్స్ అవగాహన వారం’ సందర్భంగా ఈ అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
విచ్చలవిడిగా వినియోగం
పెన్సిలిన్‌ను 1928లో కనిపెట్టినప్పటి నుంచి 1950ల వరకు అనేక కొత్త కొత్త యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణ జరిగింది. 1950వ దశకాన్ని యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలకు స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ 1928-1984 మధ్య కనుగొన్నవాటికి మార్పుచేర్పులు చేసి ఉపయోగిస్తున్నవే. అప్పటికీ ఇప్పటికీ 100 రకాల యాంటీబయాటిక్స్‌ను కూడా తట్టుకునే సత్తాను సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) సంతరించుకున్నాయి. దీన్ని శాస్త్ర పరిభాషలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)గా వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఔషధాలు వాడటం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని కొవిడ్ మరింతగా విషమింపజేస్తోంది. కోళ్లు, పశువులు, పంటలకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం ఏఎంఆర్‌కు మరో ముఖ్యకారణం.
మానవుల్లో విచ్చలవిడిగా..
ఇక మానవుల్లోనైతే ఈ మందులను ఎడాపెడా వాడేస్తున్నారు. కొవిడ్ బారిన పడిన వారిలో 6.9 శాతం బ్యాక్టీరియా వల్ల సంక్రమించే అంటువ్యాధుల పాలబడుతున్నారు. కానీ, 72శాతం కొవిడ్ రోగుల్లో బ్యాక్టీరియల్ వ్యాధుల జాడ లేకపోయినా యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నారు. దీనివల్ల ఏఎంఆర్ మరింత విజృంభించే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోగల కొత్త యాంటీబయాటిక్స్‌పై తగినన్ని పరిశోధనలు జరగడం లేదు. కొవిడ్‌కు కారణమైన కరోనా వైరస్‌పై పోరాటానికి 550 వినూత్న చికిత్సలు, వ్యాక్సిన్ల రూపకల్పనకు శాస్త్రజ్ఞులు శ్రమిస్తుండగా- ఏఎంఆర్‌ను పట్టించుకున్నవారే లేరు. కొత్త యాంటీబయాటిక్స్ సృష్టికి కావలసిన నిధులను ప్రభుత్వాలు కేటాయించకపోవడం ఏఎంఆర్ విజృంభణకు దారితీస్తోంది.
అందువల్లే ప్రముఖ సంస్థల అనాసక్తి..
ఏఎంఆర్‌పై కొత్త తరహా యాంటీబయాటిక్స్‌ను ఆచితూచి, అదీ చివరి అస్త్రంగా వాడాల్సి ఉంటుంది. లేకపోతే, సూక్ష్మజీవులు కొత్త మందులనూ తట్టుకునే శక్తి సంపాదిస్తాయి. యాంటీబయాటిక్స్ ప్రతి భవనంలో అమర్చాల్సిన అగ్నిమాపక గ్యాస్ సిలిండర్ల వంటివి. వాటిని ఉపయోగించాల్సిన అవసరం అరుదుగానే రావచ్చు లేక ఎప్పటికీ రాకపోవచ్చు. అందువల్ల వాటిని ఆస్పత్రులకు అందించి, అవసరమైనప్పుడే ప్రయోగిస్తారు. అంటే, కొత్త యాంటీబయాటిక్స్‌కు మార్కెట్ చాలా పరిమితం. దీనివల్ల ప్రైవేటు రంగం ఈ మందుల పరిశోధన, ఆవిష్కరణలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. నోవార్టిస్, ఆస్ట్రాజెనెకా, సనోఫీ వంటి భారీ సంస్థలు యాంటీబయాటిక్ మార్కెట్ నుంచి ఎన్నడో నిష్క్రమించాయి. మెర్క్, గ్లాక్సో స్మిత్ క్లైన్, రోషే, ఫైజర్ కంపెనీలు మాత్రం పట్టువిడవకుండా పరిశోధనలు సాగిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏఎంఆర్ ప్రమాదాన్ని గుర్తించినా కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనడానికి చేస్తున్నదేమీ లేదు. చిన్నచిన్న బయోటెక్నాలజీ కంపెనీలు మాత్రమే ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. కానీ, నిధుల కొరతవల్ల గత రెండేళ్లలో కనీసం నాలుగు చిన్న కంపెనీలు దివాలా తీశాయి.
అమెరికాలో కొత్త చట్టం
ఇలాంటి పరిస్థితిలో చిన్న బయోటెక్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఫైజర్, గ్లాక్సో, జాన్సన్ అండ్ జాన్సన్, బేయర్, మెర్క్ తదితర బడా ఫార్మా కంపెనీలు ముందుకురావడం విశేష పరిణామం. ఈ ఏడాది జులైలో భారీ ఫార్మా సంస్థలు నెలకొల్పిన ఏఎంఆర్ కార్యాచరణ నిధికి తమవంతుగా నిధుల్ని ప్రకటించాయి. 2030కల్లా రెండు నుంచి నాలుగు కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనడానికి చిన్న బయోటెక్ కంపెనీలకు ఈ నిధి నుంచి ధన సహాయం చేస్తాయి. ఇతరత్రా కూడా సహాయ సహకారాలు అందిస్తాయి. అమెరికా సెనేట్ కూడా కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనే ఫార్మా కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వడానికి వీలుగా ఒక చట్టాన్ని తీసుకురానుంది. వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జీ7 సదస్సు తన వంతుగా నిధులు, ఇతర సహాయాలను ప్రకటించాల్సి ఉంది. 2050నాటికి కోటి ఏఎంఆర్ మరణాలను నివారించాలంటే, ఒక దశాబ్దంపాటు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుందని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చెబుతోంది.
వినూత్న పద్ధతుల్లో సంహారం
ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చి కొత్త యాంటీబయాటిక్స్‌ను కనిపెట్టినా, వాటినీ తట్టుకునే సత్తాను సూక్ష్మజీవులు సంతరించుకుని తీరతాయి. అందుకే మందులకు తోడు కొత్త తరహా చికిత్సా విధానాలపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో మొదట చెప్పుకోవలసింది వ్యాక్సిన్ల గురించి. నోవాడైమ్ అనే చిన్న బయోటెక్ సంస్థ ఎంఆర్‌ఎస్‌ఏ వంటి బ్యాక్టీరియాను లొంగదీసే వ్యాక్సిన్‌పై రెండో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఫైజర్ కంపెనీ ఆస్పత్రుల్లో అంటురోగాలు కలిగించే సీ డిఫ్ బ్యాక్టీరియా వ్యాక్సిన్‌పై మూడో దశ ప్రయోగాలు జరుపుతోంది. ఏదైనా అంటువ్యాధి వచ్చినప్పుడు అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ లేక ఫంగస్ వల్ల వచ్చిందా అన్నది కచ్చితంగా కనిపెడితే- అనవసరంగా యాంటీ బయాటిక్స్ వాడకుండా నివారించవచ్చు. ఈ మందులు వైరస్‌ల మీద పనిచేయవని గమనించాలి.
వైరస్ నిరోధిత బ్యాక్టీరియాలు..
కృత్రిమ మేధను ఉపయోగించి వేగంగా రోగనిర్ధారణ చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనివల్ల అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకుండా నివారించవచ్చు. కొన్ని తూర్పు ఐరోపా దేశాలు మొండి బ్యాక్టీరియాను సంహరించే వైరస్‌లను ప్రయోగిస్తున్నాయి. మున్ముందు వైరస్‌లను సైతం తట్టుకునే బ్యాక్టీరియా రావచ్చు. కాబట్టి, జన్యుమార్పులు చేసిన వైరస్‌లను ప్రయోగించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆస్పత్రి పడకల్లో, సింక్‌లలో పాగా వేసే సూక్ష్మజీవులు మందులను అడ్డుకునే రక్షణ కవచాలను తయారు చేసుకుంటాయి. బయోఫిల్మ్‌గా పిలిచే ఈ కవచాలను తొలగించే స్ప్రేను ఏక్వోర్ అనే కంపెనీ తయారు చేసింది. చిన్నపేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా మొండి బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఇలా ఏఎంఆర్‌పై రకరకాల మార్గాల్లో పోరాటం నడుస్తోంది. ప్రభుత్వాలు ఈ పరిశోధనలకు నిధులు, ఇతరత్రా సహకారం అందించడం అత్యంత ఆవశ్యకం.
- కైజర్ అడపా, రచయిత
ఇదీ చదవండి: వ్యాక్సిన్‌పై మోదీకి రాహుల్ నాలుగు ప్రశ్నలు