గడచిన వారం రోజుల్లో కోడి మాంసం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300లకు చేరుకుంది. వేసవిలో కొద్దిమేరకు ధర పెరగడం మామూలే అయినా- ఈ స్థాయి పెరుగుదల సామాన్యులను హడలెత్తిస్తోంది. నిరుడు కరోనా విజృంభించిన తరుణంలో కోడి మాంసంపై ముప్పిరిగొన్న అపోహలతో చాలామంది దాన్ని తినడం ఆపేశారు. దాంతో అప్పట్లో ధర కేజీ రూ.80-50 వరకు పడిపోయింది. చికెన్‌తో ప్రమాదమేమీ లేదని ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు ప్రచారం చేయడం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కరోనాను సమర్థంగా ఎదుర్కొనవచ్చని వైద్యులు చెబుతుండటంతో- ప్రజలు తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. అలా పెరిగిన డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్లే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నది ఒక వాదన. కోళ్ల దాణా ప్రియం కావడం, ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు భారమవ్వడంతో ఏడాది తిరిగేసరికి ధర మూడు రెట్లకు పైగా ఎగబాకింది.
పెరిగిన రవాణా ఖర్చులు
కోళ్లదాణాలో కీలకమైన సోయాకేకు ధర ఏడాది కాలంలో 80 శాతానికి పైన పెరిగింది. కొన్ని నెలల్లోనే 30-40 శాతంమేర పెరుగుదల నమోదైంది. దీంతో పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలూ ఆ మేరకు జోరెత్తాయి. సోయాబీన్‌ను నలగ్గొట్టాక వచ్చే ఈ కేకులో అధిక ప్రొటీన్లు ఉంటాయి. అందుకే కోళ్ల దాణాలో దీన్ని ఎక్కువగా వాడతారు. సోయాబీన్ నిల్వలు ప్రస్తుతం తక్కువగా ఉండటంతో కొంతమంది వ్యాపారులు రంగప్రవేశం చేసి ధరలను కృత్రిమంగా పెంచుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 'అక్టోబరు- మార్చి మధ్యలో 50 లక్షల టన్నుల సోయాబీన్‌ను నలగ్గొట్టారు. కొత్తపంట వచ్చేలోపు విపణి అవసరాల కోసం ఇంకా 25 లక్షల టన్నుల సోయాబీన్ మాత్రమే మిగిలింది. దీన్ని వ్యాపారులు అవకాశంగా మలచుకుంటున్నారు' అని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక సంచాలకులు బీవీ మెహతా అంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగానూ సోయాకేకుకు గిరాకీ ఎక్కువ ఉండటంతో మన దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ఫలితంగా స్థానికంగా నిల్వలు నిండుకుంటున్నాయి. అక్టోబరు- ఫిబ్రవరి మధ్య 14.35 లక్షల టన్నుల సోయాకేకు ఎగుమతులు జరిగినట్లు భారత సోయాబీన్ ప్రాసెసర్ల సంఘం (సోపా) గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది కిందట ఇదే సమయంలో 3.65 లక్షల టన్నుల సోయాకేకు మాత్రమే ఎగుమతి అయ్యింది. ఒకేసారి నాలుగు రెట్లు పెరిగిన ఎగుమతులతో దేశీయ అవసరాలకు కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు 30 శాతానికి పైగా ఎక్కువైనట్లు అంచనా. దాంతో ఆ మేరకు కోడి మాంసం చిల్లర ధరకూ రెక్కలు మొలిచాయి.
యాభై వేల మందికి ఉపాధి
లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా యాభై లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. రెండున్నర కోట్ల మంది రైతులకు అండగా ఉంటోంది. విపణిలో సంఘటిత రంగానికిది ఎనభై శాతం వాటా అయితే, మిగిలిన ఇరవై శాతం అసంఘటిత రంగంలోని చిన్న రైతులది. కరోనా కారణంగా ఈ రెండు రంగాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిరుడు ఫిబ్రవరి- ఏప్రిల్ మధ్యలోనే రూ.22,500 కోట్ల మేరకు పరిశ్రమ నష్టపోయినట్లు అంచనా. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సాయం చేయాలని అఖిల భారత కోళ్ల పెంపకందారుల సంఘం కేంద్రానికి నివేదించింది. సోయా విత్తనాలు, కేకులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరింది. కరోనాతో మూడు నాలుగు పెద్ద సంస్థలు తప్ప మిగిలిన పెంపకందారులందరూ ప్రభావితం కావడంతో ఉత్పత్తి కుంగింది. దీనికి తోడు వేసవి మొదలు కావడంతో ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది. వేడికి కోళ్లు తట్టుకోలేక మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. దాంతో చాలామంది రైతులు పెంపకాన్ని ఆపేస్తారు. కోడి మాంసం ధరల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులకు ఇదీ కారణమే.
దిగుమతులకు అనుమతించాలి
తక్కువ ఖర్చుతో లభించే బలవర్ధక, రుచికర ఆహారం కావడంతో మాంసాహారులందరికీ చికెన్ ప్రీతిపాత్రమైంది. పెరిగిన ధరలతో చాలామంది కొనుగోళ్లకు దూరమవుతున్నారు. అంతిమంగా ఇది మళ్ళీ పౌల్ట్రీ రైతులకే నష్టదాయకం. కాబట్టి దాణా ముడి సరకుల ధరలకు సత్వరం కళ్లెం బిగించడం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యంగా సోయాకేకు ధరలు దిగిరావాలంటే జన్యుపరంగా మార్పు చేయని సోయాబీన్ దిగుమతులకు కేంద్రం అనుమతించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. దిగుమతి సుంకాన్నీ తొలగించడంతో పాటు ఎగుమతులను తాత్కాలికంగా నిషేధించాలని అడుగుతున్నాయి. అనేక రంగాల్లో ఆటుపోట్లకు కారణమవుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడమూ అత్యావశ్యకం. పౌల్ట్రీ రంగానికి సంబంధించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికలో నిర్దేశించుకున్న మేరకు 2022-23 నాటికి 6.20 మెట్రిక్ టన్నుల కోడి మాంసం ఉత్పత్తిని సాధించాలి. తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంతగా ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఎక్కువగా ఉన్న మన దేశంలో ఆ సమస్యను అరికట్టడానికి ఇదో మార్గమని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కరోనాతో దెబ్బతిన్న పౌల్ట్రీ రంగానికి చేయూతనివ్వడం తప్పనిసరి.
- ఎన్.కె.శరణ్, రచయిత
ఇదీ చదవండి: కదులుతున్న కారులో యువతిపై పోలీస్ అత్యాచారం