ఇండియా వ్యవసాయ ప్రధాన దేశం కావడంవల్ల పశుసంపద అధికంగా ఉంటుంది. ఎడ్లు, ఆవులు, గేదెలను వ్యవసాయం, పాడికోసం; మేకలు, గొర్రెలను మాంసంకోసం పెంచుతుంటారు. అటవీయేతర గ్రామాల ప్రజలు పశుగ్రాసం కోసం (livestock grazing system) ప్రధానంగా పొలాలపై ఆధారపడతారు. అటవీ గ్రామాల ప్రజలు మాత్రం వాటిని అరణ్యాల్లోకి మేతకు తీసుకెళ్తారు. ఎడ్లు, గేదెలు, ఆవులు అడవిలో పెరిగే గడ్డిని మేస్తాయి. మేకలు వంటివి ఎక్కువగా చెట్లకు ఉండే ఆకులతోపాటు చిగుళ్లు, తీగలను సైతం భక్షిస్తాయి. దీనివల్ల పరిమిత సంఖ్యలో ఉండే వన్యప్రాణులు అత్యధికంగా (livestock grazing in public lands) ఉండే పశువులతో ఆహారాన్ని పంచుకోవలసి వస్తోంది. పశువుల ఆహారం కోసం కాపరులు చెట్ల కొమ్మలను, చిన్నచెట్లను, కొన్ని సందర్భాల్లో పెద్దచెట్లను సైతం నరుకుతారు. దీనివల్ల చెట్ల ఎదుగుదల కుంటువడుతోంది.
వన్యప్రాణులకు నష్టం
పశువుల మేతకోసం తిరుమాను, నారేపి, ఆరె, కొడిశ, తడ, చండ్ర, గొట్టి వంటి అటవీ జాతుల చెట్లను ఎక్కువగా నరుకుతారు. మేకలు ముళ్లజాతి మొదలుకొని దాదాపు అన్నిరకాల మొక్కలను తింటాయి. దీనివల్ల చాలా చెట్లు ఎదగలేవు. పశువులను నిరంతరం మేపడం వల్ల పోషక విలువలు అత్యధికంగా ఉండే కొన్ని గడ్డిజాతులు నశించే ప్రమాదం ఉంది. వాటి స్థానంలో మేతకు పనికిరాని గడ్డి, మొక్కజాతులు తామరతంపరగా పుట్టుకొస్తాయి. తరచూ అటవీ ప్రాంతాల్లో సంచరించే పశువుల కాలిగిట్టల వల్ల అడవిలోని నేల పైపొర గట్టిపడి కింద పడిన ఇతర చెట్ల విత్తనాలు మొలకెత్తలేవు. ఒకవేళ చిగురించినా ఎదుగుదల సరిగ్గా ఉండదు. గట్టిపడిన నేలలో వర్షపు నీటిని శోషించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ ప్రాంత భూగర్భ జలాలపై ఇది ప్రభావం చూపుతుంది. ఆహారం, నీటికోసం ఒకే అడవిపై ఆధారపడటంవల్ల పశుసంబంధిత వ్యాధులు వన్యప్రాణులకూ సోకుతాయి. అందుకే రక్షిత వనాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో పశువులకు అటవీశాఖ టీకాలు వేయిస్తుంటుంది.
అడవిలో ఎండిపోయిన గడ్డి తిరిగి చిగురించడానికి పశుకాపరులు దానికి నిప్పుపెడుతుంటారు. ఒక్కోసారి బీడీలు, చుట్టలు వంటివి కాల్చి నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. ఫలితంగా అడవుల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి. దీనివల్ల కానల్లో నివసించే జీవజాలానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అడవుల్లో మేతకు వెళ్లిన పశువులపై తరచూ పెద్దపులి, చిరుతపులి వంటి మాంసాహార జంతువులు దాడి చేసి చంపుతున్నాయి. ఒక్కోసారి మనుషులూ బలవుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆ మృగాలను సంహరించాలన్న డిమాండు భారీగా వినిపిస్తోంది. ఒక్కోసారి స్థానికులే వాటిని మట్టుపెడుతున్నారు. పశువులను అడవిలో మేపడంవల్ల కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీచట్టం-1967, రక్షిత అడవిలోకి (livestock grazing in protected forest) వాటిని పంపడం, మేపడం వంటివాటిని నేరాలుగా పేర్కొంది. అటవీ నష్టానికి కారణమైన పశువులను బందెలదొడ్డిలో నిర్భంధించి, యజమానికి జరిమానా సైతం విధించవచ్చు. జాతీయ అటవీ విధానం-1988 వనాల్లో పశువులను మేపడాన్ని నియంత్రించాలని, మేతపై రుసుమును సైతం వసూలు చేయాలని పేర్కొంది. చూడటానికి చిన్న విషయంగా కనిపించినా, పశువుల కారణంగా కలిగే అటవీక్షీణత తక్కువేమీ కాదు. పశువులు అతిగా మేయడంవల్ల అడవిలోని గడ్డి, ఆకులు అలముల రూపంలో ఉన్న బయోమాస్ పూర్తిగా తొలగిపోతుంది. అది కుళ్ళిపోయి తిరిగి సహజ ఎరువుగా అటవీ మృత్తికను చేరకపోవడంవల్ల నేల నిస్సారమై అడవుల ఉత్పాదకత తగ్గిపోతోంది.
రక్షణ తప్పనిసరి
తరతరాలుగా పశువులను అడవిలో మేపుతున్న ప్రజలు దాన్ని తమ హక్కుగా భావిస్తారు. పశువులు అడవిలోకి వెళ్ళకుండా చేయాలని, లేదా నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం చేయాలని అటవీశాఖ ప్రయత్నించినప్పుడు వారినుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతంలో అడవులు విస్తారంగా ఉండటం వల్ల పశువుల ద్వారా కలిగే నష్టం నుంచి అవి త్వరగా కోలుకునేవి. ప్రస్తుతం క్షీణిస్తున్న వనాలు, ఆ నష్టాన్ని భరించే స్థితిలో లేవు. నిజానికి పశువులు పరిమిత స్థాయిలో మేయడం వల్ల గడ్డిజాతి మొక్కలు అదుపులోఉండి అరణ్యాల్లో అగ్నిప్రమాదాలు తగ్గుతాయి. అధిక సంఖ్యలో పశువులు అనియంత్రితంగా వనాల్లో మేయడం వల్లే సమస్య తలెత్తుతోంది. అడవుల్లో సహజంగా పెరిగే మొక్కలను పశువుల నుంచి కాపాడవలసిన అవసరం ఉంది. పశుపోషకులకు సరైన ప్రత్యామ్నాయాలు చూపించి, జీవాలను అడవుల్లోకి తోలుకెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పంటపొలాలు, ఇంటి పెరట్లో పశుగ్రాసాన్ని పెంచేలా వారిని ప్రోత్సహించాలి. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సహకారంతో, మేలైన పశుగ్రాస వంగడాలను ఉత్పత్తి చేయాలి. వాటిని స్థానికంగా పెంచుతూ, పశువులకు ఉన్నచోటనే ఆహారం అందేలా చూడాలి. బంజరు భూముల్లో పశుగ్రాస చెట్లు, గడ్డిని పెంచవలసిన అవసరం ఉంది. అటవీ వనరుల ప్రాముఖ్యం, పశుతాకిడి వల్ల అరణ్యాలకు కలిగే నష్టాలపై అందరికీ అవగాహన కల్పించాలి. వనాలు నిత్య హరితశోభితం కావాలంటే ఈ చర్యలు తప్పనిసరి.
- ఎం.రామ్‌మోహన్ (అటవీ క్షేత్రాధికారి, ములుగు)