పార్లమెంటులో విస్తృతమైన చర్చకు తావులేని విధంగా, జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) చట్టం-1956కు 27 సవరణలను ద్రవ్య బిల్లు ద్వారా ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. పాలసీదారులపై, ప్రజలపై, ప్రభుత్వంపై వీటి ప్రభావాన్ని మదింపు చేయడం ఎంతైనా అవసరం. రాబోయే పదేళ్లలో ప్రభుత్వానికి ఏటా 10 వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో, మరో 35 వేల కోట్ల రూపాయల మేరకు పన్నుల రూపంలో చెల్లించగలిగే జీవిత బీమా సంస్థలో అనేక రకాల కారణాలవల్ల ఏర్పడిన బడ్జెట్ లోటును పూడ్చుకోవడం కోసమో లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమో- వాటాల విక్రయం చేపట్టడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు!
ఇందుకోసం సంస్థలో ప్రస్తుతమున్న వంద కోట్ల రూపాయల మూలధనాన్ని 25 వేల కోట్ల రూపాయలకు (రూ.10 విలువ కలిగిన 2,500 కోట్ల షేర్లుగా) పెంచుతున్నారు. రాబోయే అయిదేళ్లలో ప్రభుత్వం తన వాటాను 51 శాతానికి పరిమితం చేసుకోవాలనే నిబంధన సైతం ఈ సవరణల్లో ఉంది. తద్వారా, ఎల్‌ఐసీలో నిర్ణయాధికారం ప్రభుత్వం చేతి నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. ఈ మొత్తం కసరత్తు వల్ల ప్రభుత్వం సమీకరించాలనుకునే లక్ష్యం కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలు. కానీ, ఎల్‌ఐసీ ప్రభుత్వానికి ఏటా అందించే పెట్టుబడుల విలువ నాలుగు లక్షల కోట్ల రూపాయల పైమాటే. కనుకనే ఈ నిర్ణయం అనౌచిత్యంగా కనబడుతోంది.
విలువ మదింపులో సంక్లిష్టత
ఎల్‌ఐసీ నిబిడీకృత విలువను మదింపు చేసే పనిని కేంద్రం మిల్లిమన్ సంస్థకు కట్టబెట్టింది. బీమా గణకుల మదింపు ప్రకారం, సంస్థ నిబిడీకృత విలువను అంచనా వేయడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. వరసగా మూడేళ్లు లేదా ఆపైన డివిడెండ్ చెల్లించే కంపెనీల నిబిడీకృత విలువను 'డివిడెండ్ డిస్కౌంట్ మోడల్' ద్వారా లెక్కిస్తారు. దీని ప్రకారం, కంపెనీ చెల్లించే 'డివిడెండ్ వృద్ధిరేటు అంచనా' నాలుగు శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దాని విలువ అనంతం. 1988-89 నుంచి 2018-19 నాటికి ఎల్‌ఐసీ ప్రభుత్వానికి చెల్లించిన డివిడెండ్ రూ.48 కోట్ల నుంచి రూ.2,660 కోట్లకు చేరింది. అంటే సాలీనా 14.32శాతం వృద్ధి నమోదు చేసిందన్నమాట. అందుకనే దాని విలువను అనంతం అని అన్నది. ఎల్‌ఐసీ విలువ మదింపులో గమనంలో ఉంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం- సంస్థ వద్ద గల అపారమైన స్థిరాస్తి సంపద.
ఆ విశ్వాసమే మేరు పర్వతంలా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అనేక సాంఘిక సామాజిక సంక్షేమ పథకాలను ఎల్‌ఐసీకి మాత్రమే అప్పగించడంలోనే దాని విశ్వసనీయత ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రైవేటు బీమా కంపెనీలు వచ్చి రెండు దశాబ్దాలు గడిచిన తరవాత సైతం ఎల్‌ఐసీ మార్చి 2021 నాటికి పాలసీల పరంగా 75శాతం ప్రీమియం పరంగా 66 శాతం మార్కెట్ వాటాతో తన ప్రాభవాన్ని నిలుపుకొన్నదంటే- దానికి ప్రధానమైన కారణం ప్రజల్లో సంస్థ పట్ల ఉన్న నమ్మకమే. దశాబ్దాల తరబడి సంస్థ కనబరుస్తున్న వృద్ధి రేటు, క్లెయిమ్ చెల్లింపు పద్ధతులు, పాలసీదారులకు, ప్రభుత్వాలకు చెల్లిస్తున్న బోనస్‌లు, డివిడెండ్లు... ఇటువంటి ఎన్నో కారణాల వల్ల ప్రజల్లో జీవిత బీమా సంస్థ పట్ల విశ్వాసం మేరుపర్వతంలా పెరిగింది. దీన్ని మదింపు చేయగల శాస్త్రీయమైన విధానమేదీ ప్రస్తుతం లేదు!
ఇదీ చదవండి: 'ఎల్‌ఐసీ వాటాలు విక్రయించాల్సిన అవసరమేముంది?'
ఆస్తులు అపారం
జీవిత బీమా సంస్థ 2020 మార్చి నాటికి 32 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో అలరారుతోంది. నిజానికి ఈ ఆస్తులు ఎల్‌ఐసీవి కావు. ప్రభుత్వానివి అంతకన్నా కావు. ప్రభుత్వానిది కేవలం వంద కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే! ఈ ఆస్తులు ఎల్‌ఐసీ గడించే మిగులులో పాలుపంచుకునే అధికారం కలిగిన ‘విత్ ప్రాఫిట్’ పాలసీదారులవి. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం నిల్వ ఉంచిన అపారమైన సాల్వెన్సీ మార్జిన్ నిధులు సైతం, ఈ పాలసీదారులవే. ఎల్‌ఐసీ చట్టం 1956 సెక్షన్ 28 ప్రకారం పన్నులు పోనూ సంస్థ గడించే మిగులులో 95శాతం ప్రథమ హక్కు విత్ ప్రాఫిట్ పాలసీదారులది. వాళ్ల తరవాతే మిగిలిన అయిదు శాతం ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో దక్కుతుంది. ప్రభుత్వంతో సహా ఈ పాలసీదారులందరూ ఎల్‌ఐసీలో వాటాదారులే. ఇటువంటి ప్రత్యేకమైన చట్టం ప్రపంచంలో ఏ బీమా కంపెనీకీ లేదు!
ప్రజా నిరసనలు ప్రభుత్వానికి తాకితేనే..
సంస్థలో మిగులు పంపిణీ విధానం 2012లో ఐఆర్‌డీఏ సవరణల ప్రకారం పాలసీదారులు, ప్రభుత్వం మధ్య 90:10గా మార్చినా- ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రం 95:5 విధానాన్నే కొనసాగిస్తోంది. కానీ ఒకసారి వాటాల విక్రయం జరిగాక, కొత్తగా వచ్చే మదుపరులు ఈ విధానాన్ని కొనసాగిస్తారనే నమ్మకం ఏ మాత్రం లేదు. అదే జరిగితే.. పాలసీదారులకు బోనస్ తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి వచ్చే డివిడెండ్ సైతం తగ్గిపోతుంది. సుదీర్ఘ కాలానికి ప్రభుత్వానికి నిధులను సమకూర్చే వెసులుబాటు సైతం పెనుమార్పులకు లోనై, ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల లోటు ఏర్పడుతుంది. బిందువులన్నీ కలిసి సింధువులా మారినట్టు- చిన్నతరహా పొదుపులన్నింటిని జమచేసి దేశాభివృద్ధికి కావాల్సిన అత్యంత విలువైన భారీ పెట్టుబడులను కారుచౌకగా అందిస్తున్న ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించే నిర్ణయంపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరు, మధ్యతరగతి ఉద్యోగుల నిరసనల ఫలితంగా, పీఎఫ్ జమల వడ్డీపై ఆదాయపు పన్నును ఏడాదికి అయిదు లక్షల రూపాయల వరకు పెంచవలసి వచ్చింది. ఎల్‌ఐసీలో వాటాల విక్రయం విషయంలో ప్రజానిరసనల సెగలు దిల్లీని తాకగలిగితే- ప్రభుత్వ పునరాలోచనకు అవకాశం ఉంది.
విశ్వసనీయతకు మారుపేరు
ఎల్‌ఐసీ విలువ మదింపులో లెక్కించవలసిన ప్రధానమైన అంశం గుడ్‌విల్, బ్రాండ్ వాల్యూ. 1994లో ఎల్‌ఐసీ పనితీరుపై ప్రభుత్వం నియమించిన మల్హోత్రా కమిటీ చేపట్టిన సర్వేలో పాలుపంచుకున్న వారిలో 95శాతం ఎల్‌ఐసీ చిహ్నాన్ని వెంటనే గుర్తు పట్టారు. ఇది 27 సంవత్సరాల కిందటి మాట. తాజాగా లండన్ కేంద్రంగా పనిచేసే ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2021లో ప్రపంచ బీమా సంస్థల్లో మూడో బలీయమైన సంస్థగా, అత్యంత విలువైన బీమా బ్రాండ్‌లలో పదో కంపెనీగా ఎల్‌ఐసీ నిలిచింది. నిరుడు ప్రపంచంలోని అత్యుత్తమ వంద బీమా బ్రాండ్ల విలువ ఆరుశాతం తగ్గగా, జీవిత బీమా సంస్థ విలువ మాత్రం 6.8శాతం వృద్ధి నమోదు చేయడం విశేషమని ఈ నివేదిక పేర్కొంది. ‘టైమ్స్ నౌ’ ఏటా నిర్వహించే ‘బ్రాండ్ ఈక్విటీ’ సర్వేలో గడిచిన దశాబ్దకాలంగా ఎల్‌ఐసీ ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతోంది. ఇంతటి బ్రాండ్ వాల్యూ కలిగిన సంస్థ విలువను మదింపు చేయడమన్నది, సాహసంతో కూడుకున్న పని.
- తూము శారద, రచయిత
ఇదీ చదవండి: ఎల్‌ఐసీ పని దినాలు ఇక వారంలో ఐదే!