ETV Bharat / opinion

కరోనాతో ఉద్యోగ ఆశలు అడియాసలే! - ప్రాంగణ నియామకాలపై కొవిడ్‌ ప్రభావం

ప్రాంగణ నియామకాలపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. మహమ్మారి కారణంగా అనేక ప్రైవేట్‌ బహుళ జాతి సంస్థలు ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉంటున్నాయి. సాధారణ నియామకాలు తగ్గిపోవడం వల్ల విద్యార్థుల్లో ఉద్యోగ భద్రత కొరవడింది.

covid effect on campus placement
ఉద్యోగ నియామకాలపై కరోనా ప్రభావం
author img

By

Published : Jun 3, 2021, 8:07 AM IST

వృత్తి విద్యాసంస్థల్లో జరిగే ప్రాంగణ నియామకాలు గత అయిదేళ్లుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2015-16లో 16.38 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా అందుకోగా, కేవలం 43 శాతానికే ఉద్యోగ అవకాశాలు లభించాయి. 2019-20లో 15.20 లక్షల మంది ఉత్తీర్ణులవగా 47.5 శాతమే ఉద్యోగాలు పొందగలిగారు. భారత సాంకేతిక విద్యా మండలి గణాంకాల ప్రకారం గత అయిదేళ్లలో 79.92 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా కేవలం 46.5 శాతమే ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరగక పోవడానికి ఎన్నో కారణాలు తోడవుతున్నా... గత ఏడాది కాలంగా ప్రాంగణ నియామకాలపై కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నత శ్రేణి విద్యా సంస్థల్లో చదివిన వేల మంది విద్యార్థులు కొవిడ్‌ కారణంగా ప్రాంగణ నియామకాలు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఈ ఏడాది కూడా ప్రాంగణ నియామకాలపై నీలినీడలు కమ్ముకోవడం వల్ల ఎంతోమంది ఆశావహులకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొరవడిన ఉద్యోగ భద్రత..
మహమ్మారి కారణంగా అనేక ప్రైవేట్‌ బహుళ జాతి సంస్థలు ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుగా ప్రాంగణ నియామకాల కోసం విద్యాసంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు సుమారు 60 శాతం మేర కార్పొరేట్‌ సంస్థలు ప్రకటించాయి. అదే బాటలో మరికొన్ని సంస్థలు నియామక ప్రణాళికలు, విద్యార్థులకు ఇచ్చిన ముందస్తు ఆఫర్ల రద్దు సందేశాలు పంపించాయి. మరోవైపు ఐఐఎంలతోపాటు ప్రముఖ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లను ఉబర్‌ సంస్థ రద్దు చేసింది. పేరొందిన విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక సగటు విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ భద్రత దొరకడం కష్టతరమేనని అర్థమవుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్ర సేవల సంస్థ ష్లంబర్గర్‌- కొవిడ్‌ కారణంగా ఇకపై ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగ అవకాశాల కల్పనను ఉపసంహరించుకుంటున్నట్లు దేశంలోని పలు ఉన్నత శ్రేణి సాంకేతిక విద్యాసంస్థలకు తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా దేశంలో పేరొందిన అనేక విద్యాసంస్థలు తమ విద్యార్థులకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి. ప్రాంగణ నియామకాలు భారీగా జరగకపోతే విద్యాసంస్థల మనుగడకే ఇబ్బందులు తప్పవు. వేలమంది విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించినా, కొవిడ్‌ వ్యాప్తి కారణంగా నియామక పత్రాలు అందుకోలేక పోయారు.

భవిష్యత్తు అంధకారం..

అందివచ్చిన అవకాశం చేతికందక, మరో ఉద్యోగం లభించక విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి పరిణామాలు నెలకొన్నందువల్ల విద్యా సంస్థల అధికారులు పలు బహుళజాతి సంస్థల అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరొందిన విద్యాసంస్థల్లో నిబంధనల ప్రకారం ఒక విద్యార్థికి ఒకసారి మాత్రమే ప్రాంగణ నియామకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎంపికైన తరువాత అదే సమయంలో మరొక సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోరాదు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థలు ఉద్యోగాలను రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది.
చొరవ చూపాలి..

మరోవైపు సాధారణ నియామక ప్రక్రియలపైనా కొవిడ్‌ ప్రభావం ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ సంస్థ నియామకాల్లో దాదాపు 46 శాతం తగ్గుదల కనిపించడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితిలో అనేకమంది విద్యార్థులు మధ్యవర్తులపై ఆధారపడుతున్నారు. అడిగినంత సొమ్ములు ముట్టజెప్తున్నా వారి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. 'రుమాని అరోరా, ఎలెట్స్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌' సంయుక్త అధ్యయనం ప్రకారం- ఏటా సుమారు 82 శాతం విద్యాసంస్థల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతుండగా, ఏడాది కాలంగా మాత్రం విద్యాసంస్థల్లో అలాంటి సందడి లేక బోసిపోతున్నాయి. ప్రధానంగా ఇంటర్న్‌షిప్‌ చేసే విద్యార్థులకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంటర్న్‌షిప్‌ సజావుగా పూర్తయితేనే, దాని ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక అవుతుంటారు. ఈ ఏడాది విద్యార్థులకు అలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికావస్తున్నా, ప్రాంగణ నియామకాలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాలు చొరవచూపాలి. సాంకేతిక దిగ్గజ సంస్థలతో సంప్రదించి ఉద్యోగ నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల యాజమాన్యాలూ తమ వంతు బాధ్యతగా నియామకాల ప్రక్రియ కొనసాగేలా చొరవ చూపాలి. పూర్వ విద్యార్థుల సహకారంతో ఉద్యోగ కల్పన జరిగేలా ప్రయత్నం చేయాలి. అన్ని వర్గాలూ విద్యార్థులకు అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలి.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ (రచయిత- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.