మానవ జీవనానికి, మనుగడకు అవసరమైన శక్తి సామర్థ్యాలను అందించేది ఆహారమే. ప్రపంచం మనుగడను సాగించడంలో ఆహార వ్యవస్థల పాత్ర వెలకట్టలేనిది. ఆహార వ్యవస్థలో పంట పండించడం, దిగుబడి, కోత, శుద్ధి, ఉత్పత్తి, పంపిణీ తదితర ప్రక్రియలన్నీ ఉంటాయి. 2020 సంవత్సరంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా, ప్రజల్ని తీవ్రస్థాయి భయాందోళనలు చుట్టుముట్టాయి. నిత్యావసర వస్తువుల కోసం కిలోమీటర్ల పొడవునా బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో సరైన ఆహారం లభించక మానవ జీవితం అతలాకుతలం కావడం అందరికీ అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే. ఆహార వ్యవస్థ ప్రక్రియ మానవ నిత్య జీవితంలో ఎంత ముఖ్యమైనదో, తేడా వస్తే, ఎంత అసమతౌల్యానికి దారితీస్తుందో అందరికీ అర్థమైంది. కాబట్టి, ఎలాంటి విపత్తులనెనా ఎదుర్కొనేలా వ్యవసాయ-ఆహార పరిశ్రమల వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
విపత్కర పరిస్థితులు
కరోనా మూలంగా ఈ ఏడాది మన దేశంలో నిరుటికంటే విపత్కర పరిస్ధితులు నెలకొన్నాయి. ఆహార సరఫరా గొలుసు వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. వలస కూలీలు, కార్మికులను పలు రాష్ట్రాలు నిలిపి వేయడం, శ్రామికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం, అనారోగ్య సమస్యలకు గురవడం, కూలీల లభ్యత తగ్గడం.. వీటన్నింటి ప్రభావం ఆహార పంటలపై పడింది. సకాలంలో ఉత్పత్తి చేయలేకపోవడం, అందుబాటులో ఉన్న ఆహార ఉత్పత్తులను కూడా సక్రమంగా సరఫరా చేయలేక పోవడం సర్వసాధారణ సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితులన్నీ ఆహార కొరతకు దారి తీశాయి. ఫలితంగా, చాలామంది ఆకలితో అలమటించారు.
ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం తదితర సంస్థల అంచనా ప్రకారం- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆకలి, కరోనాను మించిన సమస్యగా రెట్టింపు తీవ్రతతో వ్యాప్తి చెందే ప్రమాదం నెలకొంది. 'ఆహార భద్రత పోషకాహారం' నివేదిక ప్రకారం- ప్రపంచ ఆహార వ్యవస్థల్లో అవకతవకలు, అసమానతల ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో క్షుద్బాధకు గురయ్యారు. ప్రపంచ జనాభాలో మూడోవంతు మందిలో అవసరమైన పోషకాలు లేవు. అదే సమయంలో, సమతుల ఆహార లోపంవల్ల 60 కోట్ల మంది ఊబకాయంతో, 20 కోట్ల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. వీరికి మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులబారిన పడే ప్రమాదం అధికంగా పొంచి ఉంది.
మితిమీరిన రసాయనాల వినియోగం, నిరంతరం ఒకే తరహా పంటలు సాగు చేయడం, పర్యావరణం దెబ్బతినడం తదితర కారణాలతో ప్రకృతి వనరులు వేగంగా క్షీణిస్తున్నాయి. ఫలితంగా- సహజ ఆహార ఉత్పత్తుల దిగుబడి తగ్గడం, రసాయనికంగా ప్రభావితమైన పంటలు తినడానికి కూడా వీలులేని విధంగా తయారై, పలురకాల వ్యాధులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహార భద్రత, పోషకాహారం శాస్త్రీయ పరిశోధనల ప్రకారం- పరిమిత ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో పారిశ్రామిక కార్యకలాపాలు, జంతువుల పెంపకం చేపట్టడం వంటివి 2009లో స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధి ప్రబలడానికి కారణమైనట్లు తేలింది.
చిత్తశుద్ధే కీలకం
బ్యాక్టీరియా కారణంగా 1720లో ఫ్రాన్స్‌లో ప్లేగు, 1820లో ఆసియా, ఐరోపాల్లో కలరా, వైరస్ వ్యాప్తి కారణంగా 1920లో స్పానిష్ ఫ్లూ ఎంతోమందిని పొట్టన పెట్టుకోగా- ప్రస్తుతం, కరోనా వైరస్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మృత్యువాత పడటం వల్ల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్నారు. అందువల్ల ఆహార ఉత్పత్తి వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందన్న సంగతి అందరూ గుర్తించాలి. ఆహార వ్యవస్థలు- మనుషుల్ల్లో పోషకాహార లోపాలను సరిదిద్దడం, రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేయడం, పర్యావరణ పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటిని విస్మరిస్తే, ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థలపైనా పోను పోను తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. కొవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించే క్రమంలో ముఖ్యంగా ఆహార వ్యవస్థలను అన్నిరకాల ఆటుపోట్లనూ తట్టుకొనేలా సంరక్షించాలి. దీనికోసం స్థిరమైన ఆహార పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యకరమైన పోషకాహారం, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వనరుల పరిమిత వినియోగం, సుస్థిర పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహనను కల్పించాలి. ఇలాంటి అంశాలకు సంబంధించి అధికార యంత్రాంగాలు చిత్తశుద్ధి కనబరచేలా ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి!
-ఆచార్య నందిపాటి సుబ్బారావు (ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
ఇవీ చూడండి : 'కేసులు తగ్గినా.. మిగతా 98 శాతం మందికీ ముప్పే!'