ETV Bharat / opinion

Covid-19: నిర్లక్ష్యంతో మూడో దశ అనివార్యం!

కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోక మునుపే ముందుజాగ్రత్తల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గిపోతున్నాయంటూ పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. జనం సైతం మామూలుగా బయటికి వస్తూ.. గుంపులుగా తిరిగేస్తున్నారు. వైరస్​ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలేమో ఏమీ పట్టనట్టు వేడుక చూస్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్​ మూడో దశ అనివార్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

COVID-19 Third wave
కరోనా మూడో దశ
author img

By

Published : Jul 14, 2021, 7:50 AM IST

కోట్లాది కుటుంబాల్లో నిప్పులు పోసిన మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోక మునుపే ముందుజాగ్రత్తలకు మంగళం పాడేస్తూ వీధుల్లో ప్రజా సమూహాలు స్వేచ్ఛావిహారం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలేమో నిర్లిప్త వైఖరులతో వేడుక చూస్తున్నాయి. ఆంక్షల తొలగింపుతో అటకెక్కుతున్న కొవిడ్‌ మార్గదర్శకాలతో మూడో ఉద్ధృతి ముంచుకు రావడం తథ్యమని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) హెచ్చరించింది. పర్వత ప్రాంతాలకు పోటెత్తుతున్న పర్యాటకులు, మత కార్యక్రమాల సందర్భంగా భక్తుల నియంత్రణలో ఏలికల ఏమరుపాటు ప్రజావళికి ప్రాణాంతకమని పేర్కొంది.

క్షేత్రస్థాయిలో కట్టుదాటుతున్న పరిస్థితిపై తాజాగా ఆందోళన వ్యక్తంచేసిన ప్రధాని మోదీ- నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొవిడ్‌ మూడో దుర్దశను నివారించడానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ భేటీలో ఆయన ఉద్బోధించారు. క్రితం మాసంతో పోలిస్తే ఈ నెలలో దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం నీరసించిపోయిందన్నది చేదు నిజం! సగటున 62 లక్షల డోసులను పంపిణీ చేసిన రోజుల నుంచి నేడు 35-40 లక్షల డోసులతో సరిపుచ్చుతుండటమే ఆందోళనకరం. వచ్చే మూడు నెలల్లో 10శాతం జనాభాకు, సంవత్సరాంతాని కల్లా 40శాతానికి టీకాలందితేనే ఏ దేశమైనా మహమ్మారి కోరల్లోంచి బయటపడగలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

టీకాల కొరత

వ్యాక్సినేషన్‌ ఆరంభించి ఆర్నెల్లు అవుతున్నా- భారత్‌ మాత్రం తన జనావళిలో 7.7శాతానికే రెండు డోసుల టీకాలు అందించగలిగింది! దేశీయుల్లో దాదాపు సగం మందికి టీకా రక్షణ కల్పించిన అమెరికా, యూకేలకు భిన్నంగా వ్యాక్సిన్ల కొరతతో ఇండియా ఈసురోమంటోంది. గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఈ దుస్థితిపై ఇప్పటికే గళమెత్తాయి. టీకాల లేమితో ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటివి జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను ఆపేస్తున్నాయి. జనసంఖ్యలో ముందున్న 15 రాష్ట్రాల్లో టీకా కార్యక్రమం ఒక కొలిక్కి రావాలంటే 19 నెలల సమయం పడుతుందంటున్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మందంటూ లేని మహమ్మారిపై టీకాయే సుదర్శన చక్రమైన వేళ- యావద్భారతాన్ని సత్వరం ఆ రక్షణ ఛత్రంలోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వాలు తమ ప్రణాళికలను పునస్సమీక్షించుకోవాలి!

ప్రాణాలతో చెలగాటమే!

రోజువారీ కేసుల్లో 76శాతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, ఒడిశాల్లోనే వెలుగు చూస్తుంటే- పది శాతానికి మించిన పాజిటివిటీ రేటుతో దేశవ్యాప్తంగా 58 జిల్లాలు అల్లాడుతున్నాయి. పరీక్షల సంఖ్యను తెగ్గోసిన రాష్ట్రాలేమో కేసుల కొండలు కరిగిపోయాయంటూ ఆంక్షలను ఎత్తేస్తున్నాయి. నైనిటాల్‌, కులు మనాలీ వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు ఎక్కడికక్కడ కొవిడ్‌ మార్గదర్శకాలకు తిలోదకాలిస్తున్న గుంపులతో విపణి వీధులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆంక్షల తొలగింపు తరవాత రాష్ట్రాలకు అతీతంగా జోరెత్తుతున్న సామూహిక కార్యక్రమాల్లో నిబంధనలన్నీ నీటిపై రాతలవుతున్నాయి.

వందకు పైగా దేశాలను చుట్టుముట్టిన డెల్టా ఉత్పరివర్తనానికి తోడు కొత్త రకాల ఆనవాళ్లూ బయటపడుతున్న తరుణంలో ప్రాణాలతో చెలగాటమాడే ఈ నిర్లక్ష్యం అవాంఛనీయం! కొవిడ్‌ కట్టడిలో ముందుజాగ్రత్తలే కీలకమన్న స్వీయ చైతన్యమే యావత్‌ జాతికీ శ్రేయస్కరం. ప్రజారోగ్యానికి ప్రమాదకరమైన ప్రవర్తన కూడదంటూ ప్రతి ఒక్కరూ కనీసం ఇద్దరికి చేతనా సందేశాన్ని అందించడం నేడు అత్యవసరం. వ్యాక్సినేషన్‌లో పొటమరిస్తున్న లింగ దుర్విచక్షణకు అడ్డుకట్ట వేసేలా మహిళలకు టీకాల అందజేతపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిసారించాలి. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కన్నీటి కాష్ఠాలను రాజేసిన కరోనాకు మరెవరూ బలికాకూడదన్న సంకల్ప దీక్షతో పకడ్బందీ కార్యాచరణను పట్టాలెక్కించాలి!

ఇదీ చూడండి: ఆ విషయంలో సీఎంతో విభేదించిన ఉపముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.