ETV Bharat / opinion

విశ్వసనీయ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపులు! - Coronavirus vaccine new updates

ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్​ కోరలు తుంచే సరైన విరుగుడు కోసం మానవాళి ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూస్తోంది. విశ్వసనీయ వ్యాక్సిన్ రావాలంటే కాస్త సమయం పడుతుందనేది వాస్తవం.​ ఈ తరుణంలో ప్రపంచదేశాల్లో వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్ల తయారీపై నిపుణులు ఏమంటున్నారు.

Countries of the world waiting for a reliable vaccine
విశ్వసనీయ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపులు!
author img

By

Published : Sep 14, 2020, 7:04 AM IST

దేశంలో అరకోటికి, విశ్వవ్యాప్తంగా మూడు కోట్లకు చేరువవుతున్న కొవిడ్‌ కేసులు- పట్టపగ్గాలు లేని మహమ్మారి విజృంభణ తీవ్రతను చాటుతున్నాయి. కరోనా వైరస్‌ కోరలు తుంచే సరైన విరుగుడు కోసం దేశదేశాల్లో 140కి పైగా సాగుతున్న ప్రయోగాల సాఫల్యం కోసం మానవాళి ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తోంది. రెండు దశలు దాటి అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కసరత్తుకు ఇటీవల అనూహ్య పరిణామంతో అవరోధం ఏర్పడింది. యూకే ఔషధ దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ వేయించుకున్న ఒక వాలంటీర్‌లో నరాల సమస్య తలెత్తిన దరిమిలా మూడో దశ ప్రయోగాల్ని తాత్కాలికంగా నిలిపేసి, హుటాహుటిన స్వతంత్ర భద్రతా సమీక్షా సంఘం పరిశీలన తరవాత పునరుద్ధరించారు.

అంత సులభం కాదు!

వ్యాక్సిన్‌ సురక్షితమా కాదా, కచ్చితంగా రోగనిరోధానికి పనికొస్తుందా లేదా అన్న కీలకాంశాల్ని నిగ్గుతేల్చడానికి పలు అంచెల్లో విస్తృతంగా సాగించే పరిశోధనల్లో ప్రతిదశలోనూ నెగ్గుకురావడమే దాని సాఫల్యానికి గీటురాయి. ఎన్నో సంక్లిష్టతల దృష్ట్యా, కరోనా మీద పైచేయి సాధించేలా వ్యాక్సిన్‌ రూపకల్పన ఏమంత సులభతరం కాదని పలువురు శాస్త్రవేత్తలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. తమ దేశ వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగశాలలపై చైనా హ్యాకింగ్‌కు పాల్పడుతోందన్న శ్వేతసౌధాధిపతి ట్రంప్‌ ఆరోపణ, పూర్తిస్థాయి అనుమతులు రాకముందే స్వచ్ఛందంగా ఆరోగ్య కార్యకర్తలు టీకా పొందవచ్చునన్న బీజింగ్‌ హడావుడి ప్రకటన, మూడో దశ ఊసెత్తకుండానే సామూహిక వ్యాక్సినేషన్‌కు రష్యా సన్నాహాలు... ప్రాణాధారం కావాల్సిన సంజీవనిపై అనేకానేక సందేహాలు లేవనెత్తాయి. మూడో దశ ప్రయోగాలూ పూర్తయ్యాకే వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగానికి తీసుకువచ్చే ప్రక్రియ పరిపూర్తికి 12-18 నెలల వ్యవధి అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం మొదట్లో వ్యాక్సిన్‌ను అందరికీ చేరువ చేస్తామంటున్న ఆస్ట్రాజెనెకా తాజా వివరణా, అనర్థదాయకమైన తొందరపాటుతనాన్నే సూచిస్తోంది.

అప్రమత్తత అవసరం..!

అరవై దశకంలో గవద బిళ్లల చికిత్సకు ఉద్దేశించిన వ్యాక్సిన్‌ నాలుగేళ్లపాటు విస్తృత పరీక్షల తరవాత తుది అనుమతులు పొందింది. రకరకాల ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే అది చాలా త్వరితంగా పూర్తయినట్లు చెబుతారు. హెచ్‌ఐవీ నియంత్రణకు లక్షించిన వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వాస్తవాలను గుర్తెరిగీ, ఆగస్ట్‌ 15లోగా కొవిడ్‌కు భారతీయ టీకా ఆవిష్కృతం కావాలంటూ అవాస్తవిక గడువు నిర్దేశించి విమర్శలపాలైన ఐసీఎమ్‌ఆర్‌- త్వరితగతిన పరీక్షల దశను పూర్తి కావించాలన్న ఉద్దేశంతోనే అలా హడావుడి పెట్టినట్లు, తరవాత మాట మార్చింది. వ్యాక్సిన్ల విషయంలో ప్రతి ఘట్టంలోనూ అత్యంత అప్రమత్తంగా జాగరూకతతో వ్యవహరించాల్సిందే.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా అభివృద్ధిచేసిన ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌ ప్రమాదవశాత్తు హెపటైటిస్‌-బితో విషకలుషితమై ఎందరో సైనికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరణాలూ సంభవించాయి. పోలియో టీకా ప్రయోగాల తొలినాళ్లలో తగిన జాగ్రత్తలు కరవై వేలమంది వైరస్‌ బాధితులుగా మిగిలారు. మహా సంక్షోభకారిగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా అక్టోబరు తొలివారానికల్లా దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 70లక్షలకు పైబడుతుందన్నది 'బిట్స్‌ పిలానీ' అంచనా. వైరస్‌ సోకి రోగలక్షణాలు బయటపడకుండానే ఉద్ధృతి తగ్గిన లక్షల మందిలో యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్‌ మారుదాడులు జోరెత్తి తరతమ భేదాలతో ఎన్నో ప్రపంచ దేశాలు భీతావహమవుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సిన్‌ సామర్థ్యంపై సంపూర్ణ భరోసా కలిగేంతవరకు ప్రయోగ సంస్థలు, ప్రభుత్వాలు సంయమనం వహించడం ఉత్తమం. విరుగుడు పేరిట ప్రయోగం వికటిస్తే తట్టుకొనేశక్తి మానవాళికిప్పుడు లేదన్నది నిష్ఠురసత్యం!

ఇదీ చూడండి: హైపర్ ‌సోనిక్‌ సాంకేతికతతో గగనసీమలోనూ స్వావలంబన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.