ETV Bharat / opinion

రోడ్డు నిర్మాణంలో అంతటా అవినీతి 'గోతులు'! - రోడ్డు నిర్మాణం

ఇటీవలి వర్షాలకు హైదరాబాద్‌-విజయవాడ, విశాఖ-విజయవాడ ప్రధాన రహదారులతోపాటు కొచ్చి, ముంబై, ఉధంపూర్‌, కోల్‌కతా వంటిచోట్లా దిగజారిన రోడ్ల దుస్థితి దేశవ్యాప్త అవ్యవస్థకు దర్పణం పడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విశ్లేషించిన పార్లమెంటరీ స్థాయీసంఘం అయిదు నెలల కిందట కొన్ని నికార్సయిన నిజాలు బయటపెట్టింది. ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు నాసిరకంగా అఘోరిస్తున్నాయని ఆక్షేపించిన కమిటీ- టెండర్లు దక్కించుకోవడానికి గుత్తేదారులు ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధర కోట్‌ చేస్తున్నట్లు నిర్ధారించింది.

Corruptions in Road construction resulted in bad roads across the country
రోడ్డు నిర్మాణంలో అంతటా అవినీతి 'గోతులు'!
author img

By

Published : Aug 30, 2020, 5:55 AM IST

భారత రాజ్యాంగం పౌరులందరికీ దఖలుపరచిన జీవనహక్కు నడివీధిలోనే కొల్లబోతోంది. అడ్డూఆపూ లేని రోడ్డు మాఫియా దురాగతాల పర్యవసానంగా- కొత్తగా వేసిన రహదారులూ రెండుమూడు నెలలైనా గడవకుండానే గుంతలమయమై వాహనదారులకు, పాదచారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు హైదరాబాద్‌-విజయవాడ, విశాఖ-విజయవాడ ప్రధాన రహదారులతోపాటు కొచ్చి, ముంబై, ఉధంపూర్‌, కోల్‌కతా వంటిచోట్లా దిగజారిన రోడ్ల దుస్థితి దేశవ్యాప్త అవ్యవస్థకు దర్పణం పడుతోంది. గట్టి వర్షం కురవగానే రోడ్లు గుంతలమయమై, కొన్నిచోట్ల సాంతం కొట్టుకుపోయే సిగ్గుమాలిన దురవస్థకు మూలాలు ఎక్కడున్నాయో మీరే పరికించండి...

భారత్‌ మాలా పరియోజన, ప్రధానమంత్రి గ్రామ్‌సడక్‌ యోజనలంటూ కొన్నాళ్లుగా కేంద్రం సందడి చేస్తోంది. ఈ ఏడాదే నాలుగున్నర వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం నిమిత్తం రూ.50వేల కోట్లదాకా వ్యయం చేయనున్నట్లు ఏడు నెలలక్రితం కేంద్రప్రభుత్వం వెల్లడించింది. గతవారమే కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఘనమైన ప్రకటన చేశారు. రెండేళ్లలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలను తలదన్నేలా దేశీయ రహదారుల్ని తీర్చిదిద్దుతామన్న అమాత్యులు- సుమారు మూడు లక్షలకోట్ల రూపాయల ఖర్చుతో ఏడున్నర వేల కిలోమీటర్ల రోడ్లను అద్భుతంగా ఆవిష్కరిస్తామంటున్నారు. మొన్నీమధ్యే ఐఐటీ-బీహెచ్‌యూ (బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)తో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొంది. దేశంలో నాణ్యమైన, దీర్ఘకాలం మన్నిక ఉండే రహదారుల నిర్మాణమే ఆ ఒడంబడిక లక్ష్యం! అటువంటి ఏర్పాట్లు లేకున్నా- వేలకోట్ల రూపాయల ఖర్చుతో వేసిన రోడ్లు కొన్నేళ్లపాటు నమ్మకంగా వినియోగపడాలి కదా! వాస్తవంలో, దేశంలో ఎక్కడైనా అలా జరుగుతోందా? క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విశ్లేషించిన పార్లమెంటరీ స్థాయీసంఘం అయిదు నెలల కిందట కొన్ని నికార్సయిన నిజాలు బయటపెట్టింది. ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు నాసిరకంగా అఘోరిస్తున్నాయని ఆక్షేపించిన కమిటీ- టెండర్లు దక్కించుకోవడానికి గుత్తేదారులు ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధర కోట్‌ చేస్తున్నట్లు నిర్ధారించింది. అలా ప్రాజెక్టును చేజిక్కించుకున్నాక- ఆనవాయితీగా వాటాలు తెగుతున్నాయి. అవినీతి అధికారుల చేతులు తడిపి, ఇతరత్రా విభాగాలకు మేపి, సొంతానికి కొంత బిగపట్టి తక్కిన మొత్తాన్నే వెచ్చిస్తుండటంతో... సహజంగానే, నాణ్యత గంగలో కలుస్తోంది. లంచాలు మరిగిన అధికార సిబ్బందికి గుత్తేదారులకు మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని దెబ్బతీసేలా కనీస టెండర్ల మొత్తాలు నిర్ణయించాలన్నది స్థాయీసంఘం సిఫార్సు. ఆపై కొన్ని వారాల వ్యవధిలోనే, రహదారి వ్యయాల్ని 25 శాతం దాకా తగ్గించాలని కేంద్రమంత్రి గడ్కరీ పిలుపిచ్చారు. వాస్తవిక వ్యయాలన్నీ పరిగణించి మన్నికైన రోడ్డు నిర్మాణానికి కనీసం ఎంత ఖర్చవుతుందన్న ముఖ్యాంశాన్ని గాలికొదిలేసి, బాగా తక్కువ ధర కోట్‌ చేసినవాళ్లకే గుత్తేదారులుగా కిరీటం తొడుగుతున్నారు. అక్కడే నాసిరకం పనులకు, వాటిని కప్పిపుచ్చడంలో భాగంగా అవినీతి మేతకు బీజాలు పడుతున్నాయి!

ఇటీవలి వర్షాలూ వరదల ధాటికి రూపురేఖలు మారిపోయిన రోడ్లకు రూ.86కోట్లతో సత్వర మరమ్మతు పనులు చేపట్టాలని సంకల్పించిన గుజరాత్‌ రాష్ట్రప్రభుత్వం- నాణ్యతా ప్రమాణాల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలికలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలవారీగా పరికిస్తే రహదార్లపై పెద్ద పద్దే లెక్క తేలుతుంది. గత ఆరేళ్లుగా ఒక్క తెలంగాణలోనే దాదాపు అయిదున్నర వేల కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులకు ఏడున్నరవేల కోట్ల రూపాయల దాకా వెచ్చించారని అంచనా. ఇలా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున చేస్తున్న ఖర్చుకు తగిన ఫలితం రహదారుల స్థితిగతుల్లో ప్రతిఫలిస్తోందా? దేశమంతటా దశాబ్దాలుగా రోడ్లు వేస్తున్నారు. మరమ్మతులు చేస్తున్నారు. వానలకవి ఛిద్రమవుతూనే ఉన్నాయి. రోడ్లపై గుంతలే రోజుకు సగటున పదిమందిని పొట్టన పెట్టుకుంటున్న దేశం మనది. వాహనాలు అదుపు తప్పి ఏటా లక్షన్నర మందికిపైగా రాదారి ప్రమాదాల్లో కడతేరిపోతున్నారీ గడ్డమీద. ఒక్క ముక్కలో- రోడ్ల డిజైనింగ్‌, నిర్మాణంలో అవకతవకలు, పర్యవేక్షణలో లోటుపాట్లకు జనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రహదారి రంగ ముఖచిత్రాన్ని మార్చేందుకు కట్టుబాటు చాటుతూ మోదీ ప్రభుత్వం నిరుడు మోటారు వాహనాల బిల్లుకు మోక్షం దక్కించడం తెలిసిందే. ఆ శాసన నిబంధనల ప్రకారం, నాసిరకం రోడ్ల నిర్మాణదారులకు విధించగల గరిష్ఠ జరిమానా- లక్ష రూపాయలు! అంతకు కొన్ని వందల రెట్లు లాభపడే అక్రమార్కులకు అదొక లెక్కా? పాడైనప్పుడల్లా మరమ్మతులు, ఆర్భాటంగా చేపట్టే అభివృద్ధి పనుల్లో కంతలు, ఎక్కడికక్కడ అవినీతి వాటావరణం... కోట్లు వెనకేసే నిరంతర పరిశ్రమగా స్థిరపడింది. మరి, అభాగ్యజనం గోడు పట్టించుకునేదెవరు?

అధ్వానంగా మారిన రోడ్లు, ఇబ్బందికరమైన పాదచారి మార్గాల వల్ల ఎవరికైనా ప్రాణనష్టం వాటిల్లినా గాయలైనా వారు ‘బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె’ నుంచి నష్టపరిహారం కోరవచ్చునంటూ కర్ణాటక ఉన్నత న్యాయస్థానం మొన్నీమధ్య తీర్పిచ్చింది. దానిపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ద్వారా సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఆ సంస్థకు అక్కడా తల బొప్పి కట్టింది. అయిదేళ్లక్రితం ఇదే అంశాన్ని స్పృశించిన బాంబే హైకోర్టు- ‘రాజ్యాంగంలోని 21వ అధికరణ మేరకు గుంతలు లేని రోడ్లు, సరైన పాదచారి బాటలు ప్రతిపౌరుడి ప్రాథమిక హక్కు’గా స్పష్టీకరించింది. కోర్టులంత కరాఖండీగా చెబుతున్నా, దేశంలో చాలాచోట్ల విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చకుండా అభాగ్యుల ప్రాణాలు కబళించడంలో యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, బిహార్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రికార్డులు బద్దలుకొడుతున్నాయి. ‘సుప్రీం’ ధర్మాసనం చెప్పినట్లు- ఈ దురవస్థకు సంబంధిత కార్పొరేషన్లు, గుత్తేదారులు, రాష్ట్రాల రహదారి విభాగాల అధిపతులు... అందరూ బాధ్యులే!

అమెరికాలో 41 లక్షల మైళ్ల నిడివిలో పబ్లిక్‌ హైవేలు, ఆరు లక్షల 15వేల దాకా వంతెనలు- అక్కడి సువ్యవస్థిత రవాణా నెట్‌వర్క్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో రహదారులు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా ప్రశంసలు పొందుతున్నాయి. రహదారి నిర్మాణ సంస్థలు, వాహన తయారీ కంపెనీలు, ఇంజినీర్లు, ట్రాఫిక్‌ పోలీసులు, ఆస్పత్రుల వరకు అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాదారి భద్రతను పెంపొందించడంలో మరెన్నో దేశాలు పోటీపడుతున్నాయి. మరిక్కడ? అసలే నాసిరోడ్లు. మరమ్మతులూ అంతంతమాత్రం. ఈ అస్తవ్యస్త రహదారులపై పట్టపగ్గాలు లేని ప్రమాదాల ఉరవడి కారణంగా ఏటా జీడీపీలో 3-5 శాతందాకా దేశం నష్టపోతున్నదన్న అంచనా వ్యూహకర్తల కళ్లు తెరిపించాలి. రోడ్ల అభివృద్ధి పనులకింద వెచ్చించే ప్రతి రూపాయీ ప్రజాధనమే. నాణ్యతలో పారిశ్రామిక దేశాలతో సరితూగుతామంటూ, నాసి నిర్మాణదారుల్ని నామమాత్రం జరిమానాలతో వదిలేస్తే ఎలా? రోడ్ల నిర్మాణంలో లొసుగులూ లోపాలకు గుత్తేదారులతోపాటు ఇంజినీర్లను అధికారుల్ని సైతం నేరుగా బాధ్యులను చేయాలి. స్వల్ప వ్యవధిలోనే చీటికిమాటికి మరమ్మతులు అవసరమైన పక్షంలో, అందుకయ్యే మొత్తం ఖర్చును వాళ్ల జేబుల్లోంచే రాబట్టాలి. రహదారుల నిర్మాణంలో నిష్పూచీతనాన్ని బదాబదలు చేసే సమర్థ కార్యాచరణతోనే మన రోడ్లు, బతుకులు బాగుపడతాయి. ఏమంటారు?

- బాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.