లంచాల రూపేణా (Corruption in India) సామాన్యుల రక్తాన్ని ఆబగా జుర్రుకోవడంలో భారతీయ అధికార యంత్రాంగానిది జలగలే సిగ్గుపడేంత స్థాయి! జనాన్ని చెండుకుతినడానికి ఎప్పటికప్పుడు సృజనాత్మక పద్ధతులను ఆవిష్కరించడంలోనూ దానిది అందెవేసిన చెయ్యి! ధనపిశాచాలను ఆవాహన చేసుకున్న పేరుగొప్ప ప్రజాసేవకులు ఆసియా మొత్తమ్మీద ఇండియాలోనే అత్యధికంగా పోగుపడ్డారన్న యథార్థం లోగడే వెలుగుచూసింది. ప్రపంచ అవినీతి సూచీలో మూడేళ్ల క్రితం 78వ స్థానంలో నిలిచిన దేశం- ఇటీవల 86వ ర్యాంకు సాధించి, అనితరసాధ్యమైన 'అభివృద్ధి'ని నమోదుచేసింది. తలో చెయ్యి వేసి భారతావనికి ఈ దుష్కీర్తి కిరీటాన్ని అలంకరించిన ఘనత వహించిన ఎందరో పెద్దలు, అధికారులు, నాయకమ్మన్యులను వేనోళ్ల కీర్తించాల్సిందే! సహస్ర బాహువులతో చెలరేగిపోతున్న ఆ అక్రమార్గ విక్రమార్కుల విశ్వరూప సందర్శనంతో పులకించిపోవాల్సిందే!
భాగ్యనగర పరిధిలోని రాజేంద్రనగర్ సబ్‌రిజిస్ట్రార్ అయిదున్నర లక్షల రూపాయల లంచం పుచ్చుకొంటూ తాజాగా అవినీతి నిరోధక విభాగానికి చిక్కారు. ఒక కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటే తన చేతులు తడపాల్సిందేనన్న ముంబై మహానగర ఏసీపీ సుజాతా పాటిల్ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. రూ.16 లక్షల మేరకు లెక్కల్లోకి రాని డబ్బును కారులో దాచిపెట్టి దర్జాగా విహరిస్తున్న ఐఆర్‌ఎస్ అధికారి శశాంక్ యాదవ్ ఇటీవలే రాజస్థాన్‌లో పట్టుబడ్డారు. ఏ రాష్ట్రమేగినా ఎందు కాలిడినా అవే దృశ్యాలు... అవినీతిని తమ జన్మహక్కుగా భావిస్తూ నోట్లకట్టల కోసం గడ్డి కరిస్తున్న ఎందరెందరో 'బాబుల' సిగ్గుమాలిన బాగోతాలు! అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలతో 2016-19 మధ్య దేశవ్యాప్తంగా 86 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. దుర్గంధభూయిష్ఠమైన అవినీతి మురికికూపాలపై 2019-20లోనే ప్రధానమంత్రి కార్యాలయానికి పన్నెండు వేలకు పైగా ఫిర్యాదులు పోటెత్తాయి. అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే నేరాలు- యావత్ సమాజానికే కంటకప్రాయాలని సుప్రీంకోర్టు ఎనిమిది నెలల క్రితం కన్నెర్ర చేసింది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టీకరించింది. కానీ, ఆయా రాష్ట్రాల ఏసీబీలు దాఖలు చేస్తున్న కేసుల్లో ఎందరికి శిక్షలు పడుతున్నాయంటే- చెప్పుకోవడానికే సిగ్గుచేటు! కర్ణాటకలో గడచిన అయిదేళ్లలో నమోదైన 1445 కేసుల్లో నాలుగంటే నాలుగింట్లోనే నిందితులపై నేరం 'రుజువైనట్లు' ఇటీవలే వెల్లడైంది. గుప్పిట్లోని ఇసుక రేణువులు జారిపోయినట్లుగా చట్టం కోరల్లోంచి తప్పించుకుంటున్న అక్రమార్కులు తరతమ భేదాలతో అన్ని రాష్ట్రాల్లోనూ లజ్జారహిత చిద్విలాస ముఖారవిందాలతో దర్శనమిస్తారు!
సహజ వనరులు స్వాహా..!
లంచాలు, పన్ను ఎగవేతలు, ధరల్లో మాయాజాలాల మూలంగా అరవై ఏళ్లలో (1948-2008) దాదాపు అర లక్ష కోట్ల డాలర్ల సంపద భారత ఆర్థిక వ్యవస్థ నుంచి అదృశ్యమైందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ సంస్థ గతంలో కుండ బద్దలుకొట్టింది. సహజ వనరులను గుటకాయ స్వాహా చేయడానికి పెద్దలు కుదుర్చుకునే చీకటి ఒప్పందాల పుణ్యమా అని ఇండియా సంవత్సరానికి లక్ష కోట్ల డాలర్లను నష్టపోతోందని మరో అధ్యయనంలో తేటతెల్లమైంది. ఏమైంది? అవినీతి కట్లపాముల కోరలను ఊడబెరకడంలో దేశం సాధించిన ప్రగతి- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు నీరోడుతోంది! నిపుణుల అంచనాల మేరకు అవినీతి మహమ్మారి కబంధ హస్తాల్లోంచి దేశం స్వేచ్ఛ సాధిస్తే ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు 20శాతం మేరకు ఇతోధికమవుతాయి. పెట్టుబడులు 12శాతం పెరిగి, జీడీపీలో 1.5శాతం వృద్ధి సాకారమవుతుంది. కానీ, సమీప భవిష్యత్తులో ఆ కల ఈడేరదని నిరుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాల్లో సాగిన ఒక సర్వేలో పాల్గొన్నవారిలో 75శాతం పెదవి విరిచారు. నిర్వేదభరితమైన ఆ జనాభిప్రాయంలో స్పష్టంగా ప్రస్ఫుటమవుతోంది- జాతి జవసత్వాలను ఊడ్చేస్తున్న మహమ్మారిని పారదోలడంలో ముణగదీసుకున్న వ్యవస్థల వైఫల్యమే! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించినట్లు- అవినీతి ఒక క్యాన్సర్ వంటిది. ప్రజాస్వామ్యంపై పౌరుల విశ్వాసాన్ని మింగేసే మహా రాచపుండు అది!
సా..గుతున్న విచారణ..
నవభారత నిర్మాణానికి ఆటంకమవుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలని ప్రధాని మోదీ తాజాగా సీబీఐ, సీవీసీలకు ఉద్బోధించారు. అక్రమార్కులను కలుగుల్లోంచి వెలుపలికి లాగి బోనెక్కించాలని పిలుపిచ్చారు. అందులో మరో మాటే లేదు. భారత కల్పవృక్షానికి పట్టిన అవినీతి చీడను వదిలించడంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదు. కానీ, నల్లమరకలతో నిండిన సీబీఐ చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆశాదీపాలన్నీ కొండెక్కిపోతాయి. గత సంవత్సరాంతానికి 9757 సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆ సంస్థ సంచాలకులు సుబోధ్ కుమార్ జయస్‌వాల్ తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించారు. అందులో 3249 కేసులు దశాబ్ద కాలంగా సా...గుతుంటే- ఇరవై ఏళ్లుగా విచారణ దశలోనే మగ్గిపోతున్నవి మరో 500 ఉన్నాయి! పెండింగ్ కేసుల జాబితాలో దిల్లీ, మహారాష్ట్రలు తొలి రెండు స్థానాల్లో నిలిస్తే- పశ్చిమ్ బంగ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్‌లు వాటి వెన్నంటి తళుక్కుమంటున్నాయి. నత్తనడకకు పర్యాయపదాలుగా మారిన విచారణలకు తోడు కేంద్ర దర్యాప్తు సంస్థలో ఇంటిదొంగలు తిష్టవేస్తూ, అసలుకే ఎసరుపెడుతున్నారు. 2016-19 మధ్య 19 మంది సీబీఐ అధికారులపై అవినీతి కేసులు నమోదైనట్లు కేంద్రమే లోగడ లోక్‌సభలో వెల్లడించింది. కంచే చేను మేస్తున్న దుర్భరావస్థలో ప్రధాని సంకల్పం సాకారం కావాలంటే- ఎవరి ఒత్తిళ్లకూ లోనుకాని స్వతంత్ర సంస్థగా సీబీఐ పనిచేయాలి. పార్లమెంటుకు తద్వారా ప్రజలకు జవాబుదారీ అయ్యేలా దాన్ని తీర్చిదిద్దాలి. యంత్రాంగంలోని లంచావతారులకు గట్టిగా బుద్ధిచెప్పాలంటే- సీవీసీ పూర్వ అధిపతి ఎన్.విఠల్ ప్రతిపాదించిన 13 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించాలి.
ఏనుగులు పట్టే కంతలను వదిలేసి, దోమలు దూరే రంధ్రాలను పూడ్చితే ఉపయోగమేమీ ఉండదు. గడచిన నాలుగేళ్లలో 38 మంది ప్రబుద్ధులు దేశీయంగా బ్యాంకులకు శఠగోపం పెట్టి విదేశాలకు చక్కాపోయారు! పది కోట్ల రూపాయల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కాకలుతీరిన ఘరానా పెద్దమనుషులు ఆ జాబితాలో కొలువుతీరారు. ఆ తిమింగిలాలను దేశానికి పట్టుకొచ్చి, వారు తిన్నది కక్కిస్తేనే అవినీతిపై పోరు పరిపూర్ణమవుతుంది. సీబీఐ, ఈడీ తదితర సంస్థలు దీనికి సిద్ధమేనా?
- శైలేష్ నిమ్మగడ్డ
ఇదీ చూడండి: నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు