ఉద్యోగుల హాజరు కోసమైనా, బ్యాంకుల్లో కస్టమర్ల అథెంటికేషన్ కోసమైనా, ఆధార్ వ్యాలిడేషన్ అయినా ఇమ్మిగ్రేషన్‌లో ప్యాసెంజర్లను అనుమతించేందుకైనా.. 'ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్' అనేది తప్పనిసరి సాధనంగా మారింది. గత కొంతకాలంగా వీటి వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేశాయి ఈ పరికరాలు.
అయితే కరోనా సంక్షోభం ఈ వ్యవస్థపై ప్రభావం చూపింది. ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్‌లో ప్రతీసారి వేలిని స్కాన్ చేయాల్సి రావడమే ఇప్పుడు సమస్యగా మారింది. సాధారణంగా వీటిని శుభ్రం చేయడం చాలా అరుదు. ఎక్కువ మంది చేతి వేళ్లను తాకించడం వల్ల స్కానర్లపై పెద్ద ఎత్తున బాక్టీరియా పేరుకుపోతుంది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ సమయంలో ఏదైనా ఉపరితలాన్ని తాకాలంటేనే భయాలు గుప్పుమంటున్నాయి.
దీంతో క్రమంగా వీటిని వదిలించుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రయాణికులు, ఉద్యోగులు, కస్టమర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వేరే సాధనాలవైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం కాంటాక్ట్‌లెస్ బయోమెట్రిక్ వ్యవస్థ, ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ బయోమెట్రిక్ టెక్నాలజీ వంటి సాధనాలు అథెంటికేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
మాస్క్ ధరిస్తే..
వైరస్ నుంచి తగిన భద్రత కల్పించడానికి ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ బయోమెట్రిక్ సురక్షితంగా భావిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల్లో భౌతికంగా తాకాల్సిన అవసరం ఉండదు. గొంతు, ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తుంది. కానీ వైరస్ కారణంగా ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాల్సి వస్తోంది. కాబట్టి సాధారణ ఫేషియల్ రికగ్నిషన్‌కు కూడా ప్రస్తుతం సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే అడ్వాన్స్డ్ ఫేషియల్ టెక్నాలజీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
థర్డ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్
వాయిస్ రికగ్నిషన్ సైతం థర్డ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌గా పనిచేస్తుంది. వ్యక్తుల వద్ద ఉన్న పాస్‌పోర్ట్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను ఫస్ట్ ఫ్యాక్టర్‌గా పరిగణిస్తారు. పాస్వర్డ్, పిన్ నెంబర్ వంటి వాటిని రెండో అథెంటికేషన్‌గా వ్యవహరిస్తారు.
ఈ సాంకేతికలను ఉపయోగించి సమర్థంగా వైరస్‌ను అడ్డుకోవచ్చు. వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించలేం కాబట్టి.. సరైన భౌతిక దూరం నిబంధనలను పాటించేందుకు ఈ సాంకేతికతలు ఉపయోగపడతాయి.
వ్యక్తుల స్వర నమూనాను పరిశీలించి వాయిస్ బయోమెట్రిక్ పనిచేస్తుంది. ఇది ఇతర ఫింగర్‌ప్రింట్, రెటీనా స్కానింగ్‌ల మాదిరిగానే ఉంటుంది. వాటిలో ఉన్న భద్రతా ప్రమాణాలు ఇందులోనూ ఉంటాయి.
ప్రామాణిక డొమైన్ ఆధారంగా వాయిస్ రికగ్నిషన్‌ను పలు విభాగాలుగా విభజించవచ్చు. అవి..
- ఫిక్స్డ్ టెక్స్ట్ పద్ధతి
- టెక్స్ట్ డిపెండెంట్ పద్ధతి
- టెక్స్ట్ ఇండిపెండెంట్ పద్ధతి
- సంభాషణ పద్ధతి(కన్వర్జేషనల్ టెక్నిక్)
రోజురోజుకూ భద్రతా ప్రమాణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం బ్యాంకులు, బీమా కంపెనీలు ఇతర ఆర్థిక సంస్థలకు భారంగా మారిపోయింది. చాలా వరకు సంస్థలు ఫోన్లోనే కస్టమర్ల లావాదేవీల వివరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కాబట్టి వాయిస్ బయోమెట్రిక్ ద్వారా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించి కస్టమర్ల స్వర నమూనాను ధ్రువీకరించవచ్చు. దీని ని ఉపయోగించడం ద్వారా వ్యాపార సంస్థలకు సైతం చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఫేస్ రికగ్నిషన్లో ముఖ కవళికలను బట్టి వ్యక్తులను ధ్రువీకరించడం జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ వ్యవస్థలో మానవ ముఖంలోని 80 నోడల్ పాయింట్లను గుర్తిస్తుంది. ముఖం చివరి భాగాలు, ముక్కు పొడవు వెడల్పు, చెంపల ఆకారం, కళ్ల లోతు వంటి వాటిని నోడల్ పాయింట్లుగా వ్యవహరిస్తారు. ఒక వ్యక్తి డిజిటల్ ఫొటోపై నోడల్ పాయింట్లను గుర్తించడం ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత పనిచేస్తుంది.
మల్టీ మోడల్ బయోమెట్రిక్
మరింత సమర్థమైన ప్రామాణీకరణ కోసం మల్టీ మోడల్ బయోమెట్రిక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. రెండు సాధారణ బయోమెట్రిక్ వ్యవస్థల కలయికతో వీటిని రూపొందిస్తున్నారు. అత్యంత కచ్చితత్వం, సింగిల్ బయోమెట్రిక్‌తో పోలిస్తే మరింత మృదుత్వంతో పనిచేయడం ఇవి పనిచేయడం విశేషం. ముఖంతో పాటు స్వర నమూనాలను సంయుక్తంగా పరిశీలించి ప్రామాణికతను నిర్ణయించడం వీటి ప్రత్యేకత. రెండు నమూనాలను అధునాతన ఫ్యూజన్ అల్గారిథం ద్వారా విశ్లేషిస్తుంది.
చివరగా...
ఈ సాంకేతికతలన్నీ కాంటాక్ట్ లెస్ పద్ధతిలో సమర్థమంతంగా పనిచేస్తాయి. మల్టీమోడల్ విధానంలో కచ్చితమైన ఫలితాలు ఇస్తాయి. భవిష్యత్తులో ఫింగర్ బయోమెట్రిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే అత్యుత్తమ సాంకేతికతలు ఇవే.
(రచయిత-కర్నల్ ఇంద్రజీత్ సింగ్, సైబర్ భద్రతా నిపుణుడు, సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్)