ETV Bharat / opinion

సంక్షోభ సమయమే పరిశ్రమల ఏర్పాటుకు తరుణోపాయం!

author img

By

Published : Aug 19, 2020, 6:57 AM IST

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ సంక్షోభ సమయాల్లోనే పురుడుపోసుకున్నాయి. నూతన వ్యవస్థాపకుల సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రపంచస్థాయి సంస్థలను స్థాపించారు. ఫలితంగా లక్షల మందికి ఉపాధి దొరికింది. అలాగే కరోనా సంక్షోభాన్ని కూడా సదవకాశంగానే భావించాలంటున్నారు నిపుణులు.

Coronavirus pandemic crisis is good opportunity to build creativity and to introduce new entrepreneur
సంక్షోభమే పరిశ్రమల ఏర్పాటుకు తరుణోపాయం!

ఏ దేశ ఆర్థిక చరిత్ర పరిశీలించినా క్లిష్ట ఆర్థిక సంక్షోభాల్లోనే విశ్వవిఖ్యాత సంస్థలు ఉద్భవించాయి. విపత్కర పరిస్థితుల్లోనే కొత్త వ్యవస్థాపకులు సృజనాత్మకమైన ప్రపంచస్థాయి వ్యాపార సంస్థలను స్థాపించారు. ఈ కోవకు చెందినవే- అమెరికాలోని డిస్నీ (1923), జనరల్‌ మోటార్స్‌ (1908), మైక్రోసాఫ్ట్‌ (1975), నెట్‌ఫ్లిక్స్‌ (1997), ఆపిల్‌ ‘ఐ’ పాడ్‌ (2000), మొదలైనవి. ఈ సంస్థల వ్యవస్థాపకులు కొత్తగా వెలుగులోకి వచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించడమే గాక, ఆ దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చారు.

సృజనకు కొదవలేని భారత్‌

ఇండియాలో ఆరో దశకంలో హరిత విప్లవమూ వరస కరవు కోరల్లోనుంచి పుట్టినదే. ఎందరో స్వాప్నికుల కృషితో 1991 సంవత్సరం నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెంది, నిరుద్యోగ నిర్మూలనకే కాదు- ఆర్థికాభివృద్ధికీ చేయూతనిచ్చింది. భారతదేశంలోనూ ఎందరో సృజనాత్మకమైన వ్యవస్థాపకులు ఉన్నారనే విషయం 'గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మానిటర్‌ (జీఈఎం)' పరిశోధనలో వెల్లడయింది. ఈ సంస్థ ఏటా 115 దేశాల్లో నుంచి పరిశోధనలు జరిపి, ఆయా దేశాల వ్యవస్థాపకుల స్థితిగతులను తెలుపుతుంది. 2019 గణాంకాల ప్రకారం, 20శాతం (18-64 మధ్య వయసు) భారతీయులు రానున్న మూడేళ్లలో వివిధ రకాల పరిశ్రమలు స్థాపించాలనే ఉత్సుకతతో ఉన్నారని నివేదించింది.

వ్యవసాయం తర్వాత ఎంఎస్​ఎంఈలే..

భారత్‌లో 2006లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం ప్రవేశపెట్టి, పరిశ్రమలకు సరళీకృత వాతావరణాన్ని కల్పించారు. దాని ప్రభావంతో ప్రస్తుత గణాంకాల ప్రకారం సుమారు 6.50కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా దాదాపు 12 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ బృహత్తర కార్యక్రమం నూతనంగా ఉద్భవించిన వ్యవస్థాపకులతోనే సాధ్యమైంది. మనదేశంలో వ్యవసాయ రంగం తరవాత పెద్దయెత్తున ఉద్యోగావకాశాలు లభిస్తోంది ఈ రంగంలోనే. ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఊతమిచ్చేదిగానూ ఉంది. ప్రపంచంలో భారత్‌ సరళతరమైన వ్యాపారాలు చేయడంలో 2014వ సంవత్సరంలో 142వ స్థానంలో ఉంటే, 2019నాటికి 63వ స్థానానికి ఎగబాకింది. ఈ పురోభివృద్ధి కేవలం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధితోనే సాధ్యమైంది. ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు మన జనాభాలో 62శాతం 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్నవారు.

ప్రస్తుత సంక్షోభంలో 'ఆత్మనిర్భర్‌ భారత్‌' ద్వార సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకిచ్చిన ప్యాకేజీ కేవలం నడుస్తూ ఆగిపోయిన తయారీ, సేవారంగాల్లో ఉండే పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వచనాలను ఈ సంవత్సరం మే నెలలోనే (ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో) సవరించారు. పరిశ్రమ పెట్టుబడి, వార్షికాదాయం ఆధారంగా ఈ మూడు రకాల పరిశ్రమలను నిర్వచించారు. ఈ సవరణలో మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి రూ.50కోట్లకు, వార్షికాదాయం రూ.250కోట్లకు పెరిగింది. ఫలితంగా కొత్త వ్యవస్థాపకులు అధునాతన సాంకేతికతతో కూడిన మధ్యతరహా పరిశ్రమలు స్థాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా సుమారు అయిదు కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణలను అందించారు. వీరిలో చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వ్యవస్థాపక లక్షణాలు కలిగి ఉండీ, చిన్నతరహా వ్యాపారాలను ప్రారంభించాలనే తపన కలిగినవారిని గుర్తించి, ప్రోత్సహించగలిగితే- చిన్న వ్యాపారాలు స్థాపించడానికి ఇతోధిక అవకాశముంది. ఈ చిన్నతరహా తయారీ సేవారంగాల పరిశ్రమలు పెద్ద పరిశ్రమలకు అనుసంధానం చేసినట్లైతే పెద్దయెత్తున ఉద్యోగాలు కల్పించడంతోపాటు, ఆర్థికాభివృద్ధీ సాధ్యమవుతుంది.

ప్రోత్సాహం అవసరం

మనదేశంలో వ్యవసాయం, పండ్లు, ఆక్వారంగ ఉత్పత్తులు విరివిగా వస్తున్నాయి. దీనికి అనుబంధమైన ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపన జరగడం లేదు. నూతన వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ద్వారా కొత్త పరిశ్రమలు నెలకొల్పడం సాధ్యమవుతుంది. ఈ పరిశ్రమలకు సంబంధించిన శీతలీకరణ, రవాణా, ప్యాకేజింగ్‌ తదితర సేవారంగాల వ్యాపారాలు స్థాపించడానికి వీలు కలుగుతుంది. ఈ చర్యల ద్వారా గ్రామీణ ఆర్థిక సరఫరా గొలుసులు స్థిరపడి, తద్వారా గ్రామీణార్థికం బలపడుతుంది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, నూతన వ్యవస్థాపకుల అవసరం ఎంతో ఉంది. భారత్‌-చైనా ఉద్రిక్తతల కారణంగా చాలా తయారీరంగ వస్తువులు, సేవలు ఆగిపోయాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారా ఈ కొరతను అధిగమించడానికి వీలుపడుతుంది. కొవిడ్‌ ప్రభావంతో, ఇంకా అనేక కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు పెద్ద పరిశ్రమల స్థాపనకు భారత్‌ వైపు చూస్తున్నారు. దీనికి అనుగుణంగా కొత్త వ్యవస్థాపకులను ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాల్సిన అవసరముంది.

కొవిడ్‌ విపత్తును ఎదుర్కోవడానికి ఎన్నో ఉత్పత్తులు, సేవలు అవసరం. ఉదాహరణకు పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు, వైద్యశాల సామగ్రి, ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సేవలు అవసరమవుతాయి. నూతన వ్యవస్థాపకులకు మద్దతిచ్చి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్దయెత్తున స్థాపించడం ద్వారా ఈ అంతరాన్ని అధిగమించవచ్ఛు మనదేశ ప్రస్తుత ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చురుకైన వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి- కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనువైన వ్యవస్థాపక చట్టాలను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. నూతన పారిశ్రామికవేత్తలను ఉత్తేజపరచడానికి ప్రణాళికాబద్ధంగా ఒక ప్యాకేజీ అమలుపరచాల్సిన అవసరమూ ఉంది. ఈ తరహా విశ్వసనీయమైన చర్యలు చేపడితేనే 2024నాటికి లక్ష్యంగా నిర్దేశించుకున్న అయిదు లక్షల కోట్ల డాలర్ల జీడీపీ స్థాయికి మనదేశం చేరుకోగలదు.

రచయిత - డాక్టర్‌ చుక్కా కొండయ్య,

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంఎస్‌ఎంఈ మాజీ డైరెక్టర్‌ జనరల్‌

ఇదీ చూడండి: కరోనాతో ఉపాధి కోల్పోయిన 41 లక్షల మంది యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.